ఉదయమే కియా ఎండీతో మాట్లాడా: మిథున్‌రెడ్డి | YSRCP MP Mithun Reddy Slams TDP And Condemn News On Kia Motors | Sakshi
Sakshi News home page

అందుకే ‘కియా’ తరలింపు అంటూ టీడీపీ దుష్ప్రచారం..

Published Thu, Feb 6 2020 1:19 PM | Last Updated on Thu, Feb 6 2020 3:06 PM

YSRCP MP Mithun Reddy Slams TDP And Condemn News On Kia Motors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదని.. తాను ఈరోజు ఉదయమే కియా ఎండీతో మాట్లాడానని గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కియా మోటార్స్‌ తరలింపుపై టీడీపీ ఎంపీలు లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది. సేవ్ చంద్రబాబు, సేవ్ స్కామ్స్ అనే లక్ష్యంతో టీడీపీ మీడియాలో ప్రచారం నడుపుతోంది’’ అని మిథున్‌రెడ్డి విమర్శించారు.(రాయిటర్స్‌ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం)

అదే విధంగా ఈ విషయం గురించి వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘కియా పరిశ్రమ తరలిపోవడం లేదు. టీడీపీ, ఎల్లో మీడియా  దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయి.  పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలలో లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు కుట్ర జరుగుతోంది’’ అని టీడీపీ తీరుపై మండిపడ్డారు. కాగా కియా పరిశ్రమ తరలిస్తున్నారని పేర్కొన్న రాయిటర్స్‌ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని.. కియా- ఏపీ ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు. కియా మోటార్స్‌ కూడా రాయిటర్స్‌ కథనాన్ని ఖండించింది. 

భవిష్యత్తులో మరో కియా ప్లాంటు..
కియా మోటార్స్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ విషయంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తమిళనాడుకి వెళ్లే తరుణంలో.. దానిని ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు. కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదని పేర్కొన్నారు. ఆయన హయాంలో సంస్థకు ఎలాంటి సహకారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడేమో కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని.. భవిష్యత్తులో మరో ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. కియా మోటార్స్ గురించి పార్లమెంట్ లోపలా, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు మతి భ్రమించింది..
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు. అందుకే కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ తన ఎల్లో మీడియా ద్వారా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్న చంద్రబాబు.. ఇప్పుడు కియా పరిశ్రమ తరలిపోతుందంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని.. 23 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement