నరకం నుంచి నవశకంవైపు | AP Government Save NRIs in Malaysia | Sakshi
Sakshi News home page

నరకం నుంచి నవశకంవైపు

Published Sat, Jan 4 2020 1:03 PM | Last Updated on Sat, Jan 4 2020 1:03 PM

AP Government Save NRIs in Malaysia - Sakshi

మలేషియా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మన రాష్ట్రానికి చెందిన బాధితులు

తూర్పుగోదావరి, మామిడికుదురు: కుటుంబ సభ్యులను వదలి పెట్టి, అయినవాళ్లకు దూరంగా ఎన్నో ఆశలతో మలేషియా వెళ్లారు వారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన చాలామంది కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోయి అష్టకష్టాలు పడ్డారు. పరాయి దేశం.. తెలియని భాష.. తెలిసిన వాళ్లు ఎవరూ లేని ప్రాంతం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా వాటిని దిగమింగుకుని కాలం వెళ్లదీశారు. పాస్‌పోర్టులు ఏజెంట్ల చేతిలో చిక్కుకు పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడే ఏళ్ల తరబడి మగ్గిపోయారు. కూలీలా పని చేస్తూ తినడానికి కూడా సరైన తిండి కూడా లేక జీవచ్ఛవాలుగా బతుకు వెళ్లదీశారు.

స్వగ్రామాలకు ప్రాణాలతో వస్తారో! లేదో తెలియని నిస్సహాయ స్థితిలో కొట్టామిట్టాడారు. తమ కుటుంబ సభ్యులతో కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లేక తల్లడిల్లిపోయారు. ఉపాధి కోసం మలేషియా వెళ్లిన తమవారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియక మన రాష్ట్రంలో బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన అనుభవించారు. సినిమా కష్టాలను తలపించే ఈ కన్నీటి వ్యధలకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ తరహా బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీ ఎస్‌ఆర్‌టీఎస్‌) ద్వారా మలేషియాలో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన బాధితులను స్వగ్రామాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆమ్నెస్టీ సంస్థ మలేషియా విభాగం ద్వారా అక్కడ చిక్కుకున్న మన రాష్ట్రవాసులను స్వగ్రామాలకు తీసుకువచ్చింది. మన రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 150 మంది ఇంత వరకు విడతల వారీగా స్వగ్రామాలకు చేరుకున్నారు.  మలేషియాలో ఉన్న వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ బొలిశెట్టి శ్రీరామ్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వగ్రామాలకు చేరుకున్న బాధితులు తమ గోడును మలేషియాలో పడ్డ కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు.  

ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో వెళ్లాను
మాది చాలా నిరుపేద కుటుంబం. మా ఇంట్లో వారంతా కూలీలే. ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను ఐటీఐ వరకూ చదువుకున్నాను. గ్యాస్‌ కంపెనీలో ఉద్యోగం అని చెప్పి ఏజెంట్‌ మలేషియా పంపించాడు. నా కోసం రూ.1.6 లక్షల వరకు అప్పు చేశారు. మూడున్నరేళ్ల క్రితం అక్కడకు వెళ్లాను. మలేషియాలో నాకు వచ్చే ఆదాయంతో స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో వెళ్లాను. కానీ నాకు అక్కడ కూలీ పని ఇచ్చారు. నాతో పాటు మరో ముగ్గురు తెలుగు వారి పాస్‌పోర్టులు తీసుకుని మమ్మల్ని ఏజెంట్‌ మోసం చేశాడు. వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సహకారంతో తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్నాను.- బత్తిన సాయిభగవాన్, బావాయిపాలెం, నిడమర్రు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

రెండున్నరేళ్లు వెట్టి చాకిరీ చేయించుకున్నారు
రెస్టారెంట్‌లో క్యాషియర్‌ పని ఉందని చెప్పి మలేషియా తీసుకువెళ్లారు. 2017 ఆగస్టులో నేను అక్కడికి వెళ్లాను. అప్పటి నుంచీ నా చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. చేసిన పనికి జీతం ఇవ్వలేదు. 24 గంటలూ పని చేయించుకున్నారు. విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. సరైన తిండి కూడా పెట్టలేదు. పోలీసు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామంటూ బెదిరించారు. నాకు అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారు. అమ్మ, చెల్లికి ఇక్కడ ఆపరేషన్‌ జరిగింది. అక్కడ వచ్చే జీతంతో వారిద్దరినీ పోషించాలనుకున్నాను. కానీ నా ఆశ నెరవేరలేదు. రాత్రి సమయంలో పారిపోయి వచ్చి ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ని ఆశ్రయించాను. వారి సహకారంతో కుటుంబ సభ్యులను కలుసుకున్నాను.  అయినవిల్లి సతీష్‌చంద్ర, కడియం  

మోసపోయిన వారిని మన రాష్ట్రానికి పంపిస్తున్నాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మలేషియాలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను మన రాష్ట్రానికి పంపిస్తున్నాం. మలేషియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్మెస్టీ (క్షమాభిక్ష) ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత వరకు 150 మందిని స్వగ్రామాలకు పంపించాం. బాధితులకు విమాన ప్రయాణ టిక్కెట్లు, ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారికి నచ్చిన రంగంలో ఉచిత  శిక్షణ కల్పించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.    బొలిశెట్టి శ్రీరామ్, వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్, మగటపల్లి

పాస్‌పోర్టు తీసేసుకుని ఇబ్బంది పెట్టారు
మాది చాలా పేద కుంటుంబం. విశాఖపట్నంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని  అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాం. ఎన్నో ఆశలతో రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లాను. డ్రైవర్‌ ఉద్యోగం ఉందని చెప్పి ఏజెంట్‌ మలేషియా పంపించాడు. తీరా అక్కడకు వెళ్లాక కూలీ పని ఇచ్చాడు. పాస్‌పోర్టు తీసేసుకుని నా చేత పనులు చేయించుకున్నారు. ఇంటికి వెళ్లి పోతాననని ప్రాధేయపడినా కనికరించలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అష్టకష్టాలు పడి ఏపీఎన్‌ఆర్‌టీ సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయతో కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కలిగింది.ఎస్‌కే బషీర్, విశాఖపట్నం

హీనమైన పని చేయించారు
నేను డిప్లొమా వరకు చదువుకున్నాను. ఎనిమిది నెలల క్రితం మలేషియా వెళ్లాను. నా దగ్గర ఏజెంట్‌ లక్ష రూపాయలు తీసుకున్నాడు. మూడు నెలలు ఏ విధమైన పని లేకుండా ఖాళీగా ఉన్నాను. రెండు నెలలు పని చేశాను. చేసిన దానికి ఏ విధమైన జీతం ఇవ్వలేదు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం అని చెప్పారు. నా చేత చాలా హీనమైన పని చేయించుకున్నారు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను చదివించాడు. అక్కడ నాకు వచ్చే ఆదాయంతో స్వగ్రామం వచ్చి వ్యాపారం చేసుకోవాలన్న ఆశతో వెళ్లాను. ఎట్టకేలకు సీఎం జగన్‌ సహకారంతో స్వగ్రామం చేరుకున్నాను.
మహ్మద్‌ సాజిద్, ఎర్రగుంట్ల, కడప జిల్లా  

అడవులు నరికించారు
మాది పెద్ద కుటుంబం. నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మ, నా భార్య కూలీ పని చేస్తారు. కంపెనీ పని అని ఏజెంట్‌ చెప్పాడు. మా నుంచి ఏజెంట్‌ రూ.1.52 లక్షలు తీసుకున్నాడు. అప్పు చేసి మా కుటుంబ సభ్యులు నన్ను మలేషియా పంపించారు. ఏడాదిన్నర క్రితం నేను మలేషియా వెళ్లాను. అక్కడకు వెళ్లిన తరువాత కూలీ పని చేయించారు. మాకు ఏవిధమైన ఆస్తిపాస్తులు లేవు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాపై ఎంతో ఆదరణ చూపించింది. ప్రాణాలతో వస్తామన్న ఆశ లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సహకారంతో కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.  భుక్త శ్యామ్, కేదారపురం, శ్రీకాకుళం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement