
సాక్షి, అమరావతి: ప్రజాతీర్పును కించపర్చే విధంగా మాట్లాడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య పరీక్షల కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన చంద్రబాబు మానసిక స్థితిని పరీక్ష చేయించుకోవడం మర్చిపోయినట్టున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మతిలేని విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు భర్తీకి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్‌షా తదితరులను కోరారన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారని చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్లి మోదీకి తనపై ఫిర్యాదు చేస్తారా అని చంద్రబాబు అనడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.