సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డాని గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యం తప్పు వల్ల అడ్మిషన్లు కోల్పోయి రోడ్డున పడ్డ 100 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని జేపీ నడ్డాను వైవీ సుబ్బారెడ్డి మరోసారి కోరారు. అడ్మిషన్లు కోల్పోయిన 100 మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేసేందు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి 100 సూపర్ న్యూమరీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే విధమైన ఆర్డినెన్స్ ద్వారా గతంలో కేరళ, పాండిచ్చేరిలో విద్యార్థులకు సీట్లు సర్దుబాటు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వీలైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఒప్పించి ఫాతిమా కళాశాలకు 100 సీట్లు అదనంగా కేటాయించేలా సిఫార్సు చేయాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రమంత్రి ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment