
ఓర్లాండో(అమెరికా) : అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది. బుర్రకథను పద్యనాటకాన్ని కలుపుతూ తయారు చేసిన కథనం, కథనానికి ధీటుగా సంభాషణలు సాగాయి. ప్రవాస యువకవి తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి రాసిన పద్యాలు సంభాషణలకు ప్రాణం పోశాయి.
చాణక్య పాత్రలో శర్మమొదలి అద్భుతంగా నటిస్తే, చంద్రగుప్తమౌర్యునిపాత్రలో సాయిప్రభాకర్ యెర్రాప్రగడ అభినయం ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా సాగింది. గ్రీకు చక్రవర్తిగా ఈశ్వర్ కనుమూరి అభినయం అందరిని ఆకట్టుకుంది. బుర్రకథ పాటని చంద్రశేఖర్ అయ్యలరాజు, సత్యమంతెన, కళ్యాణ్ తటవర్తి చక్కగా పాడారు. శిరీష ఖండవిల్లి, జాహ్నవీ తటవర్తిలు సంగీతం అందించగా, కూర్పు చేసిన రవి ఖండవిల్లిని వేడుకలకు వచ్చిన వారందరూ ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కొత్తతరహా పద్యనాటకాలు మరింత రావాలని, తెలుగు భాషను సుసంపన్నం చేయాలని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో తమ కరతాళధ్వనులద్వారా తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment