ఢిల్లీ : ‘నా మాటలు రాసిపెట్టుకోండి హస్తిన పీఠంపై కమలం జెండా ఎగురవేయబోతోంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్‌సైక్లోపీడియా’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్రిముఖ పోరులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం అధిష్టానం ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా తన ఎన్నికల ప్రచారాన్ని వేగం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ‘ఏక్ తక్ బీజేపీ’ (బీజేపీకి అవకాశమివ్వండి) నినాదంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు.
ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికలపై జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారని, ఇప్పుడు భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఈసారి ఆప్ (AAP-da)కు గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం’ అని అన్నారు.
కేజ్రీవాల్ అబద్ధాల ఎన్ సైక్లోపీడియా. ఢిల్లీ ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు. ఆప్ అవినీతి చేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషించడంలో మించి పోయింది. అందులో మద్యం పాలసీ ఒకటి. ఆప్ కన్వీనర్ అవినీతి చేసేందుకు వినూత్న పద్దతుల్ని ఎంచుకున్నారు. జైలుపాలయ్యారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై నడ్డా స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో వ్యూహం ఉంటుంది. మాకు వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఢిల్లీలో కూడా అంతేనని’ వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment