మంచుకోటలో మహిళా రాజ్యం | bidyadevi elected as nepal new president | Sakshi
Sakshi News home page

మంచుకోటలో మహిళా రాజ్యం

Published Thu, Nov 5 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

మంచుకోటలో మహిళా రాజ్యం

మంచుకోటలో మహిళా రాజ్యం

కొత్త కోణం
ఆధునిక ప్రజాస్వామ్య విలువలను నేపాల్ కొంతైనా పుణికి పుచ్చుకుందనడానికి బిద్యాదేవి ఆ దేశానికి అధ్యక్షురాలు కావడమే ఉదాహరణ. మహిళలకు దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం నేపాల్ రాజ్యాంగంలోని విశిష్టత. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రక్షణలన్నింటినీ ఆ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో చేర్చుకుంది. ఇందులో గౌరవ ప్రదంగా జీవించే హక్కును మొదటిదిగా ప్రకటించుకోవడమే కాకుండా, మరణశిక్ష విధించడం చట్టరీత్యా కుదరదని కూడా అత్యంత స్పష్టంగా ప్రకటించుకోవడం అసాధారణమైన విషయం.
 
 ‘ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం మనుగడ సాగించాలంటే అట్టడుగు వర్గాలతోసహా ప్రజలందరికీ ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం ఉండాలి.’ ప్రజాస్వామ్య తాత్వికతకు మూలపురుషుడైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన సత్యమిది. క్రీస్తుపూర్వం 350 ప్రాంతంలో నాడు ఏథెన్స్ రాజ్యాంగాన్ని రూపొందించిన అరిస్టాటిల్ ఒక రకంగా రాజ్యాంగ రచ నకు పితామహుడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న రాజ్యాం గాలకు మూలాధారం అరిస్టాటిల్ అందించిన ఆ రాజ్యాంగమే. గడిచిన రెండు వేల సంవత్సరాల పైచిలుకు కాలంలో ప్రజాస్వామ్య భావన ఎన్నెన్నో మార్పులకు, చేర్పులకు లోనై నేడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రజల చేతిలో గొప్ప ఆయుధంగా ఒదిగింది. ఇటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలతో కూడిన ప్రజాస్వామ్య సౌధం నిర్మాణానికి మన పొరుగుదేశమైన నేపాల్ ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమించారు. రాచరికపు సంకెళ్లను ఛేదించుకొని, సెప్టెంబర్ 20, 2015న స్వతంత్ర రాజ్యాంగం ఆవిర్భవించడం దాని ఫలి తమే. నూతన రాజ్యాంగంతో అక్కడ ప్రజాస్వామ్య శకం ఆరంభమైంది.

నేపాల్ ప్రజాస్వామ్యదేశంగా రూపుదిద్దుకునే క్రమంలో క్రీ.శ.1769లో భిన్న రాజ్యాల ఏకీకరణ జరిగి, ఆపై 1846లో షా వంశానికి చెందిన రాజుల నుంచి రాణాల వశమైంది. ఆరోజు ఆయన తనకు తానుగా ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నారు. నేపాల్ పాలకవర్గాలు రాచరిక, భూస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని కొనసాగించారు. 1950లో జరిగిన అధికార మార్పు కొంతమేర ప్రజాస్వామ్య లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ సమూల మార్పులకు తోడ్పడ లేదు. ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాచరిక వ్యవస్థ పట్టును వదులుకోలేదు. రాజకీయ అంతఃకలహాల వల్ల రాచరిక వ్యవస్థపై సంఘటిత పోరు సాగలేదు.

1960లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, రాజు మహేంద్ర పూర్తి అధికారాలను ప్రకటించుకున్నాడు. అయితే ప్రజల అసహ నాన్ని గమనించి 1962లో పంచాయతీ వ్యవస్థను ప్రారంభించారు. 1979- 80 నాటికి దేశవ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. పంచాయతీ వ్యవస్థ కావాలా? బహుళ రాజకీయ వ్యవస్థ కావాలా? అన్న అంశం మీద బీరేంద్ర ప్రజాభిప్రాయ సేకరణ జరిపాడు. నయానా, భయానా తన విధానమైన పంచాయతీ వ్యవస్థకు అనుకూలంగా ప్రజల తీర్పును మలచుకోగలిగాడు. కానీ ప్రజాస్వామ్య విధానాల కోసం పోరాడుతున్న శక్తులు ఈ తీర్పును అంగీకరించక, వ్యతిరేక పోరాటం ప్రారంభించాయి.

