
డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా
సొంత తల్లిదండ్రుల నుంచే డబ్బు గుంజేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిన 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టుచేశారు. న్యూఢిల్లీలోని కిషన్ విహార్ ప్రాంతానికి చెందిన సాగర్ కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్మన్గా పనిచేస్తుంటాడు. మోదీనగర్లో ఉన్న తమ సోదరికి డబ్బు ఇచ్చేందుకు వెళ్లిన అతడు కిడ్నాప్ అయ్యాడని అతడి సోదరుడు సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని విడిపించేందుకు కుటుంబ సభ్యులు కొంత డబ్బు చెల్లించినా, తిరిగి రాలేదు. అతడికున్న మూడు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి తన కళ్లకు గంతలు కట్టి తన దగ్గరున్న డబ్బు, ఫోన్లు, ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోయారని సాగర్ చెప్పాడు. తన స్టేట్ బ్యాంకు అకౌంట్లో రెండు లక్షలు డిపాజిట్ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు చెప్పాలని, లేకపోతే తనను చంపేస్తామన్నారని అతడు చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు మర్నాడే రెండు లక్షలు వేశారు.
అయితే కిడ్నాపర్లు తన చేతిని నరికేశారంటూ సాగర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాగర్ హరిద్వార్లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఎంత గాలించినా దొరకని అతడు.. చివరకు ఏటీఎం వద్ద దొరికిపోయాడు. పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి తానే డ్రామా ఆడినట్లు అంగీకరించేశాడు. అతడి హోటల్ గది నుంచి లక్షా పదిహేను వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.