'జగన్‌ ఫైటర్‌.. చంద్రబాబు ఛీటర్‌' | YSRCP USA leaders candle light protest for Ap special status | Sakshi
Sakshi News home page

'జగన్‌ ఫైటర్‌.. చంద్రబాబు ఛీటర్‌'

Published Wed, Apr 25 2018 2:29 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

YSRCP USA leaders candle light protest for Ap special status - Sakshi

ఆస్టిన్ (టెక్సాస్): ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ఆర్ఐ క‌మిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇంచార్జ్‌ వల్లూరు రమేష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న తీరు 'తన కంపు తనకిష్టం.. పరుల కంపు పాపిష్టి కంపు' చందంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, అందరినీ వంచించారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే విశ్వసనీయతకు ప్రతీక అన్నారు. జగన్‌ ఫైటర్‌ అయితే చంద్రబాబు ఛీటర్‌ అని వల్లూరు రమేష్ రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈనెల ౩౦న వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపనున్న విషయం తెలిసిందే. దీనికి మద్దతుగా అమెరికాలో వైఎస్సార్‌సీసీ కార్యకర్తలు ఆస్టిన్‌లో కొవ్వొత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్యకర్తలు చేతిలో ప్లకార్డులు పట్టుకొని ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదాని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాము ఈ నిరసన చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌లు పేర్కొన్నారు. మహానేత స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీని వైఎస్‌ జగన్‌ స్థాపించారని, వైఎస్సార్‌ ఆశయ సాధనకు వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో సైనికుల్లా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


 
పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా 13 సార్లు హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టి, అప్పటికీ కేంద్రం దిగి రాకపోవడంతో, వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ఈ నెల ౩౦న జరగనున్న వంచన దినం సందర్భంగా దీక్షకు  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అందరూ పాల్గొని దీక్షను విజయవంతం చేయాలనీ విన్నవించారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్ఐ వింగ్‌ నేతలు అన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్‌ జగన్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, చింతగుంట సుబ్బారెడ్డి, బల్లాడ రవి, ఎదురు పుల్లారెడ్డి, నంగి పరమేశ్వర్ రెడ్డి, ద్వారసాల కొండారెడ్డి, గూడూరు అశోక్, స్వదీప్ రెడ్డి, ముట్లూరు సచిన్, బండ్లపల్లి మురళి, మండపాటి సుధాకర్, అస్వపాటి కుమార్, ఆరేకూటి మోహన్ రెడ్డి, ఆవుల మల్లికార్జున్ రెడ్డి, గండ్ర నారాయణ రెడ్డి, వుమ్మ వెంకట్రాం రెడ్డి, లక్కు బ్రహ్మేంద్ర, లక్కిరెడ్డి ప్రదీప్, బోయపల్లె అనంత్, గడికోప్పుల నర్సిరెడ్డి, కంబం దేవేందర్, వసంత రెడ్డి, నామాల వెంకట్, సామల మధు, కడిపికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement