ఎల్లలు లేని కళాకారులు ఎవరి పక్షం?
వారి ఉద్దేశాలు ఏవైనా ఎల్లలు లేని కళాకారులు విస్థాపనకు, నిర్వాసితత్వానికి గురవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కాక.. నూతన రాజధాని నిర్మాణ నిధి కోసం కళా ప్రదర్శన చేయడం అన్యాయమైన నిర్ణయం, చర్య అవుతాయి.
రెండు దేశాల మధ్యన హిం సాత్మకమైన ఘర్షణ ఏర్పడిన ప్పుడు - ఆ ఘర్షణ స్వభా వంతో, ఆ ఘర్షణలో ఎవరిది న్యాయం అనే వివక్షతో నిమి త్తం లేకుండా బాధితులకు వైద్య సహాయం చేయడానికి వెళ్లే సంస్థల్లో మొదటిదిగా ‘రెడ్‌క్రాస్’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నది. అలాగే ‘డాక్టర్స్ వితవుట్ ఫ్రాంటి యర్స్’ అనే సంస్థ ప్రాన్స్‌లో ఏర్పడింది. ఇరాక్, అఫ్ఘాని స్తాన్‌లపై అమెరికా దాడుల సందర్భంగా, ఇంకా చాలా ఘర్షణాయుత దేశాల్లో వీరందించిన సేవలకు చాలా గుర్తింపు వచ్చింది. పౌర సమాజం అని చెప్పుకుంటున్న ఒక ఆధునికానంతర తరాన్ని డాక్టర్స్ వితవుట్ ఫ్రాంటి యర్స్- సరిహద్దులు లేని వైద్యులు- వంటి మాట ఆకర్షి స్తుంది, ప్రభావితం చేస్తుంది. అందుకే దానితో పోలికే లేకుండా హైదరాబాద్‌లో ‘ఆర్టిస్ట్స్ వితవుట్ బార్డర్స్’ సంస్థ ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఒక కళాకారుల బృందం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరా వతి పేరుతో నిర్మాణం చేస్తున్న రాజధానికి కళాకారు లుగా సహాయం చేయడానికి రాష్ట్రాల సరిహద్దులు పాటించకుండా వెళ్లిన సందర్భం ఇది.
సుక్క కరుణ అనే చిత్రకళాకారిణి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో. అమ రావతి రాజధాని నిర్మాణ సందర్భంలో విజయవాడ సంస్కృతికి తన వంతు సాంస్కృతిక దోహదంలో భాగంగా ఆమె మరో తొమ్మిది మంది కళాకారులతో ఒక కళా శిబిరంలో పాల్గొనడానికి వెళ్లింది. విజయవాడ సాంస్కృతిక కేంద్రం సంస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, భారత పరిశ్రమల సమాఖ్య అధ్య క్షుడు చిట్టూరి సురేశ్ రాయుడు, సినిమా నిర్మాత సురేశ్ బాబుల పూనికతో ఈ నెల 17 నుంచి 19 వరకు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో ‘ఆర్ట్ బియాండ్ బౌండ రీస్’ (ఎల్లలెరుగని కళావైభవం) పేరిట ఈ చిత్రకళా శిబి రాన్ని నిర్వహించారు. తెలంగాణ నుంచి వెళ్లిన సరి హద్దులు లేని ఈ కళాకారులు అక్కడే చిత్రాలు వేసి, వాటినక్కడే ప్రదర్శించారు. కళాకారులంతా తాము ఎంచుకున్న విషయంపైనే చిత్రాలు వేస్తారు. ఈ ప్రద ర్శన ద్వారా వచ్చే డబ్బు నూతన రాజధాని నిర్మాణ నిధికి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఈ సరిహద్దులు లేని తెలంగాణ కళా కారుల కానుక ఇది. ఇందులో కళాకారుల ఉద్దేశాలను శంకించడానికేమీ లేదు.