నేపాల్ చరిత్రలో కీలక ఘట్టం మావోయిస్టు రాజకీయశక్తులు ప్రజా స్వామ్య ఉద్యమంలో ప్రవేశించడం. 1991లో జరిగిన సాధారణ ఎన్నికల్లో యూనిటీ సెంటర్ పేరుతో వారు పోటీ చేశారు. అయితే ఆనాటి పార్లమెంటరీ విధానాలతో విసిగిపోయిన ఈ శక్తులు ఏకమై, 1996 ఫిబ్రవరిలో 40 అంశా లతో గెరిల్లా యుద్ధాన్ని ప్రకటించారు. అది 2006 సంవత్సరం దాకా, ఒక దశాబ్దంపాటు సాగింది. వేలాది మంది గెరిల్లాలు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే గెరిల్లా యుద్ధానికి బయట ఉన్న ఏడు ప్రజాస్వామ్య పార్టీలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి.  గెరిల్లా యుద్ధం నడుపుతున్న మావోయుస్టు పార్టీ, ఏడు పార్టీల కూటమి 2005, నవంబర్ 17 కల్లా ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ అంగీకారంలో 12 అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైనవి రెండు.

నిరంకుశ పాలనను, రాచరిక దుర్మార్గాలను అంతం చేసి దీర్ఘకాలిక శాంతి, సుస్థిరతలు ఏర్పరచుకోవడా నికి సంపూర్ణమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడం ఇందులో మొదటిది. ప్రతినిధుల సభను పునరుద్ధరించి అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పా టుచేసి, రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించాలనేది రెండవది. దీనితో 2006 సంవత్సరం నుంచి మరో ప్రజాస్వామ్య ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఏడు పార్టీలతో ఏర్పడిన అవగాహనతో మావోయిస్టు పార్టీ గెరిల్లా యుద్ధానికి స్వస్తి పలికి ప్రజాస్వామ్యం కోసం ఐక్య పోరాటాలలో భాగమైం ది. అయితే 2007 డిసెంబర్‌లో నేపాల్ ప్రభుత్వానికీ, మావోయిస్టులకూ మధ్య ఒప్పందం కుదిరింది. దానితో మావోయిస్టుల డిమాండ్ మేరకు 2008 ఏప్రిల్ 10న రాజ్యాంగసభకు ఎన్నికలు జరిగాయి.

మావోయిస్టుపార్టీ అత్య ధిక మెజారిటీ స్థానాలు సంపాదించుకుంది. అయితే ఇతర పార్టీలు సహకరిం చకపోవడంవల్ల మావోయిస్టు నాయకత్వంలోని రాజ్యాంగ సభ నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోలేక పోయింది. దీంతో ప్రచండ నాయక త్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. 2013, నవంబర్ 19న రెండవ రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. అందులో మావోయిస్టు పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే మరింత బలహీనమైంది. కానీ మావోయిస్టులు నేపాల్ కమ్యూనిస్టు పార్టీతో  కలసి ఒక కూటమిగా ఏర్పడి రాజ్యాంగ రచనలో తమ దైన ముద్రను వేయడానికి ప్రయత్నించారు. అంతిమంగా 2015, సెప్టెంబర్ 20న నేపాల్ రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.

అధ్యక్ష పదవి మహిళకు
కొత్త రాజ్యాంగంతో అందిన మొట్టమొదటి ఫలితం- బిద్యాదేవి అనే మహిళ దేశాధ్యక్షురాలు కావడం. రాజ్యాంగం మహిళలకు దామాషా ప్రకారం రాజ కీయ రిజర్వేషన్లు కల్పించడం ఒక గొప్ప విజయమే. నేపాల్ కన్నా 65 సంవ త్సరాల ముందు మనం రాజ్యాంగం రూపొందించుకున్నప్పటికీ మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమవుతూవస్తున్నాం. రాజ్యాంగం ఆవిర్భావంతోనే అటువంటి రిజర్వేషన్లు కల్పించి, ప్రజాస్వామ్య భావనలో నేపాల్ మనకన్నా ముందు నిలిచిందంటే అతిశయోక్తి కాదు. నేపాల్‌ను హిందూదేశంగా రాచరిక ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. ఆ భావనకు కూడా రాజ్యాంగం స్వస్తి పలికింది. ఆర్టికల్ 16 నుంచి ఆర్టికల్ 48 వరకు ప్రాథమిక హక్కులకు, విధులకు కేటాయించారు. ఇందులో గౌరవ ప్రదంగా జీవించే హక్కును మొదటిదిగా ప్రకటించుకోవడమే కాకుండా, మరణశిక్ష విధించడం చట్టరీత్యా కుదరదని అదే ఆర్టికల్‌లో ప్రకటించుకో వడం అసాధారణమైన విషయం. మన రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో పొందు పరిచిన రక్షణలన్నింటినీ నేపాల్ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో పేర్కొ నడం కూడా హర్షించదగ్గ విషయం. సమానత్వ హక్కును కూడా అక్కడ ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు. న్యాయం అనే అంశాన్ని ప్రాథమిక హక్కుగా చేర్చారు.

మన రాజ్యాంగంలో అంటరానితనం నిర్మూలనను ప్రాథమిక హక్కుల్లో చేర్చినట్టే, నేపాల్‌లో కూడా చేశారు. ఆర్టికల్ 24 ప్రకారం ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా ఏ విధమైన అంటరానితనం భావనతో గానీ, వివక్షతో గానీ వేధించకూడదు. ఆర్టికల్ 29లో ఏ వ్యక్తినీ దోపిడీ చేయకూడదనీ, అటువంటి విధానాన్ని వ్యతిరేకించే హక్కు ఆ వ్యక్తికి ఉంటుందనీ పేర్కొన్నారు. మహి ళలు, పిల్లలు, దళితుల కోసం ప్రత్యేకించి విడివిడిగా ఆర్టికల్స్ రూపొం దించారు. ఇంకా చాలా అంశాలను నిశితంగా విఫులీకరించారు. మహిళల కోసం రూపొందించిన ఆర్టికల్ 38, క్లాజు 4 ప్రకారం అన్ని పాలనా సంస్థల్లో దామాషా ప్రకారం వారికి భాగస్వామ్యం కల్పించాలి. దాదాపు 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం నేపాల్‌లో అనివార్యం. ఆస్తి హక్కులో పురుషులకు, స్త్రీలకు సమాన వాటా ఉంటుందని ఆ ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

జనాభా దామాషా ప్రకారం దళితులకు పాలనలో భాగస్వామ్య హక్కును కల్పించారు. కానీ నేపాల్‌లో ప్రస్తుత దళిత జనాభా 13 శాతంగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వారి జనాభా 20 శాతానికి పైగానే ఉంటుందని దళిత సంస్థలు, సంఘాలు చెబుతున్నాయి. శాస్త్రీయమైన పద్ధతిలో జనగణన జరగలేదనేది నేపాల్‌లో ప్రత్యామ్నాయ మీడియాను నిర్వహిస్తున్న జాగరణ్ మీడియా సెంటర్ అభియోగం. ప్రతి రైతుకూ, కూలికీ భూమి ఇవ్వాలని, ప్రజాస్వామ్య పోరాటంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు విద్య, వైద్యం, గృహ, సామాజిక భద్రత కల్పించాలని కూడా రాజ్యాంగంలో పేర్కొనడం విశేషం.

 హిందూ రాజ్యం కాదు
 భారత్ పెద్దన్న పాత్రను సైతం నేపాల్ రాజ్యాంగ సభ తిరస్కరించింది. హిందూ రాజ్యంగా ప్రకటించాలనీ, ఆవును జాతీయ జంతువుగా పరిగణిం చాలనీ భారతదేశం చేసిన అప్రకటిత ప్రతిపాదనలను, జరిపిన మంతనా లను నేపాల్ తోసిపుచ్చింది. విదేశాంగ ప్రతినిధులను నేపాల్‌కు పంపి, ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ప్రచండ లాంటి నాయ కుడిని ఢిల్లీకి పిలిపించి జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. పుట్టుక ద్వారా నేపాల్ పౌరసత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను రాజ్యాంగ సభ తిరస్కరించి, వారసత్వాన్నే ప్రాతిపదికగా తీసుకుంది. ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. ఇప్పటికే భారత సంతతి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

ఇది నేపాల్ జాతీయులకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని భావించడం వల్లనే పై అభిప్రాయానికి రాజ్యాంగ సభ మొగ్గు చూపినట్టు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే  నేపాల్‌లోని మధేశి ప్రజలను భారత ప్రభుత్వం పరోక్షంగా రెచ్చగొడుతున్నదని నేపాల్ భావిస్తోంది. ఇటువంటి పలు కారణాలవల్ల భారతదేశంతో విసిగివేశారిపోయిన నేపాల్ ప్రభుత్వం చైనా వైపు స్నేహ హస్తం చాస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా నేపాల్ ఆంతరంగిక విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే, ఒక పొరుగు దేశంతో స్నేహపూర్వక బంధం కొనసాగుతుంది.
 

మల్లెపల్లి లక్ష్మయ్య
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement