లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి వెయ్యి మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్నారు. అదే స్పూర్తితో రాష్ట్ర ఆపదర్మ మంత్రి కేటీఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను 'చేనేత బతుకమ్మ దసరా సంబరాలు' గా జరుపుకున్నామన్నారు.
టాక్ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని ఈవెంట్స్ ఇంచార్జ్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కల్చరల్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన దసరా 'అలాయ్ బలాయ్' అందరిని ఆకట్టుకుందన్నారు. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి(బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిధులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు.
బతుకమ్మల మధ్య చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి అమిత్ శర్మతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని, అలాగే చాలామంది చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. పండగకు అడబిడ్డలను చేనేత శాలువాలతో సత్కరించిన కేటీఆర్‌కు, యూకే అడబిడ్డల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవితతో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, ముఖ్య సభ్యులు గోపాల్ మేకల, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు, సాయి బూరుగుపల్లి, సత్యం కంది, వంశీ వందనపు, వేణు గోపాల్ రెడ్డి, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, నవీన్ భువనగిరి, రవి రత్తినేని, రవి ప్రదీప్ పులుసు, సత్య చిలుముల, శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ, రవి కిరణ్, వెంకీ సుధీరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి వంశీ పొన్నం, రాజేష్ వాకా, నగేష్ బచ్చనబోయిన, రవీందర్ రెడ్డి, సతీష్ రెడ్డి బండ మహిళా విభాగం సభ్యులు, సుప్రజ పులుసు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, శ్రావ్య వందనపు, మమత జక్కీ, శ్వేతా మహేందర్, ప్రియాంక తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment