‘అరబ్బు’ ఆధిపత్య పోరులో సమిధ ఈజిప్ట్
ఈజిప్ట్‌లో ఇటీవల వందలాది మంది ‘ముస్లిం బ్రదర్‌హుడ్’ మద్దతుదార్లకు విధించిన సామూహిక మరణశిక్షల వెనుక సౌదీ హస్తం ఉంది. అరబ్బు ప్రపంచంపై బీటలు వారుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో అది బ్రదర్‌హుడ్‌పై కత్తిగట్టింది.
ఈజిప్ట్ రాజధాని కైరో నగరం బుధవారం బాంబు దాడులతో మారుమోగింది. గత ఏడాది జూలైలో మొహ్మద్ ముర్సీ పదవీచ్యుతుడైనప్పటి నుంచి అలాంటి పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇంత వరకు 500 మంది హతమైపోయారు. వారిలో పోలీసు, సైనికాధికారులే ఎక్కువ. కాకపోతే బుధవారం మరణించినది పోలీసు బ్రిగేడియర్ జనరల్ కావడమే విశేషం. ‘ఉగ్రవాదం భయమే లేకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి హామీని కల్పించడానికి పోరాడుతూనే ఉంటాను’ అని ఈజిప్ట్ సైనిక పాలకునిగా అబ్దెల్ అల్ ఫతా సిసీ సరిగ్గా వారం క్రితం (మార్చి 26) తెహ్రీర్ స్క్వేర్‌లో అభయమిచ్చారు! అదే రోజునే ఆయన సైనిక దుస్తులను విడిచేసి ‘ప్రజాభీష్టం’ మేరకు మే 26-27లలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు సెలవిచ్చారు. అంతకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చి 24న కైరోలోని ఓ న్యాయస్థానం ముందే తయారుచేసిన తీర్పును చదివి వినిపించింది. 528 మంది ముస్లిం బ్రదర్‌హుడ్ మద్దతుదార్లకు మరణశిక్షలు విధించింది. ఒక రోజు వాయిదా, ఒక రోజు తీర్పుతో సామూహిక విచారణను క్షణాల్లో ముగించిన ఘనత సిసీకే దక్కింది. జైళ్లలో మగ్గుతున్న రెండు వేల మందికి పైగా బ్రదర్‌హుడ్ ఖైదీలలో మిగతా వారిపై ఇంకా ‘విచారణ’ జరగాల్సి ఉంది. ఈజిప్ట్ విప్లవంలో కీలక పాత్ర వహించిన ట్రేడ్ యూనియన్లు, లౌకికవాద, ఆధునిక యువత నుంచి దేశాన్ని ‘కాపాడటం కోసం’... విప్లవంలో మరో కీలక భాగస్వామి బ్రదర్‌హుడ్‌పై అమెరికా మిత్ర భేదాన్ని ప్రయోగించింది. ప్రజల్లో 30 నుంచి 35 శాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే ముస్లిం బ్రదర్‌హుడ్ నేత మొహ్మద్ ముర్సీ అధ్యక్ష పీఠం దక్కించుకునేలా చేసింది. అలాంటి అమెరికా ఈ సామూహిక మరణశిక్షల తదుపరి అల్ సిసీ ప్రభుత్వంపై ఏ ఆంక్షలు విధించింది? అసలు సిసీ సైనిక కుట్రను అణచివేసి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’కు ఎందుకు నడుం బిగించలేదు? ‘తలలను మార్చే’ నైపుణ్యంలో తనకు సాటేలేరనుకున్న అమెరికా తన కీర్తి కిరీటానికి ఆప్త మిత్రులే ఎసరు పెడతారని ఊహించలేకపోవడాన్ని ‘అర్థం చేసుకోవచ్చు.’ ముర్సీ తలను మార్చి అల్ సిసీ తలపై ఈజిప్ట్ మకుటం పెట్టినది సౌదీ అరేబియా. 528 మందికి సామూహిక మరణశిక్షలకు కర్త, కర్మ, క్రియ అదే. అందుకే ‘ఇలాంటి విచారణలను, మర ణశిక్షలను ఆమోదించలేం’అంటూ తనకే వినిపించనంత మెల్లగా గొణగడానికి మించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఏమీ చేయలేకపోయారు. ఈజిప్ట్ ప్రజాస్వామ్యానికి పరిరక్షకునిగా అది ఎంచుకున్న ముర్సీ సహా మొత్తంగా బ్రదర్‌హుడ్‌ను సౌదీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అదే అడుగుజాడలో సిసీ దేశంలోని అత్యంత సంఘటిత రాజకీయ పార్టీ బ్రదర్‌హుడ్‌ను నిషేధించారు. బ్రదర్‌హుడ్‌పై సౌదీ అక్కసు ఈనాటిది కాదు. ఈజిప్ట్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సున్నీ ఇస్లామిక్ ప్రపంచంలో బ్రదర్‌హుడ్‌కు శాఖలున్నాయి. సున్నీ ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యం తనదేనని భావిస్తున్న సౌదీ... బ్రదర్‌హుడ్‌ను తనకు ప్రత్యర్థిగా భావిస్తోంది. ఉదారవాద ఇస్లామిస్ట్ సంస్థగా ఉండే బ్రదర్‌హుడ్ ఆధునిక ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది. సరిగ్గా అదే సౌదీ, దాని మిత్ర దేశాలకు ప్రాణాంతకంగా మారింది. తమ దేశాలలోని రాచరిక వ్యవస్థలకు అది ఎసరు తెస్తుందనే భయం పట్టుకుంది.
పైగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా సౌదీ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే సున్నీ ఇస్లామిక్ మత భావజాలానికి పట్టుగొమ్మగా భావించే అల్ అజర్ విశ్వవిద్యాలయం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. ముర్సీ ఆ విశ్వవిద్యాలయంపై ఆధిపత్యం కోసం కూడా ప్రయత్నించారు. వీటన్నిటికీ మించి ఆయన అటు టర్కీ, ఖతార్‌లతో కలిసి సున్నీలకు, షియాలకు మధ్య ఉన్న దీర్ఘకాలిక వైరాన్ని అధిగమించి ఇస్లామిక్ ప్రపంచ ఐక్యతను సాధించే ప్రయత్నాలు చేశారు. మొత్తం ఇస్లామిక్ ప్రపంచంపై ఆధిపత్యం కోసం సౌదీ ఎప్పటి నుంచో షియా ఇరాన్ పై కత్తికట్టింది. ఇరాన్ షియా ఇస్లామిస్టులతో చేయి కలిపి బ్రదర్‌హుడ్ చివరికి తమ రాచరికం కాళ్ల కింద అరబ్బు విప్లవం మంటలు రేపుతుందనే భయం దానికి పట్టుకుంది. ఈజిప్ట్‌లోని బ్రదర్‌హుడ్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టనిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని శాఖలను అదుపులో పెట్టలేమని భావించింది. బ్రదర్‌హుడ్ ఈజిప్షియన్లను షియాలుగా మార్చేస్తుందని, సున్నీ మనుగడకు ముప్పు రానున్నదని ప్రచారం సాగిస్తూ సిసీ సౌదీ బంటుగా బ్రదర్‌హుడ్‌ను ఏరిపారేస్తున్నారు. మే ఎన్నికల్లో గెలిచి సైనిక పాలనకు ప్రజాస్వామ్యం ముసుగు తొడుగుతారు. సౌదీ పెట్రో డాలర్లతో పెరిగిన సినాయ్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా బాంబులు పేలుస్తూనే ఉంటారు.
పి.గౌతమ్