కళాకారులు, కవులు భావోద్వేగపరులు. ఇటీవల కోల్‌కతాకు పోయినప్పుడు ఢిల్లీలో పనిచేసిన ఒడిశాకు చెందిన ఒక ప్రొఫెసర్ ‘‘నూతన ఆంధ్రప్రదేశ్‌కు అమ రావతి రాజధాని అట. నేను పులకించిపోయాను. వెం టనే నేనా రాజధానికి నా మొబైల్ ఫోన్‌లో ఒక లోగోను రూపొందించాను చూస్తారా?’’ అని చూపించింది. ఆమెకేమని చెప్పను? ఏం చెప్పినా పొరుగు రాష్ట్రం రాజ ధాని విషయంలో ముఖ్యమంత్రిపై చాడీలు చెప్పినట్లు గానో, నిందలు వేసినట్లుగానో ఉంటుంది. కాని నిష్ఠుర సత్యాన్ని చెప్పక తప్పదు. ఇది బుద్ధుని కాలపు బౌద్ధా రామం కాదు. ఆ అమరావతి కాదు.
ఇది చంద్రబాబు మాటల్లోనే సింగపూర్ ప్రతికృతి. బుద్ధుని దాకా ఎందుకు, మాకు సత్యం శంకరమంచి అనే అద్భుతమైన రచయిత ఉన్నాడు. ఆయన రాసిన అమరావతి కథల్లో మధురానుభూతిగా మిగిలిన నగరం కూడా కాదు. ఇది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలోని కృష్ణా నది జలాలతో కాదు... రైతుల చెమట, ఆక్రోశం, ఆగ్రహం నెత్తురు చిందిన చిత్తడి నేలలో రూపొందుతున్న ఒక పీడకల. చంద్రబాబు వంటి వారికి, పైన పేర్కొన్న కళా పారిశ్రామిక పోషకుల వంటి వారికి నూతన రాజ ధాని స్వప్నమే కావచ్చు. కాని ప్రజల పాలిట అచ్చమైన పీడకల. వేలాది ఎకరాల భూమి చంద్రబాబు నాయ కత్వంలోని పాలకులు అధిగ్రహణం చేయడం వల్ల నిర్వా సితులైన, విస్థాపితులైన ప్రజలకు ఎప్పటికి నిలిచిపోయే చేదు గుర్తు అనుకున్నాను. బౌద్ధ ధర్మం గురించి విస్తృత మైన అధ్యయనం చేసిన ఆమెకు సులభంగా అర్థమయ్యే వర్తమాన సందర్భం చెప్పాలనిపించింది. ఇప్పుడు బస్తర్‌లో ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలు కానట్లే, ప్రభుత్వ వైద్యశాలలు వైద్యశాలలు కానట్లే మీరూహిం చుకునే అమరావతి ఆ అమరావతి కాదు. అవి ఎట్లా కేంద్ర అర్థసైనిక బలగాల స్థావరమైనవో, ఈ నూతన రాజధాని అట్లా రైతాంగం పాలిట, అశేష ప్రజానీకం పాలిట అణచివేత స్థావరం కానున్నది అని చెప్పాను.
ఈ నూతన రాజధాని కోసం చంద్రబాబు నారా వారిపల్లె మొదలు నాలుగు దిక్కుల నుంచి ఇసుక (మాఫియా తినగా మిగిలింది), మట్టి (రియల్టర్లు, కంపె నీలు ఆక్రమించగా మిగిలింది) సేకరించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమురవోలు (ఎన్టీఆర్ సతీ మణి బసవతారకం గ్రామం) నుంచి చంద్రబాబు భార్య భువనేశ్వరి మట్టి, నీరు సేకరించిందని చదివినప్పుడు నాకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచ డానికి ఢిల్లీ నుంచి వచ్చిన భారత సైన్యం కాటూరు, పామర్రు గ్రామాల్లో నిర్వహించిన దుశ్చర్యలు గుర్తు కొచ్చాయి.
