అభిప్రాయాలూ చెప్పనివ్వరా? | bifurcation causes for separatist stir | Sakshi
Sakshi News home page

అభిప్రాయాలూ చెప్పనివ్వరా?

Published Wed, Nov 11 2015 9:40 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

అభిప్రాయాలూ చెప్పనివ్వరా? - Sakshi

అభిప్రాయాలూ చెప్పనివ్వరా?

పార్లమెంట్‌లో ఏం జరిగింది -10
 
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత 20. 2.2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాలు ఇక చూద్దాం.
రాజ్యసభ 20-2-2014వ తేదీన 3.08 నిమిషాలకు తిరిగి ప్రారంభమయ్యింది. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు
డిప్యూటీ చైర్మన్: గౌ॥సభ్యులారా, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2014 తీసుకోబడుతోంది. శ్రీ అరుణ్‌జైట్లీ- ప్రతిపక్ష నాయకులు, శ్రీ నరేష్ గుజ్రాల్, శ్రీరాజీవ్ చంద్ర శేఖర్, శ్రీ అనిల్ దేశాయ్, శ్రీ దీపక్ ఒబెరాన్, శ్రీ వై.ఎస్.చౌదరి.
 ... అంతరాయం ...
దయచేసి వినండి. ఈ గౌ॥సభ్యులంతా బిల్లు యొక్క రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ నోటీసులిచ్చారు. మంత్రిగారు బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత, ప్రతిపక్ష నాయకునికి ఈ బిల్లు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమిస్తాను.
 ... అంతరాయం ...
నోటీసులిచ్చిన ఇతర సభ్యులకీ అవకాశమిస్తాను. దయచేసి వినండి.. ప్లీజ్ వినండి.. ప్లీజ్ వినండి.. అందుకే ప్రతిపక్ష నాయకునికి అవకాశం.. ప్లీజ్ వినండి.
హోంమంత్రి షిండే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చేయుట, తత్సంబంధిత విషయాలు, లోక్‌సభలో పాసైన విధంగా, ఆమోదం కోరుతూ ఈ సభ ముందుంచు తున్నాను.
 నా ఉపన్యాసం కాపీని ‘టేబుల్’ చేస్తున్నాను.
లోక్‌సభలో చేసిన ఉపన్యాసాన్ని వ్రాసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశారు.
 

అక్కడ చెప్పనివి ఇక్కడ కొత్తగా కలిపిన అంశాలు:
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడవాలి. దానికోసం, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్‌గా, అన్ని అనుమతులూ పొందేలా నిర్వాసితుల పునరావాసం వంటి కార్యక్రమాలు పూర్తి చేసేలా, బిల్లులో మా ‘కమిట్‌మెంట్’ పొందుపర్చాం.
రాయలసీమకు ఉత్తరాంధ్రలకు స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తాం. సీమాంధ్రకు మొన్న లోక్‌సభలో చెప్పినట్లుగా, ఆర్థిక ప్యాకేజీ ఇస్తాం. ప్లానింగ్ కమిషన్‌లో స్పెషల్ సెల్ ఏర్పాటుచేసి, డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తగు ఆర్థిక సహాయం అందేలా చర్యలు గైకొంటాం
 (ప్రశ్న ప్రతిపాదించబడింది)
డిప్యూటీ చైర్మన్: ప్రతిపక్ష నాయకుడు, రాజ్యాంగబద్ధత గురించి, బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. ఆ తర్వాత నా నిర్ణయం చెప్తాను. అరుణ్‌జైట్లీ, శ్రీ అరుణ్‌జైట్లీ.
 ... అంతరాయం ...

 సభ వాయిదా పడింది.
 తిరిగి 3.20 నిమిషాలకు ప్రారంభమయ్యింది.
డిప్యూటీ చైర్మన్: గౌరవ సభ్యులారా, ప్రతిపక్ష నాయకుడు రాజ్యాంగబద్ధత గురించి పాయింట్ లేవనెత్తుతున్నారు, వ్యతిరేకించటం లేదు. పొరపాటున నోరుజారి, వ్యతిరేకిస్తున్నారన్నాను. నేనాయనను రాజ్యాంగ అంశం లేవనెత్తటానికే పిలిచాను, వ్యతిరేకించటానికి కాదు. ప్రతిపక్ష నాయకుడిని వినండి. మీకనుకూలంగానే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా వినటం సభ సాంప్రదాయం. దయ చేసి మీ సీట్లకి వెళ్లండి.
 3.23కి సభ మళ్లీ వాయిదా పడింది.
 3.37కి మళ్లీ సభ ప్రారంభమయ్యింది.
 అధ్యక్షస్థానంలో శ్రీమతి రేణుకా చౌదరి ఉన్నారు. సభ మళ్లీ వాయిదా పడింది.
 4.00కి సభ మళ్లీ ప్రారంభమయ్యింది.
 రాణి లక్ష్మీబాయి అగ్రికల్చరల్ యూనివర్సిటీ బిల్లు, ఢిల్లీలో రాష్ట్రపతి పాలన బిల్లు తీసుకోబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ రి ఆర్గనైజేషన్ బిల్లు తిరిగి ప్రారంభమయ్యింది.
డిప్యూటీ చైర్మన్: ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. మిస్టర్ చౌదరి మీరు అటార్నీ జనరల్‌ను సభకు పిలవాలని ఇచ్చిన ఎమెండ్‌మెంట్ ప్రతిపాదించవచ్చు. దానికో పద్ధతుంది. ముందు జనరల్ డిస్కషన్ అవ్వాలి. ఆ తర్వాతే సవరణలు.. మీ మీద చర్యలు తీస్కోవల్సివస్తుంది. యేచూరిగారూ మీకేం కావాలి..
 (నిరంతర అంతరాయం)

యేచూరి: బిల్లు మీద చర్చ జరగాలనే ఏకాభిప్రాయానికొచ్చాం. సభను కంట్రోల్ చెయ్యండి. ఎవరి సీట్లకి వారిని వెళ్లమనండి.
డిప్యూటీ చైర్మన్: గౌరవ సభ్యులారా.. అటార్నీ జనరల్ విషయమై సవరణ కూడా సరైన సమయంలో ప్రస్తావించాలి.. ముందు డిస్కషన్ ప్రారంభమవ్వాలి. తరవాత సవరణలు.. రూల్ నేను అతిక్రమించలేను.. శ్రీ వెంకయ్యనాయ్డూ మీరు మాట్లాడతారా..
వెంకయ్య నాయుడు: సభ ‘ఆర్డర్’లో వుంటే మాట్లాడతాను.
డిప్యూటీ చైర్మన్: నేనేం చెయ్యను.
వెంకయ్య నాయుడు: అధికార సభ్యులే సభను ఆటంకపరుస్తుంటే నేనెలా మాట్లాడగలను. నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. సభ వాతావరణం మార్చండి. సభలో ‘ఆర్డర్’ తీసుకురండి. మీ సభ్యుల్ని ‘వెల్’ లోంచి వెనక్కి పిలిపించి చర్చకు వీలైన వాతావరణం కల్పించవల్సిందిగా పాలక సభ్యులకు విజ్ఞప్తి.
డిప్యూటీ చైర్మన్: దయచేసి మీ స్థానాల్లోకి వెళ్లి, అవసరమనుకుంటే బిల్లును వ్యతిరేకించండి. ఓటు వెయ్యండి. ఇది ప్రజాస్వామ్యం - ఇలా చెయ్యకండి.
వెంకయ్య నాయుడు: మా బీజేపీ వరకూ, మేమెప్పుడూ డిబేట్, డిస్కషన్ కోరుకుంటున్నాం. మేము కొన్ని సవరణలు కోరతాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం. మా పార్టీ, మొదటి రోజు నుండి చెప్తున్నాం. మేము తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తాం. అలాగే సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాం. దానికోసం, ముందు సభలో ఆర్డర్ తీసుకురావాలి. అలా కాకపోతే, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లవుతుంది.

డిప్యూటీ చైర్మన్: దయచేసి సీనియర్లు కలగజేసుకుని సభ్యుల్ని వాళ్ల సీట్లకు పంపండి. తప్పు చేస్తున్న సభ్యులకు మనవి - మీ సీట్లలోకి వెళ్లిపోండి.
సీతారామ్ యేచూరి: చర్చ జరగాలని, సభ సజావుగా నడవాలని మేమందరమూ కోరుకుంటున్నాం. సభను ఆర్డర్‌లో పెట్టండి.
డిప్యూటీ చైర్మన్: మీ సీట్లకు వెళ్లండి - చట్టబద్ధమో కాదో సభ తేలుస్తుంది - ఏయ్ ఏం చేస్తున్నారు - మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను. ఇదిగో మీకే చెప్తున్నా. ఏమిటీ నాన్సెన్స్. డెమోక్రసీని చంపేస్తున్నారు. మీ సీనియర్లు, లీడర్లు చెప్పినట్లు వినరే...!
 4.10 నిమిషాలకు సభ వాయిదా పడింది.
4.25కు మళ్లీ ప్రారంభమైంది.
డిప్యూటీ చైర్మన్: శ్రీ వెంకయ్యనాయుడూ...

వెంకయ్య నాయుడు: శాంతియుతంగా ఈ చర్చ జరగనీయండి. తెలంగాణ సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ప్రదర్శితం చేసే అవకాశమివ్వండి. సభలో ‘ఆర్డరు’ తీసుకురండి. ఇది చరిత్రాత్మక చట్టం. దీనిని లోతుగా చర్చించాలి. శాంతియుతంగా అందరూ చర్చలో పాల్గొనే పరిస్థితులు కల్పించమని కోరుతున్నా.
డిప్యూటీ చైర్మన్: నాకు సభను క్రమశిక్షణలో పెట్టాలనే వుంది - కానీ ఏం చెయ్యను.
వెంకయ్య నాయుడు: అధ్యక్షులే అంత నిస్సహాయస్థితిలో వుంటే, నేను బాధ్యత తీసుకోవాలా, ఏంటి?
డిప్యూటీ చైర్మన్: ఏం చెయ్యను, మీరొప్పుకుంటే వీరి మీద చర్య తీసుకుంటా.
వెంకయ్య నాయుడు: మీరే అలా నిస్సహాయంగా మాట్లాడితే ఎలా?
డిప్యూటీ చైర్మన్: వారి మీద చర్య తీసుకుంటా - మీరు సపోర్టు చెయ్యండి.
వెంకయ్య నాయుడు: ఇలాగ ఈ సభ నడుస్తుందా?
డిప్యూటీ చైర్మన్: మీరు సపోర్టు ఇస్తానంటే, నేను చర్య తీసుకోవటానికి సిద్ధం.

వెంకయ్య నాయుడు: రాష్ట్ర పునర్విభజన వంటి చరిత్రాత్మక చట్టం విషయమై నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పకపోతే ఎలా? ప్రభుత్వాన్ని సభానాయకుణ్ణి, మీ సభ్యుల్ని అదుపు చేయమని కోరుతున్నా. అధికార పార్టీ సభ్యులే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లో ఉన్నారు. అధికార పార్టీ పరిస్థితి బాగోలేదని అర్థమవుతోంది. దేశమంతా చూస్తోంది. ‘లైవ్ టెలికాస్ట్’ ఇస్తున్నారని చెప్పారు. (హిందీలో) తెలంగాణ కావాలని 1969లో, ఆంధ్రా కోసం 1972లో వేరు వేరు ఆందోళనలు జరిగాయి. ఆంధ్రాలో బలి దానాలు చేశారు. ఆంధ్రాలో 360-370 మంది బలిదానం చేశారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన అంశం / (ఇంగ్లీష్‌లో) డిప్యూటీ చైర్మన్‌గారూ ఇలా అయితే మాట్లాడటం చాలా కష్టం.
డిప్యూటీ చైర్మన్: నాకు వినపడుతోంది.
వెంకయ్య నాయుడు: మీకు వినబడితే సరిపోదు. దేశమంతా వినాలి. ఈ సభ వినాలి. సభ్యులు అలా అరుస్తుంటే...
డిప్యూటీ చైర్మన్: దేశమంతా సభ్యుల ఈ అనుచిత ప్రవ ర్తన చూడాలి.

వెంకయ్య నాయుడు: (హిందీ) అయ్యా! అలాగైతే ఎలాగండి. సభను ఆర్డర్లో పెట్టండి. మేము బిల్లును సమర్థిస్తున్నాం. కాని మా అభిప్రాయాలు, సమస్యలు, సభ ముందు పెట్టనివ్వండి. వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ ఇలాగైతే కష్టం. అందుకే నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నా సభలో సాధారణ స్థితి వుంటేనే నేను మాట్లాడగలను.
డిప్యూటీ చైర్మన్: మాట్లాడండి వెంకయ్య నాయుడుగారు, నాకు వినబడుతోంది. సభ్యులు వింటున్నారు. మాట్లాడండి.
వెంకయ్య నాయుడు: (హిందీ) ఉపసభాపతిగారూ! తెలంగాణ ఆంధ్రా ఇద్దరూ అన్నదమ్ములు. కాని ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండే పరిస్థితే లేదు. ఈ విషయమై వేరు వేరు పార్టీలు తమ తమ అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. (వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా సభ 4.30 నిమిషాలకు వాయిదా పడింది.)

 -ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement