రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని.. ప్రజా రాజధానా? లేక ప్రైవేటు రాజధానా? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.
- ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రఘువీరా, రామచంద్రయ్య
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని.. ప్రజా రాజధానా? లేక ప్రైవేటు రాజధానా? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల జీవోలు తెచ్చి రైతుల పొట్టకొడుతోందని దుయ్యబట్టింది. సోమవారం ఇందిరాభవన్లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు.
రైతులనుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని ప్రైవేటువారికి లీజుకు ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పారదర్శకంగా సాగాల్సిన రాజధాని నిర్మాణాన్ని సొంత కార్యక్రమంగా రహస్యంగా ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. జీవోలను రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 21 నుంచి జూన్ 8 వరకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ కార్యక్రమాలు నిర్వహించనున్నామని రఘువీరారెడ్డి తెలిపారు.