
అబుదాబీ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అబుదాబీలో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్‌లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అబుదాబీ నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు పదిహేను వందల మంది తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫిదా మూవీ ఫేమ్ టి శరణ్య వేడుకలను మరింత తారస్థాయికి చేర్చింది.
డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మలతో ప్రాంగణానికి చేరగా, ప్రార్థన గీతంతో కార్యక్రమం మెదలైంది. చిన్నారుల ఆట, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడపడుచుల బతుకమ్మ ఆట, పాటలతో ఐఎస్‌సీ ఆడిటోరియం మరో తెలంగాణను తలపించింది. బతుకమ్మ సాంప్రదాయకంగా నిమజ్జనం చేస్తూ ప్రసాదాలు పంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అందమైన బతుకమ్మలకు, సాంప్రదాయకంగా తయారైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి నిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వీ, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.