అవును కదా, ఇటువంటి దౌర్జన్యాలకు భారత సైన్యాన్ని పురిగొల్పిన వల్లభ్ భాయ్ పటేల్‌కు అమెరికాలోని లిబర్టీ స్టాచ్యూను మించిన లోహ విగ్ర హాన్ని నిర్మించడానికి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇనుము సేకరిస్తున్నాడు కదా అని గుర్తుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ముస్లిం ప్రజల మనోభావాలను గాయపరచ డానికి, బాబ్రీమసీదును కూల్చి రామమందిర నిర్మాణం చేయడానికి ఆనాడు లాల్‌కృష్ణ అద్వానీ ఇటుకలు సేకరిం చడం గుర్తుకు వచ్చింది. ఈ ఇద్దరు నేరస్తులతో అధి కారం ముడివేసుకున్నవాడే కదా చంద్రబాబు. అయినా, చంద్రబాబు తొమ్మిదిన్నర సంవత్సరాల రక్తసిక్త పాలన తెలియని తెలుగువాళ్లెవరు? ఈ కళాకారులు తప్ప.
వచ్చేవాళ్ల, పంపేవాళ్ల ఉద్దేశాలు ఏమైనా, ఎల్లలు లేని వైద్యులు ఘర్షణలో బాధితులకు వైద్యసహాయం చేస్తారు.
వాళ్లకు చికిత్స, వైద్య సహాయమే కర్తవ్యం, లక్ష్యం. గాయపడిన, బాధితుల మంచి చెడ్డలతో సంబం ధం లేదు. కాని ఎల్లలు లేని కళాకారులు క్షతగాత్రులైన, బాధితులైన, విస్థాపనకు, నిర్వాసితత్వానికి గురవు తున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కాకుండా, నూతన రాజధాని నిర్మాణం గురించి కళా ప్రదర్శన చేసి, ఆ కళాఖండాలు వేలం వేయగా వచ్చిన డబ్బును నూతన రాజధాని నిర్మాణ నిధికి అర్పించడమే అన్యాయమైన నిర్ణయం, చర్య అవుతాయి. ప్రజలకు, పాలకులకు మధ్యన ఉన్న సరిహద్దులో ఈ కళాకారులు ప్రజలవైపు నుంచి ఎల్లలు దాటి పాలకుల వైపు వెళ్లిన వాళ్లే అవుతారు. వాళ్లకా ఉద్దేశాలు ఏమాత్రం లేకపో వచ్చు. ఆపాదించనూలేం. కాని నిర్వాహకుల ప్రయోజ నం అదే. బహుశా ఆ సత్యం బోధపడినందువల్లనే ఈ కళా శిబిరంలో ప్రసిద్ధ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ పాల్గొన కూడదని నిర్ణయించుకున్నాడు. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు, బుద్ధిజీవులు ఈనాటి పాలకులకు తమకు మధ్య ఎల్లలు తెలుసుకుంటున్న సమయంలో, ప్రజల వైపు నిలబడుతున్న తరుణంలో ఈ నిష్ఠుర నిజాన్ని ఈ ఎల్లలు లేని కళాకారులు కూడా గ్రహిస్తారని ఆశిద్దాం.
తాజాకలం- ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఈ కళాబృం దం ప్రయాణానికి Straight from the he'art' అని శీర్షిక పెట్టింది. హృదయం నుంచి, కళ నుంచి నేరుగా అనే అర్థాలు స్ఫురించేలా. కాని ఆ ఉత్సాహంలో జెండర్ వివక్ష చేస్తున్నానని గుర్తించలేదు. ఈ ప్రయాణానికి కరుణగారి పరిశోధన కారణమని ఈ పత్రిక చెప్తున్నది. ఆమె ఈ వివక్షను కూడా గమనించ కోరుతున్నాను.
(వ్యాసకర్త ప్రముఖ విప్లవ రచయిత) 9676541715
- వరవరరావు