సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూసీ చూసీ నిరాశలో కూరుకుపోయిన అధికార పార్టీ నేతల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం.. ఏప్రిల్‌లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ కంటే ముందే ఈ పదవులను భర్తీ చేసే అవకాశాలున్నాయని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న ఈ పదవులను ఎట్టకేలకు భర్తీ చేయాలనే నిర్ణయానికి అధినేత కేసీఆర్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్లుగా వేచి చూస్తున్న నాయకులకు ఈ సీట్లు దక్కనున్నాయి. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇప్పటికే ఉన్న కార్పొరేషన్లతో పాటు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300లకు పైగా డైరెక్టర్ పోస్టులున్నాయి.
అప్పట్లోనే వీటిని భర్తీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయా పదవుల కోసం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలను తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు, ఐదుగురు పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. అయితే, ఇప్పటివరకు ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఎట్టకేలకు పార్టీ ప్లీనరీ కంటే ముందే ఆయా పదవులు భర్తీ చేసే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఈ పదవులు భర్తీ అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సుమారు 40 డైరెక్టర్ల పదవులు దక్కే అవకాశాలున్నాయి.
ప్రత్యేక జాబితా!
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన నాయకులకే కాకుండా ప్రత్యేకంగా కొందరికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులకు కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యతనివ్వడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఎమ్మెల్యేల వద్ద ప్రాధాన్యత దక్కడంతో పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి నేతల పేర్లను కూడా ఎమ్మెల్యేలు ఈ పదవుల కోసం ప్రతిపాదించలేదు. సీనియర్ నాయకులు, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారిని జిల్లాల వారీగా గుర్తించి నామినేటెడ్ పదవులను కేటాయించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద ఈ పదవుల భర్తీలో పాత, కొత్త నేతలకు సమన్యాయం జరిగేలా అధినేత ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారం సాగుతోంది. కాగా జిల్లా స్థాయిలోని కీలకమైన నామినేటేడ్ పదవులు కూడా భర్తీకి నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల నియామకం జరిగింది. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గం పదవుల భర్తీ కూడా జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో మాత్రం ఇంకా ఎవ్వరినీ నియమించలేదు. ఈసారి ఈ పదవి కూడా భర్తీ అయ్యే అవకాశాలున్నాయని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment