మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం! | angela Merkel ally criticises French over Alstom deal | Sakshi
Sakshi News home page

మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం!

Published Wed, Jun 25 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం!

మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం!

ఈయూ ఎన్నికల్లో యూరప్ ప్రజలు ‘పొదుపు చర్యల’కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో యూరప్‌పై మర్కెల్ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ బడ్జెట్ లోటు, రుణాలపై పరిమితులను విధించే ‘స్టెబిలిటీ ప్యాక్ట్’ను సరళతరం చేయాలని ఒత్తిడి పెరుగుతోంది.
 
 నిన్నటి వరకు ‘యూరో సామ్రాజ్ఞి’గా వెలుగొందిన ఏంజెలా మర్కెల్ హఠాత్తుగా అన్ని వైపుల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. యూరోపియన్ యూనియన్ అధ్యక్షునిగా జీన్ క్లాడ్ జంకర్ అభ్యర్థిత్వాన్ని అయిష్టంగానే సమర్థించాల్సిన దుస్థితి అందులో ఒకటి. లక్సెంబర్గ్ మాజీ ప్రధాని జంకర్ కూడా మర్కెల్‌లాగే మధ్యేవాద మితవాద నేత. కానీ ఈయూ సంక్షోభానికి పరిష్కారంగా మర్కెల్ యూరప్‌పై రుద్దుతున్న ఆస్టిరిటీ (పొదుపు) కార్యక్రమాల విషయంలో మాత్రం ఆయన ఆమెకు బద్ధ వ్యతిరేకి. మేలో జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యయాల తగ్గింపు పేరిట సంక్షేమ వ్యయాలపై కోతలు, ఉద్యోగాలు, వేతనాలలో కత్తిరింపుల పొదుపు చర్యలను వ్యతిరేకించే పార్టీలకే ఆధిపత్యం లభించింది. ఈయూ స్వభావానికి తగ్గట్టే దాని పార్లమెంటులోని ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలోని నెయ్యే. ఈయూ అధ్యక్షుణ్ణి యూరప్ ప్రజా ప్రతినిధులు ఎన్నుకోరు. 28 సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వాలే నియమిస్తాయి.
 
 మర్కెల్ ఎవరిని బలపరిస్తే వారే అధ్యక్షుడని అంతా అనుకున్నట్టే ఆమె అనుకున్నారు. జంకర్ అభ్యర్థిత్వాన్ని ఆమె తీవ్రంగానే వ్యతిరేకించారు. విరుద్ధ ధృవాల మధ్య ఆకర్షణలాగా మర్కెల్‌కు, ఈయూ సమావేశాల్లో ఎప్పుడూ శిరోభారమై నిలిచే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు జంకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంలో ఐక్యత కుదిరింది. కాకపోతే బ్రిటన్‌కు అల వాటుగా మారిన ‘ఈయూ నుంచి నిష్ర్కమణ’ బ్లాక్‌మెయిలింగ్ టెక్నిక్‌ను కామెరాన్ సందర్భశుద్ధి లేకుండా జంకర్ అభ్యర్థిత్వంపై ప్రయోగించారు. దీంతో జంకర్ పరిస్థితి తంతే బూరెల గంపలో పడ్డట్టయింది. ఈయూను విచ్ఛిన్నం చేసే శక్తులతో మర్కెల్ కలుస్తున్నారంటూ జర్మనీలో గగ్గోలు రేగింది. చాన్సలర్ మర్కెల్ మొట్టమొదటిసారిగా తన వైఖరిని తలకిందులు చేసి జంకర్‌కు మద్దతు ప్రకటించక తప్పింది కాదు. జంకర్ అధ్యక్ష పీఠానికి చేరువయ్యారే తప్ప దక్కించుకోలేదు.
 
 జంకర్ తలనొప్పి అలా ఉండగా ‘ఆస్టిరిటీపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించే విధానాలు విఫలమయ్యాయి’ అంటూ జర్మనీ వైస్ చాన్సలర్, ఆర్థిక మంత్రి సిగ్మార్ గాబ్రియెల్ బాంబు పేల్చారు. అధికార కూటమిలోని ఈ తిరుగుబాటు ధోరణికి మీడియా నోళ్లు తెరవాల్సి వచ్చింది. మధ్యేవాద వామపక్షమైన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ నేత గాబ్రియెల్ గాలివాటం కనిపెట్టారు. ఈయూ ఎన్నికల్లో యూరప్ అంతటా వీచిన అస్టిరిటీ వ్యతిరేక పవనాలు మర్కెల్ ఆధిపత్యాన్ని బలహీనపరచాయని  గ్రహించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె, మర్కెల్‌పై మండిపడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ఫ్రాన్స్‌లోని పచ్చి మితవాద కూటమి ‘ఫ్రంట్ నేషనల్’ 25 శాతం ఓట్లు దక్కించుకుంది. అందుకు ఫ్రాన్స్‌పై రుద్దిన ద్రవ్య సంస్కరణలే కారణమని ఆయన అక్కసు. ఈయూ ‘స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్’ (సుస్థిరత, వృద్ధి ఒప్పందం) నిబంధనలను సరళతరం చేయాలని ఆయన గట్టిగా డిమాండు చేస్తున్నారు.

 

ఈ ఒప్పందాన్ని అనుసరించే ఈయూ సభ్య దేశాల ప్రభుత్వ బడ్టెట్ లోటు జీడీ పీలో 3 శాతం కంటే, రుణం జీడీపీలో 60 శాతం కంటే తక్కువగా ఉండాలని పరిమితులను విధించారు. ఒకప్పుడు జర్మనీ సహా ఈయూ ప్రధాన శక్తులు వాటిని యథేచ్ఛగా ఉల్లంఘించినవే. మర్కెల్ హయాంలోనే అవి దాటరాని లక్ష్మణ రేఖలుగా మారాయి. వాటిని సరళతరం చేయడమంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, ఈయూపై మర్కెల్ పట్టును బలహీనపరచడమే. దీన్ని మర్కెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కానీ జర్మనీ అధికార కూటమిలోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది.
 
 గాబ్రియెల్ చొరవతో ఈ నెల 22న వివిధ ఈయూ దేశాల మధ్యేవాద వామపక్ష నేతలంతా సమావేశమై వృద్ధిని మరచిన స్టెబిలిటీ ప్యాక్ట్ నిబంధనలను సడలించడమే సం క్షోభం నుంచి  బయటపడటానికి మార్గమంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మర్కెల్ ఆస్టిరిటీ విధానాలకు గట్టి మద్దతుదార్లుగా నిలిచిన  హాలెండ్, ఫిన్లాండ్‌లు కూడా అదే పాట పాడటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ఇటలీ ప్రధాని మాటియో రెంజి ఆమెకు మరింత తీవ్ర ప్రత్యర్థిగా తయారయ్యారు. ఈయూ సంస్కరణల కత్తి పీక మీద ఉన్న ఆయన జీడీపీలో 133 శాతం ప్రభుత్వ రుణం, 12.6 శాతం నిరుద్యోగం ఎదుర్కొంటున్నారు. ఆస్టిరిటి విమర్శకులు కోరుతున్నట్టు ఈయూ పొదుపు విధానాలను సవరిస్తే జర్మనీ ప్రజలపైనే భారం పడుతుందని మర్కెల్ గగ్గోలు పెడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ‘సౌహార్ద్రత’ నినాదానికి బదులుగా ఈయూ పొదుపు చర్యలను విడనాడితే మూల్యాన్ని చెల్లించాల్సింది జర్మన్లే అంటూ ప్రచారాన్ని సాగించాల్సిందని ఆమె ఇప్పుడు విచారిస్తున్నారు.
 -పి. గౌతమ్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement