మ్యాచ్ ఫిక్స్డ్ చాలెంజ్ | C.Ramachandraiah analysation on Swiss challenge system | Sakshi
Sakshi News home page

మ్యాచ్ ఫిక్స్డ్ చాలెంజ్

Published Wed, Aug 24 2016 1:51 AM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

మ్యాచ్ ఫిక్స్డ్ చాలెంజ్ - Sakshi

మ్యాచ్ ఫిక్స్డ్ చాలెంజ్

విశ్లేషణ

సింగపూర్ కంపెనీలను మాస్టర్ డెవలపర్స్‌గా నియమించాల్సిన బాధ్యతను అమలుచేసే క్రమానికి కొనసాగింపుగా లేదా ముగింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్విస్ చాలెంజ్‌ను ముందుకు తెచ్చిందని భావించాలి.

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమ రావతి ప్రాంతంలోని 6.84 చ.కి.మీ.ల  (1,691 ఎకరాలు) ప్రాంతాన్ని ‘స్టార్ట్-అప్’ ఏరియా పేరిట పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేయడానికి సింగ పూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతి పాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మాస్టర్ డెవలపర్‌ను నియమించేం దుకు సింగపూర్ కంపెనీల ఈ ప్రతిపాదనలను ఎవరైనా స్విస్ చాలెంజ్ పద్ధతిలో సవాలు  చేయవచ్చునని, అంత కంటే మంచి ప్రతిపాదనలొస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఇచ్చిన 45 రోజుల గడువు సెప్టెంబర్ 1తో ముగుస్తుంది. సింగపూర్ కంపెనీల స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలోని అనేక నిబంధనలు రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా హానికరమైనవో తెలుపుతూ పలు విషయాలు మీడియాలో చర్చకొచ్చాయి. కాబట్టి అసలు ఈ స్విస్ చాలెంజ్ ద్వారా నిజంగానే పోటీని ఆహ్వా నిస్తున్నారా? లేక ముందే పరస్పర అంగీకారాలు, హామీలు కుదిరాక దీన్ని ఒక తంతుగా నిర్వహి స్తున్నారా? అనేదాన్నే ఇక్కడ  చూద్దాం.

బూటకపు ఛాలెంజ్

ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇంకాప్ (Infrastructure Corporation of Andhra Pradesh) సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజ్ (International Enter prise)లు  2014 డిసెంబర్ 8న అవగాహనా పత్రాన్ని (MoU) కుదుర్చుకున్నారుు. రాజధాని నగరానికి, రాజ ధాని ప్రాంతానికి మాస్టర్ ప్లాన్‌ను తయారుచేయుటకే అది ఉద్దేశించినది. అప్పటికి సీఆర్‌డీఏ (Capital Region Development Authority) ఏర్పడలేదు. రాజధాని ఎక్కడని కాని, రాజధాని పేరు కాని అధికారి  కంగా నిర్ణయించలేదు. (ఇదే ఒప్పందాన్ని ఇఖఈఅ ఏర్ప డ్డాక 2015 జనవరి 15న దానికి, సింగపూర్ సంస్థలకు మధ్య కుదిరినట్టుగా మరల రాసుకున్నట్టు తెలుస్తు న్నది). ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఎక్కడా ఏడాది కాలపరి మితి గల ఆ ఒప్పందం దొరకదు. దాని ముసాయిదా మాత్రం అందుబాటులో ఉన్నది.

2015 జనవరి 15 ఒప్పందాన్ని బట్టి చూస్తే ఆ గడువు 2016 జనవరి 14 వరకు. ఒప్పందంలోని ఆర్టికల్ 3.2(v) ప్రకారం ‘సీడ్ ఏరియా అభివృద్ధి కొరకు సింగపూర్‌కు చెందిన ఒకటి లేదా ఎక్కువ ప్రైవేటు కంపెనీలు మాస్టర్ డెవలపర్స్‌గా ఉండాలి. అవి స్వతహాగా కాని లేదా ఏపీసీఆర్‌డీఏతో సంయుక్తంగా కాని ఉండవచ్చు. ఒప్పందంలోని 3.2(v) ఆర్టికల్‌ను, అంటే సింగపూర్ కంపెనీలను మాస్టర్ డెవలపర్స్‌గా నియమించాల్సిన బాధ్యతను అమలుచేసే క్రమానికి కొనసాగింపుగా లేదా ముగింపుగా ఏపీ ప్రభుత్వం ఈ స్విస్ చాలెంజ్‌ను ముందుకు తెచ్చిందని భావించాలి. ఈ ఒప్పందం తర్వాత.. మాస్టర్ ప్లాను నివేదికలు, భూమి పూజలు, భూములు గుంజుకోవ డాలు, శంకుస్థాపనలు వగైరా జరిగాయి. అనేకసార్లు ఏపీ ప్రభుత్వం తరఫున పలువురు నేతలు, అధికారులు సింగపూర్‌లో పర్యటించడం, ఉత్తర ప్రత్యుత్తరాలు నడ పడం వీటన్నిటికన్న ముఖ్యమైనవి.

ఏపీఐడీఈ యాక్ట్  2001 సెక్షన్ 2 (ss, tt) ప్రకారం స్విస్ చాలెంజ్ విధానం అంటే ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీ తనకు తానుగా (Suo-Motu) లేదా అడగ కుండా ఒక ప్రతిపాదనను, కాంట్రాక్టు నియమాలను పంపిస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించి బాగున్నాయనిపిస్తే పోటీదారులను ఆహ్వానించడం. అలాంటి ప్రాజెక్టు లను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు అప్పటికే మొదలుపెట్టి ఉండకూడదు. పైగా అవి ఈ చట్టంలోని రెండవ కేటగిరి ప్రాజెక్టులకే పరిమితం. ఆ ప్రాజెక్టులకు 1. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు వన రులు సమకూర్చాలి, 2. వివిధ రూపాలలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి, 3. డెవలపర్‌కు పూర్తి హక్కులు కల్పించాలి, 4. నీరులాంటి అనేక సహాయ సదుపాయా లను విస్తృతంగా కల్పించాలి. అంటే ప్రభుత్వం అనేక వనరులు, ప్రోత్సాహకాలు, హామీలు, హక్కులు కల్పించే ప్రాజెక్టులైతేనే ప్రైవేటు కంపెనీలు స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టడానికి ముందుకు వస్తారుు.

కేల్కర్ వద్దన్నా ఎందుకీ స్విస్ ఛాలెంజ్?

ఏపీ ప్రభుత్వ ఆమోదం పొందిన సింగపూర్ కంపెనీల ప్రతిపాదన.. ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఆదేశాలను, కేల్కర్ కమిటీ అభిప్రాయాన్ని ఉల్లంఘిస్తున్నది. మహా రాష్ట్రకు చెందిన ఒక స్విస్ చాలెంజ్ వివాదంలో సుప్రీం కోర్టు 2009 మే 11 తీర్పు.. ఇలాంటి కొత్త పద్ధతులను పాటించేటప్పుడు స్పష్టమైన విధి విధానాలను రూపొం దించాలని, ప్రాజెక్టు రకాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలను గురించి ఎవరిని సంప్రదించాలి, అనుమతులు, కాలపరి మితులు వంటి వాటిని విధిగా ప్రకటించాలని,  పాల్గొ నాలనుకొనే అన్ని ప్రైవేటు కంపెనీలకు సమాన అవ కాశాలు ఉండాలని లేకపోతే ఏకపక్ష, అన్యాయ ధోర ణులు చొరబడతాయని పేర్కొన్నది. ఇలాంటి కారణాల వల్లనే కేల్కర్ కమిటీ 2015లో స్విస్ చాలెంజ్ పద్ధతిని వ్యతిరేకించింది. పోటీలో పారదర్శకత లోపిస్తుందని, పోటీదారులకు సమాచార కొరత ఉంటుందని, ఈ పద్ధ తిని ప్రోత్సహించవద్దని సిఫారసు చేసింది. ముందుగానే గుర్తించిన ప్రాజెక్టులను ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌‘ పద్ధతికి బదులు స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఇచ్చే అలవాటుని నియంత్రించాల్సి ఉందని, ఇవి రెండూ వేరు పద్ధతులని కేల్కర్ కమిటీ స్పష్టం చేసింది.

 

ఏపీ, సింగపూర్ అధికారుల మధ్య సాగిన ఈ లేఖలను చూస్తే ఏపీ ప్రభుత్వం సుప్రీం, కేల్కర్ కమిటీల సూచనలకు పూర్తి విరుద్ధమైన వైఖరిని అవలంబిం చిందని స్పష్టమౌతుంది. సింగపూర్ వాణిజ్యం, పరి శ్రమల శాఖకు చెందిన ఫ్రాన్సిస్ చోంగ్  2016 మార్చి 16న సెంబ్ కోర్బ్ కంపెనీ సీఈఓ టాంగ్‌కిన్‌ఫైకు రాసిన లేఖలో 2015 జనవరి 15 ఒప్పందాన్ని, అందులోని ఆర్టికల్ 3.2(v)ను (పైన నేను ఉదహరించినది) ప్రస్తా వించారు. అసెండాస్-సింగ్ బ్రిడ్జితో కలసి సెంబ్ కోర్బ్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటుచేసి అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనను సమర్పిస్తుందన్నారు. ఈ కంపెనీలను అమరావతి అభివృద్ధి భాగస్వామిగా నియమిస్తే ప్రత్యేక ప్రాజెక్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఏపీ ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరమనె గిరిధర్ 2015 ఏప్రిల్ 22న ఫ్రాన్సిస్ చోంగ్‌కు రాసిన లేఖలో స్విస్ చాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు, అవగాహనా పత్రం అమ లుకు తీసుకోవలసిన చర్యలపై సింగపూర్‌లో జరిగిన మార్చి 30-31 ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ఇది కొనసాగింపని పేర్కొన్నారు. దీనికి సింగపూర్ ఇంట ర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ సీఈఓ 2015 ఏప్రిల్ 30న గిరి ధర్‌కు జవాబిస్తూ అవగాహనా పత్రం ప్రకారం సెంబ్ కోర్బ్-అసెండాస్-సింగ్ బ్రిడ్‌‌జ కంపెనీలను తమ తర ఫున మాస్టర్ డెవలపర్‌గా నామినేట్ చేస్తున్నట్లు తెలి పారు. ఆ తర్వాతనే మే 2న ప్రభుత్వం రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ కంపెనీ (CCDMC)ని స్థాపిస్తూ 109, 110 జీఓలను విడుదల చేసింది. మే 4న స్విస్ చాలెంజ్ పద్ధతిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. వీట న్నిటిని పొందుపరుస్తూ 2015 మే 7న పట్టణాభి వృద్ధి శాఖ జీ.ఓ 331ను విడుదల చేసింది.

అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే...

అంటే సింగపూర్ వాళ్లకు అవసరమైన నిర్ణయాలన్నిటినీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా తీసుకొన్న తర్వాతనే.. సింగపూర్ వాళ్లు  2015 మే, జూలై నెలల్లో మాస్టర్ ప్లాన్ నివేదికలు ఇచ్చారంటున్న వారి వాదన నిరాధారమైనది, నిర్హేతుకమైనది కాదు. రాజధాని మాస్టర్ ప్లాన్‌పై రైతులు అనేక అభ్యంతరాలను తెలపడం,  కొన్ని చోట్ల సీఆర్‌డీఏ అధికారుల అవగాహనా సమావేశాలను అడ్డుకొనడం తెలిసిందే. ఆ ఫిర్యాదులను మంత్రి నారాయణ, కమిష్ నర్ శ్రీకాంత్‌లు సింగపూర్ కంపెనీలకు నివేదించడమూ తెలిసిందే.

 

2014 డిసెంబర్ 8న అవగాహనా పత్రంపై సంతకాలు జరిగిన నాటి నుండి నేటి వరకు అమరావతి ప్రాంతంపైన సింగపూర్ కంపెనీలకు పూర్తి సమా చారం, అవగాహన ఉండటమే కాదు, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు, సహకారం కొనసాగుతూనే ఉన్నాయి. మరే ఇతర విదేశీ లేదా స్వదేశీ కంపెనీలకు ఈ సానుకూలతలు లేవు. ఈ నేపథ్యం నుంచి చూస్తే సింగ పూర్ కంపెనీల స్విస్ చాలెంజ్ ప్రతిపాదన ఏవిధం గానూ స్వతహాగా లేదా అడగకుండా ఇచ్చినది కాదని స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టు తమకే దక్కాలనే స్పష్ట మైన అవగాహనతోనే, ఒప్పందంతోనే వాళ్లు ఈ పద్ధతిని ముందుకు తీసుకొచ్చారు. అసలు ఏ చాలెంజూ లేని దీన్ని మ్యాచ్-ఫిక్స్‌డ్ చాలెంజ్ అని కాక ఇంకేమనాలి?

 

- డాక్టర్ సి. రామచంద్రయ్య

 వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త

 Email: crchandraiah@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement