జిందగీ ఛానల్ లో పాక్ కార్యక్రమాల ప్రసారం నిలిపివేయనున్నట్లు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వెల్లడించారు.
ముంబై: ఈజిప్టు, టర్కీ, పాకిస్థాన్ నుంచి కార్యక్రమాల్ని తీసుకుని ప్రసారం చేసే జీటీవీ గ్రూపులోని జిందగీ ఛానల్ ఇకనుంచి పాక్ కార్యక్రమాల్ని ప్రసారం చేయడాన్ని నిలిపివేయనున్నట్లు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వెల్లడించారు. పాక్‌కు చెందిన కళాకారులు భారత్‌ను విడిచి రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునివ్వడం దురదృష్టకరమని సుభాష్ చంద్ర అన్నారు.
ఐక్యరాజ్య సమితిలో నవాజ్ షరీఫ్ అలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అందుకే జిందగీలో పాక్ ఆధారిత కార్యక్రమాల్ని నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక పాక్‌కు చెందిన కళాకారులు భారత్‌ను విడిచివెళ్లిపోవాలని సుభాష్ చంద్ర ట్వీట్ చేశారు. 2014లో జీగ్రూప్ జిందగీ ఛానల్‌ను ప్రారంభించింది. జిందగీ ఛానల్‌లో ప్రసారమైన ఆన్‌జారా, హమ్‌సఫర్, కిత్నీ గిర్‌హైన్ బాకీ హైన్, మాత్ అండ్ జిందగీ, గుల్జార్ హై వంటి అనేక కార్యక్రమాలు పాకిస్తాన్‌తో మనదేశంలోనూ విశేష ఆదరణ పొందాయి.
ఫవాద్, మహీరా ఖాన్ వంటి పాక్ కళాకారులు తక్షణం భారత్‌ను విడిచివెళ్లాల్సిందిగా మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే హెచ్చరించారు. పొరుగుదేశంలోని కళాకారుల్ని అరువుతెచ్చుకొని స్వదేశంలోని ప్రతిభ గల కళాకారుల అవకాశాలను కొట్టివేస్తున్నారని.. వినియోగించుకుంటే అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులు మనదేశంలోనే ఉన్నారని ఎంఎన్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బాలీవుడ్ నిర్మాతలకు బహిరంగ లేఖ రాశారు.