ఎవరు అల్లిన సాలెగూళ్లు!
మహిళల జీవించే హక్కును భగ్నం చేస్తూ జరిగిన ఈ విష ప్రచారం దేశ వ్యాప్తంగా ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ఈ విద్యతోనే తాము శత్రువులుగా భావించే వారిపై రాజకీయులు పరోక్ష దాడులకు పాల్పడడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుగ్ధతో ఆ పార్టీ నేత ఒకరిపై ఇటీవల రాష్ట్రంలో రేగిన దుప్ప్రచారం అలాంటిదే.
‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంద’ని సామెత. ఇవాళ్టి కొన్ని ప్రచార మాధ్యమాల పాత్ర కొందరు రాజకీయ నాయకుల, వారి పార్టీల పతనాన్ని మించి పాతాళానికి దిగజారిపోయిందంటే సత్యదూరం కాదు. నాయకులు పరస్పరం విమర్శలు గుప్పించుకోవచ్చు. హద్దులు మీరి దూషించుకోవచ్చు. కానీ బృహత్తర సామాజిక బాధ్యతలు నిర్వర్తించిన మహిళలను ఇందులోకి లాగుతున్న తీరు, ఈ పతనావస్థనే కొన్ని పత్రికలూ, కొన్ని చానళ్లూ అంటకాగుతున్న తీరు ఖండించదగినదిగానే ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు ధనస్వామ్య దోపిడీ వ్యవస్థలోని మహిళ కూడా రకరకాల బాధలకు గురవుతున్న దళితురాలు కాబట్టే ఆమె పట్లా ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఒకటి వాస్తవం. మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థకు పునాదులు పడిన నాటి నుంచే స్త్రీ చైతన్యం అంకురించడమూ ఆరంభించింది. బౌద్ధయుగం నుంచి, మాతృమూర్తుల పేరిట కుటుంబ వంశ వృక్షాలే (శాతవాహనులు)వెలిసిన సంస్కృతి ఇక్కడ ఉందన్న సంగతి విస్మరించరాదు. ఇప్పుడు ఆ విశిష్ట సంస్కృతి జాడ కూడా కానరాకుండా పోతోంది. ఆ జాడ కనపించకుండా పోతే పోనీ. స్త్రీ ఎడల చూపవలసిన కనీస మర్యాద, మన్ననలకు కూడా వారిని నోచుకోకుండా చేస్తున్న దుస్థితి నెలకొంది.
ప్రధాని మోడీ చెప్పినట్టు ఇలాంటిది తీరుబడిగా చర్చలకు పరిమితమై, చర్యలకు దూరమై, మొహాలు చాటువేసుకునే పరిణామం మాత్రం కాదు. మీడియా పుణ్యమా అని ఇప్పుడు స్త్రీల విషయంలో సమాజం చూస్తున్న దుశ్చర్యలు గానీ, దుష్ర్పచారాలు గానీ గతంలో ఎప్పుడూ ఇంతగా పెట్రేగిపోలేదు. వాటి కోసం మీడియా పనిగట్టుకుని రెచ్చిపోయిన దుర్గతీ లేదు. నిర్భయ దేశాన్ని కలచివేసింది. కదలించింది. కానీ ఆ దుర్ఘటనకు ముందూ వెనుకా కూడా వయసుతో నిమిత్తం లేకుండా సంసారం చేసుకుంటున్న మహిళలపైనా, యువతుల మీద వెబ్‌సైట్ల ద్వారా, ఇంటర్నెట్ ముసుగులో పిచ్చి కూతలు, తప్పుడురాతల విషాన్ని చిమ్మిన ఘనులు ఎందరో ఉన్నారు. మహిళల జీవిత భద్రతను భగ్నం చేస్తూ జరిగిన ఈ విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ఇందులోనే తాము శత్రువులుగా భావించే వారిపై రాజకీయులు ఇలాంటి పరోక్ష దాడులకు పాల్పడడాన్ని కూడా ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుగ్ధతో ఆ పార్టీ నేత ఒకరిపై ఇటీవల రాష్ట్రంలో రేపిన దుప్ప్రచారం అక్షరాలా ఆ తరహాకు చెందినదే.
ఆ యువ మహిళా నేత మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకే కొందరు దుర్మార్గులు ఇంటర్నెట్ వెబ్‌సైట్లను వాడుతున్నారు. మార్ఫింగ్‌తో రెండు ఫోటోలను అతికించి, ఆ ఫోటోలలోని వ్యక్తులపై హేయమైన రీతిలో బురద జల్లడానికి పూనుకునే పైశాచికానందం ఇందులో కనిపిస్తుంది. ఇది ఎంతటి నీచమైన ప్రచారమంటే, కొందరు మహిళా కార్యకర్తలూ, ఉద్యమశీలురూ రాజకీయాలతో నిమిత్తం లేకుండానే ఈ దారుణాన్ని ఖండించవలసి వచ్చింది. మహిళానేత, పార్టీకి చెందిన ఎంపీల ఫిర్యాదు మేరకు ఈ దుశ్చర్యకు బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. సమర్థుడూ, నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్న హైదరాబాద్ కమిషనర్ మహేంద్రరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విచారణలో రెండు అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. మహిళా నేత బరువెక్కిన హృదయంతో ఆ నీలివార్తలను, ఆరోపణలను తోసిపుచ్చారు. శాడిస్టులు లక్ష్యంగా చేసుకున్న సినీనటుడు కూడా మనస్తాపంతో ప్రత్యక్ష ఖండనమండనలతో స్పష్టమైన ప్రకటన జారీ చేశాడు. ఈ ఉన్మాదంలో ఏ రాజకీయ పార్టీకి ప్రమేయం లేదనే అనుకుంటున్నానని కూడా పేర్కొన్నారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. మొన్నటి ఎన్నికలలో జగన్ పార్టీకి పోటాపోటీగా నిలిచింది ఒకే ఒక్క పార్టీ, తెలుగుదేశం. ఆ పార్టీ అధిష్టానం నుంచి గానీ, ఆ పార్టీతో జట్టుకట్టిన బీజేపీ నుంచి కానీ ఈ దురదృష్టకర ఘటనను ఖండిస్తూ ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం ఆశ్చర్యకరం. కాబట్టి ఈ ప్రచారంలో వెబ్‌సైట్ వెనుక ఉన్న ఆ అజ్ఞాత దుష్టశక్తి ఎవరు అన్న ప్రశ్న రాక మానదు. ఆ మానవద్వేషులు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సినిమా రంగానికి చెందినవాడు. ఆ మానవద్వేషులు కూడా ఆ రంగానికే సంబంధించిన వారు కాకపోతే, ఇతడు పైకి రాకుండా ఉండేందుకు, మరో సినీ ప్రముఖుడితో చేతులు కలిపి ఉండవచ్చునన్న అంశాన్ని కాదనగలమా? ఓ వెండితెర ‘మారుతం’, మరో పసుపు ‘గాలి’తో కలిసి ఎన్నికలలో పనిచేయడం మనం చూసినదే. కాబట్టి ఈ వెండి, పసుపు సాలెగూళ్ల ప్రమేయాన్ని కాదనడం ఎలా? ఉత్తరాంధ్రలో తెలుగుదేశానికే చెందిన ఒక మహిళా సభ్యురాలు గతంలో(2012, అక్టోబర్ 22) పార్టీ కార్యాలయంలోనే పత్రికా గోష్టి ఏర్పాటు చేసి మరీ, జగన్ పార్టీ మహిళా నేతను గురించి చెడు ప్రచారానికి శ్రీకారం చుట్టలేదా? ఆ విషయాలను యూట్యూబ్‌లోకి ఎక్కించారా లేదా? దీనితో పాటు మరో పసుపు పత్రిక, దాని చానల్‌లో కూడా ప్రసారమైనాయా లేదా? సత్యం బయటపడాలంటే, వీటన్నిటినీ కూడా విచారణ కోసం కమిషనర్ పరిగణనలోనికి తీసుకోవాలి.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె వివాహం విఫలమై, ఇంటిదొంగగా మారిన కోయంబత్తూరు అల్లుడిని వదిలించుకోక ముందు ఒక వర్గం మీడియా ఆమె మీద కూడా ఇలాంటి దుష్ర్పచారమే చేసిన సంగతి గుర్తు చేసుకోవాలి. నేను వీటన్నింటి వెనుక వాస్తవాల గురించి ఆనాడు బహిర్గతం చేయవలసి వచ్చింది. ఆమె మరో వివాహం చేసుకుని ఇప్పుడు అమెరికాలో సుఖంగా కాపురం చేసుకుంటున్నది. లక్ష్మీపార్వతి మీద విష ప్రచారం చేయడానికి నాటి ముఖ్యమంత్రి ఒక తమిళనటుడిని తీసుకువచ్చి బూతులు మాట్లాడించిన సంగతి నిజమా కాదా? అంటే రాణింపు ఉన్న నాయకుల ఆడబిడ్డలు ఎవరూ రాజకీయ రంగంలో ప్రవేశించడానికి అర్హులు కాకుండా ఉండిపోవాలా?! మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడమే ఆదర్శం అవుతుందా? కొడుకులు దూసుకుపోవచ్చు. లేదా ఇంటి వాసాలు లెక్కబెట్టేవాడైనా చెల్లుబాటు కావచ్చు గానీ, 21వ శతాబ్దంలోనూ కూతుళ్లు వంటింటి కుందేళ్లుగా మిగిలిపోవాలా?
నిజానికి, ప్రపంచీకరణ పేరిట పెట్టుబడి వ్యవస్థ తన అవసరాల కోసం, ధనస్వామ్య యుద్ధంలో భాగంగానే అంతర్జాలాన్ని తెచ్చింది. దీనికి రెండువైపులా పదునే. ట్వీట్స్, ట్విటర్లు, వెబ్స్ ఏ పేరుతో పిలిచినా వీటి మీద ప్రభుత్వానికి అదుపు లేదు. అదుపు చేయగల సర్వర్లు ఇక్కడ లేవు. ఇప్పుడు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలలోకి చొరబడడమే కాకుండా, కొన్ని రహస్య కార్యకలాపాలకు కూడా ఇంటర్నెట్ ఉపకరిస్తున్నదని నోమ్ చామ్‌స్కీ 2000 సంవత్సరంలోనే హెచ్చరించాడు. లక్షల కోట్లలో పన్ను ఎగవేతకు అదొక రాజమార్గంలా తయారైంది. అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి పోయింది. బెల్, ఎటీ అండ్ టీ, టెలిఫోన్ లేబొరేటరీస్, బిల్‌గేట్స్, అంబానీ, టాటాల చేతుల్లోకి ఇది జారుకుంది. అందువల్లే విశ్వసనీయమైన సమాచారానికీ, ప్రజాభిప్రాయానికీ ఇంటర్నెట్ మాయాజాలంలో విలువ లేకుండా పోయింది. ఆ క్రమంలోనే సామాజిక వ్యవస్థను అల్లకల్లోలం చేయడానికి ఉపయోగపడుతోంది. తమ వ్యతిరేకుల మీద దుష్ర్పచారం చేయడానికీ, విషం చిలకరించడానికీ ఉపయోగపడుతోంది. ఉన్మాద సందేశాలకు పనికి వస్తోంది. అయితే మోడీ అన్నట్టు దీనిని అరికట్టడంలో ‘125 కోట్ల మంది ప్రజలు బాధ్యత కూడా ఉంది’ అని తప్పించుకోవడం సరికాదు. అది బాధ్యతా రాహిత్యం.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్