నేపాల్ అంతర్యుద్ధం! | nepal is a democracy country and have a constitution | Sakshi
Sakshi News home page

నేపాల్ అంతర్యుద్ధం!

Published Fri, Oct 2 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

నేపాల్ అంతర్యుద్ధం!

నేపాల్ అంతర్యుద్ధం!

రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యం నెలకొన్న దేశాల్లో నేపాల్ ఒకటి. అయితే,  ప్రజాస్వామ్య సాధన ఏమంత సులభంగా జరగలేదు. సుదీర్ఘ పోరాటం ద్వారానే సాధ్యమైంది. రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ పోరాడిన మావోయిస్టులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ అంతర్యుద్ధానికి తెరలేచింది. ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఈ పోరాటంలో పదివేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఆనాటి తిరుగుబాటు సంగతులు, నేపాల్ చరిత్ర ‘నేటి వన్స్ అపాన్ ఏ టైమ్’లో..!

పద్దెనిమిదో శతాబ్దానికి ముందు కఠ్మాండు, పఠాన్, భక్తపుర్ అనే మూడు భాగాలుగా నేపాల్ మనుగడలో ఉండేది. గూర్ఖా రాజైన పృథ్వి నారాయణ్ షా అనేక యుద్ధాలు చేసిన తర్వాత 1769లో ప్రస్తుత నేపాల్ ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి 1815-16 కాలంలో బ్రిటిష్ వారితో తగాదా వచ్చింది. నేపాల్ గూర్ఖాలను తక్కువ అంచనా వేసిన బ్రిటిషర్లు యుద్ధంలో ఖంగుతిన్నారు. దీంతో సుగౌళీ ఒప్పందాన్ని చేసుకుని, యుద్ధం విరమించారు. భారత్‌లో సిపాయిల తిరుగుబాటు సమయంలో నేపాలీ వీరుల శౌర్యాన్ని మెచ్చి, వారికి సిక్కింలోని ప్రాంతాలతో పాటు టెరాయ్ భూభాగాన్ని కూడా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బహుమతిగా ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా నేపాల్ సైనికులు ఈస్టిండియాకు మద్దతిచ్చేవారు.

షా పాలన అంతం..
 846లో షా వంశాన్ని అంతమొందించిన జంగ్ బహదూర్ రాణా దేశ పాలనను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కోట్ ఊచకోతగా పేరొందిన కొన్ని వందల మంది రాకుమారుల హత్యలకు కారణమయ్యాడు. 1948 వరకూ రాణాలు ప్రధానులుగా సేవలందించేవారు. అయితే, భారత దేశానికి స్వాతంత్య్రం రావడంతో వీరి పాలనకు తెరపడింది. త్రిభువన్ అనే కొత్త రాజును భారత్ తెరపైకి తీసుకొచ్చింది.
 
తిరుగుబాటుకు బీజం..
త్రిభువన్ కుమారుడైన మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాడు. 1972 వరకూ పాలించిన అనంతరం రాజు మహేంద్ర స్థానంలో అతని వారసుడు బీరేంద్ర పగ్గాలు చేపట్టాడు. ఈయన కూడా ఇదే వ్యవస్థను కొనసాగించాడు. 1989 వరకూ అమలులో ఉన్న ఈ వ్యవస్థను ప్రజలు వ్యతిరేకించారు. దేశమంతా ఆందోళనలు చెలరేగడంతో బలవంతంగానే రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చాడు.
 
ఎన్నికలు..
ఈ సవరణలతో దాదాపు యాభై ఏళ్ల తర్వాత నేపాల్‌లో ఎన్నికలు వచ్చాయి. 1991 మేలో జరిగిన ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెసు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. అయితే, ఏ పార్టీ కూడా రెండేళ్లకు మించి పాలించలేకపోయింది. దీనికి కారణం అవినీతి పాలన, ప్రజోపయోగ కార్యక్రమాల్లో మార్పు లేకపోవడమే.
 
అంతర్యుద్ధం మొదలు..
బ్రిటిష్ వారి తరహా రాచరిక పార్లమెంట్ విధానాన్ని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఆ పార్టీ మొగ్గు చూపింది. దీంతో ప్రజాస్వామ్య స్థాపనకై 1996లో అతివాద విధానాలు అవలంబించింది. ఇదే నేపాల్ అంతర్యుద్ధంగా రూపాంతరం చెందింది. విప్లవాత్మక ధోరణిలో కొనసాగిన ఈ యుద్ధంలో 12 వేల మందికిపైగా మరణించారు.

రాచ కుటుంబ హత్యలు..
 నేపాల్ చరిత్రలోనే విషాదకర సంఘటన 2001, జూన్ 1న జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో యువరాజు దీపేంద్ర తన తండ్రి, రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య సహా ఏడుగురు కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని నేటికీ చాలామంది నేపాలీలు అంగీకరించరు. ఈ మరణాల వెనక కుట్ర దాగున్నదని భావిస్తారు.

అంతర్యుద్ధం ముగింపు..
 రాజు మరణించడంతో అతని సోదరుడైన జ్ఞానేంద్రను రాజుగా ప్రకటించారు. ఇతని పాలన అస్తవ్యస్తంగా సాగింది. ఈ కాలంలో మావోలు మరింత విరుచుకుపడ్డారు. దీంతో 2005 ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని రద్దు చేసి, మావోలపై యుద్ధం కోసం అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. ఉద్యమకారులను, జర్నలిస్టులను అరెస్టు చేశాడు. రాచరికానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయరాదంటూ ఆంక్షలు విధించాడు. తిరుగుబాటు దారుల పక్షాన నిలుస్తున్నాయంటూ పత్రికా కార్యాలయాలను మూసివేయించాడు. అయితే, జ్ఞానేంద్ర ఎత్తుగడ విఫలమైంది. పట్టణాలు, నగరాలకే ప్రభుత్వ సైన్యం పరిమితమైంది. గ్రామాల్లో మావోలు పూర్తి పట్టుసాధించారు. దీంతో సైనికచర్య సాధ్యం కాని స్థితిలో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య 2005 సెప్టెంబరులో 3 నెలలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

2006 ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా రాజు జ్ఞానేంద్ర ప్రజలకే పాలన అప్పగించేందుకు అంగీకరించాడు. గతంలో నిర్వీర్యమైన ప్రతినిధుల సభను 2006 ఏప్రిల్ 24న తిరిగి ఏర్పాటుచేశాడు. తర్వాతి నెలలో ఈ సభ రాజు అధికారాలకు కోత పెడుతూ, ప్రపంచంలో ఏకైక హిందూరాజ్యంగా ఉన్న నేపాల్‌ను లౌకిక రాజ్యంగా మార్చింది. 2008 మే 28న అమలులోకి వచ్చిన 159వ అధికరణ ప్రకారం రాచరికం అంతమై సమాఖ్య రాజ్యంగా నేపాల్ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement