పరారీ నేరస్థుల కోసం యూట్యూబ్ ఛానెల్
నేరాలు చేస్తూ సీసీ కెమెరాల కంటికి చిక్కుతున్నప్పటికీ.. పోలీసుల చేతికి చిక్కకుండా పరారీలో..
సాక్షి, అగ్రా: నేరాలు చేసి పరారీలో ఉండే నిందితులను పట్టుకునేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. యూట్యూబ్ లో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది. వాటి ద్వారా నిందితులను పట్టుకోవాలన్నదే ఆగ్రా పోలీస్ శాఖ ఆలోచనగా కాగా, దేశంలోనే ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది కావటం విశేషం.
సైబర్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను విస్తరించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు. ‘గతంలో ఇన్‌ఫార్మర్‌ల సేవలను వినియోగించుకునే వాళ్లం. కానీ, రాను రాను అది వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతూ వస్తోంది. ఇప్పుడు వీడియో సాక్ష్యాలే దాదాపు అన్ని కేసుల్లో కీలకంగా మారుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో మాకిదే ఉత్తమ మార్గంగా అనిపించింది. పైగా ఇప్పుడు నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంది. నేరస్థులు తమకు తెలీకుండానే వాటి కంటికి చిక్కిపోతున్నారు. తద్వారా వారిని పట్టుకునేందుకు చాలా సులువుగా మారుతుంది అని ఆయన తెలిపారు.
అయితే వారి జాడ ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో.. ఈ యూట్యూబ్ వీడియోల ఆలోచన ద్వారా ఎవరో ఒకరు స్పందిచకపోతారా? అన్న అనుమానాలతోనే తాము ఈ ప్రయత్నం మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ‘
ఆగ్రా రేంజ్ క్రైమ్ వీడియో’ పేరిట ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానెల్ లో నేరాలకు సంబంధించి వీడియోలు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తారు. అందులోని నేరస్థులను గుర్తుపట్టిన వాళ్లు ఎక్కడున్నారన్న సమాచారం పోలీస్ శాఖకు అందించవచ్చు. అవసరమైతే వారి విషయాలు గోప్యంగా ఉంచుతారు. వారి పేర్లను బహిర్గత పరిచేందుకు అంగీకరిస్తే మాత్రం ప్రజలందరి వారిని ఘనంగా సన్మానిస్తాం అని ఐజీ తెలిపారు. ఇప్పటి వరకు ఆ ఛానెల్‌లో 15 వీడియోలు అప్ లోడ్ చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆగ్రా పోలీస్ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నాలను పలువురు ప్రశంసిస్తున్నారు.