
రాంచీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండగా, అక్కడక్కడా పోలీసుల ఓవరాక్షన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో బయటకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టి మూత్రం తాగించిన ఘటన కలకలం రేపింది. రాంచీలోని హింద్‌పిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చిరువ్యాపారిగా భావిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. యువకుడిని చుట్టుముట్టిన పోలీసులు అతడిని కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను కొట్టవద్దని యువకుడు ప్రాధేయపడుతున్నా వినిపించుకోని ఖాకీలు అతడిని కర్కశంగా కొడుతున్నట్టు వీడియోలో కనిపించింది.
యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హింద్‌పిరి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేసిన డీఎస్పీ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని రాంచీ ఎస్‌పీ తెలిపారు. కాగా రాంచీలో మంగళవారం కరోనా వైరస్ పాజిటివ్ తొలికేసు నమోదైంది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన మలేషియన్ మహిళను ఐసోలేషన్‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment