విభజనతో వేర్పాటు ఉద్యమాలు!
పార్లమెంట్‌లో ఏం జరిగింది -8
విభజన బిల్లు ఆమోదం పొందిన 18.02.2014 నాటి లోక్‌సభ సమావేశాల వివరాలు మరికొన్ని...
స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 8 బిల్లులో భాగమైంది అనుకూలురు ‘ఆయ్’ అనండి. ప్రతికూలురు ‘నో’ అనండి
ఆయ్ 169 నో నిల్
ఆమోదించబడింది
క్లాజ్ ది బిల్లులో భాగమైంది.
ల్రోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ స్పీకర్ ముందు సెక్రటరీ జనరల్, ఇతర ఉద్యోగులూ కూర్చుని ఉంటారు. వారి లో ‘రిపోర్టర్స్’ అనే వారు ఎప్పటికప్పుడు సభలో జరుగుతు న్న ప్రతి విషయాన్ని రికార్డు చేస్తుంటారు. రికార్డు చేసింది చేసినట్లుగా లోక్‌సభ వెబ్‌సైట్ లో పెట్టేస్తారు. అయితే దాని మీదే ‘అన్ కరెక్టెడ్ వెర్షన్’ ‘నాట్ ఫర్ పబ్లికేషన్’ అని వ్రాసి ఉంటుంది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే, కరెక్ట్ చేసి ‘లోక్‌సభ డిబేట్స్’ అనే పేరుతో పుస్తకం పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు నేను అనువదిస్తున్నది ఆ పుస్తకంలోంచే!
15.46 నుంచి అన్ కరెక్టెడ్ వెర్షన్‌లో ఏమని రికార్డయ్యిందో చూడండి
సంసుమ కునగర్ బిశ్వమూర్తి స్పీకర్ టేబుల్ దగ్గర నిల్చున్నారు.
స్పీకర్ : ఇప్పుడు అనుకూలురందరూ మీ స్థానాల్లో నిలబడండి. వ్యతిరేకులందరూ తమ స్థానాల్లో నిలబడండి.
ఆయ్ : 169 నో : నిల్
సవరణ వీగిపోయింది.
స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్
క్లాజ్ 8 బిల్లులో భాగమైంది
ప్రతిపాదన ఆమోదించబడింది
క్లాజ్ 8 బిల్లులో భాగమైంది
్రఅన్ కరెక్టెడ్ రికార్డింగ్‌లో స్పీకర్ సవరణ మీద తలలు లెక్కబెట్టి 169 అనుకూలం 0 వ్యతిరేకం అని ప్రకటించినట్లు రికార్డు అవ్వగా, ప్రింట్ అయిన పుస్తకంలో, ‘బిల్లులో భాగం చేస్తున్నాను ఎందరు అనుకూలం’ అని స్పీకర్ తలలు లెక్కపెట్టినట్లు సరి చేశారు. అన్ రికార్డెడ్ నిజమైతే, 169 మంది సవరణను బలపర్చినట్లు... వీగిపోయినట్లు స్పీకర్ ఎలా ప్రకటిస్తారు? ప్రింట్ అయిన వెర్షన్ కరెక్ట్ అయితే, తలలు కూడా లెక్క పెట్టకుండా ‘స్పీకర్ సవరణ వీగిపోయింది’ అని ప్రకటించేశారు.
367(3) ప్రొవిజో అనుసరించి, స్పీకర్ గనుక అనవసరంగా ‘డివిజన్’ అడుగుతున్నా రని భావిస్తే, ఎందరు అనుకూలమో, ఎందరు వ్యతిరేకమో తలలు లెక్కపెట్టి సభా నిర్ణయాన్ని ప్రకటించవచ్చు! అసలు లెక్కపెట్టకుండా, రూల్స్ లెక్కే చేయకుండా వ్యవహరించే అధికారం స్పీకర్‌కి లేదు. ఇద్దరు సభ్యులు, అంత గొడవ చేసి తలలు లెక్కపెట్టే స్థితికైనా తీసుకొస్తే.. కనీసం వారిద్దరి తలలైనా వ్యతిరేకిస్తున్నట్లు లెక్కపెట్టాలనే ఆలోచన కూడా చేయలేదు స్పీకర్‌గారు
స్పీకర్ : క్లాజ్ 9 నుండి 14 వరకూ బిల్లుకు కలపబడ్డాయి.
.. అంతరాయం..
క్లాజ్ 15. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి హోంమంత్రి షిండే ప్రతిపాదించిన సవరణ
స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్ ‘సవరించబడ్డ క్లాజ్ 15 బిల్లులో భాగమవుతుంది.
ప్రతిపాదన ఆమోదించబడింది
క్లాజ్ 15 బిల్లులో భాగమైంది
క్లాజ్ 16 బిల్లులో భాగమైంది
క్లాజ్ 17 షిండే గారు ప్రతిపాదించిన సవరణలతో బిల్లులో భాగమైంది.
షిండే గారు ప్రవేశబెట్టిన రూల్ 80(1) ని సస్పెండ్ చేయనున్న సవరణ సభ ఆమోదిం చింది. తద్వారా క్లాజ్ 17(ఏ) ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించబడింది.
క్లాజ్ 18, 19, 20 ఆమోదించబడ్డాయి.
క్లాజ్ 21, 23, 24, 25, 26, 27 షిండే గారి సవరణలు ఆమోదించబడి బిల్లులలో భాగమయ్యాయి.
క్లాజ్ 22, 28, 29, 30, 31 బిల్లులో భాగమయ్యాయి.
స్పీకర్ : అసదుద్దీన్ ఒవైసీ, క్లాజ్ 32 కి మీ సవరణ నెం.46 ప్రతిపాదిస్తున్నారా?
అసదుద్దీన్ ఒవైసీ : పేజీ 8, 32 నుండి 35వ లైన్‌లు ఈ విధంగా సవరించ ప్రార్థిస్తున్నాను. 32(1) అప్పాయింటెడ్ రోజు నుంచి తెలంగాణా రాష్ట్రానికి వేరే హైకోర్టు, హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌గా ఉండాలి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉండాలి.
మేడమ్, కారణమేమిటంటే.. ప్రాంతాల వారీగా బార్, బెంచ్ కూడా నిలువునా చీలిపోయి ఉన్నాయి. కొత్త రాష్ట్రానికి సొంత హైకోర్టు కావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరు స్తున్న ప్రభుత్వం, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టం. పైకిరావాలనే అడ్వొకేట్ల పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ చెయ్యలేదా? ఎగ్జిక్యూటివ్ హైకోర్టు ఏర్పాటు చేయాలి, జ్యుడీషియరీ జడ్జీల నేర్పాటు చెయ్యాలి. ఇది చెయ్యకపోవడం వల్ల ఒక అసంపూర్ణ తెలంగాణ ఏర్పడి దాని ప్రభావం ‘రిట్లు’ వేస్తారు. ప్రతి చిన్న విషయానికీ స్టే ఇచ్చేస్తారు. నా సవరణ అంగీకరించి తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం.
స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ గారి సవరణ సభ ముందు ఓటింగ్ కోసం ఉంచుతున్నాను.
సవరణ వీగిపోయింది.
ది క్వశ్చన్ ఈజ్ = క్లాజ్ 32 బిల్లులో భాగమైంది
ప్రతిపాదన ఆమోదించబడింది
క్లాజ్ 32 బిల్లులో భాగమైంది.
స్పీకర్ : అసదుద్దీన్ ఒవైసీ 33వ క్లాజ్‌కు 47 నెం. సవరణ ప్రతిపాదిస్తున్నారా?
ఒవైసీ : పేజీ 9లో 1 నుండి 8 లైన్ల వరకూ సవరించ ప్రార్థన.
1) ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన రోజు జడ్జీలుగా వ్యవహరించబడతారు.
2) ఆ రకంగా హైదరాబాద్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలైన వారు, చీఫ్ జస్టిస్‌గా అప్పాయింట్ చేయబడినవారు తప్ప, జడ్జీలుగా తమ నియామకాల ప్రాధాన్యత (ప్రియారిటీ) బట్టి ఎప్పాయింటెడ్ రోజు నాటికి, రాంకింగ్ పొందాలి.
మేడమ్, ఆంధ్రప్రదేశ్ జడ్జిలు స్థానికతను బట్టి హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌కు కేటాయించబడాలి. హైకోర్టు ఏర్పాటు చేయకుండా, స్థానికత ఆధారంగా జడ్జీలను నియమించకుండా, మీరు తెలంగాణాకు సమతుల్యం చేయలేరు అందుచేత, సమతుల్యం, న్యాయం జరగటానికి నా సవరణ ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. నేను తలలు లెక్కపెట్టమని కోరుతున్నాను. ఇంతకు ముందు సవరణకి మీరు తలలు లెక్కపెట్టడం కూడా ఒప్పుకోలేదు.
స్పీకర్ : ఒవైసీ గారి క్లాజ్ 33కి 47వ సవరణ, ఓటింగ్ నిమిత్తమై సభ ముందుంచుతున్నాను.
సవరణ వీగిపోయింది
క్వశ్చన్ ఈజ్ 33 బిల్లులో భాగమైంది
ఆమోదించబడింది.
క్లాజ్ 34, 36 కూడా బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 47 = రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్
ప్రభుత్వం తరపున షిండేగారు సవరణలు ప్రతిపాదించారు.
స్పీకర్ : ప్రొఫెసర్ సౌగత్‌రాయ్, 43వ సవరణ, 47వ క్లాజుకి ప్రతిపాదిస్తున్నారా?
ప్రొ॥సౌగత్‌రాయ్ : ఫీజు 11లో 41వ లైన్ ‘‘అదర్ పెరామీటర్స్’’ (ఇతర ప్రామాణికాలు) పదాన్ని తొలగించాలి.
నేను సవరణ ప్రతిపాదిస్తున్నాను గానీ ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం మేము తీవ్ర వ్యతిరేకులమని మరోసారి మీ దృష్టికి తెస్తున్నాను. ఈ చర్య, వేర్పాటు వాదానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉనికికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఈ పనివల్ల తీవ్ర పరిణామాలుంటాయి. రూల్ 367(3) కింద నా సవరణకు ‘డివిజన్’ చేయించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను.
4-00
ఇది పెద్ద విషయం కాదు. కానీ నేను ప్రజాస్వామ్య ప్రామాణికాన్ని ఈ సభలో నిలపాలని ప్రయత్నిస్తున్నాను. మీరు 367(3)ని అతిక్రమించటానికి 367(2)ని వాడలేరు. మీ నిర్ణయం సవాల్ చేయబడితే, లాబీలు ఖాళీ చేయించి ఓటింగ్ జరిపించి తీరాల్సిందే. మేము ఆంధ్రప్రదేశ్ విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మరిన్ని రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలు ప్రారంభమై అంతర్యుద్ధం వచ్చే దుస్థితి దాపురిస్తుంది. నేను సవరణ ఎందుకు ప్రతిపాదిస్తున్నానంటే, రెవెన్యూ పంపకం, జనాభా మరియు ఇతర పెరామీటర్స్‌కు లోబడి జరుగుతుంది అని పెట్టారు. ఏమిటా పెరామీటర్స్? ఎవరు నిర్ణయిస్తారు? మాకిష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విడదీస్తున్నారు. జనాభా ప్రకారమే ఆదాయం పంచాలి. ప్రభుత్వం ఆదాయ పంపకం తన చేతుల్లో పెట్టుకుంటోంది. ఈ తరహా పంపకాన్ని నేనంగీకరించలేను. విభజనను వ్యతిరేకిస్తూనే సవరణ ప్రతిపాదిస్తున్నాను.
స్పీకర్ : సౌగత్‌రాయ్ గారి సవరణ ఓటింగ్ నిమిత్తం సభ ముందుంచుతున్నా.
సవరణ వీగిపోయింది.
47వ క్లాజ్ బిల్లులో భాగమైంది.
క్లాజ్ 48 కూడా బిల్లులో కలపబడింది.
-ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు