అంతర్యుద్ధం అంచున ఉక్రెయిన్ | civil war in ukraine | Sakshi
Sakshi News home page

అంతర్యుద్ధం అంచున ఉక్రెయిన్

Published Thu, Apr 17 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

అంతర్యుద్ధం అంచున ఉక్రెయిన్

అంతర్యుద్ధం అంచున ఉక్రెయిన్

ఉక్రెయిన్ తాజా సంక్షోభానికి సూత్రధారి పుతిన్ కారు. కాగల కార్యం ‘గంధర్వులే’ చేస్తుండగా తన చేతులకు నెత్తురు పులుముకునే మూర్ఖుడు కాడాయన. అమెరికా నిలిపిన జాతీయోన్మాద ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రష్యన్లలో భద్రతారాహిత్యాన్ని సృష్టించింది.
 
 అవాస్తవిక అంచనాలు ఓటమికి సోపానాలు. అమెరికా మాజీ అధ్యక్షునిగా మారాక గానీ బరాక్ ఒబామాకు  ఈ విషయం వంటబట్టక పోవచ్చు. ఆయన నడిపిన ఉక్రెయిన్  ‘విప్లవం’ అంతర్యుద్ధంగా మారుతూ నెత్తురోడటం ప్రారంభించింది. గత వారం రోజులుగా తూర్పున ఉన్న డొనెత్స్క్, ఖార్కివ్, లుహాన్స్కీ రాష్ట్రాల్లో రష్యా అనుకూల ఆందోళనకారులు స్వయం ప్రతిపత్తిని కోరుతూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని ఆందోళన సాగిస్తున్నారు. ఆందోళనకారుల డిమాండ్లపై ఒక వంక చర్చలు జరుపుతూనే హఠాత్తుగా ‘విప్లవ’ ప్రభుత్వం తూర్పు రాష్ట్రాల్లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక చర్యను ప్రకటించింది. మూడు రోజులు తూర్పు ఉక్రెయిన్‌పై జెట్ విమానాల రొద, వీధుల్లో యుద్ధ ట్యాంకుల కవాతులు సాగుతున్నాయి. సోమవారం నలుగురు రష్యా అనుకూల మిలీషియా సభ్యులను చంపి, క్రమటోర్స్క్ విమానా శ్రయాన్ని ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  నాటకీయంగా బుధవారం ఉగ్రవాద వ్యతిరేక పోరు సేనల్లో తిరుగుబాటు ముసలం పుట్టింది. కనీసం క్రమటోర్స్క్, స్లోవియాన్స్క్ పట్టణాల్లో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులకు రష్యా జెండాలను కట్టి రష్యా అనుకూల వర్గానికి ఫిరాయించిన సైనికులు కవాతులు జరపడం కనిపించింది. దీంతో సైనిక చర్య పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
 
 రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఈ చిచ్చును రాజేశారని, దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని అమెరికా, అది ఉక్రెయిన్‌లో నిలిపిన అలెగ్జాండర్ తుర్చియనేవ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నాయి. పుతిన్ అంత పని చేయలేరని ఎవరూ అనరు. అంత పని చేసినా ‘విప్లవ’ ప్రభుత్వం కాదు కదా, అమెరికా దాని మిత్రులు కూడా ఏమీ చేయలేరని కూడా అందరికీ తెలుసు. అవసరమైతే అమెరికాతో యుద్ధానికి సిద్ధమేనని క్రిమియాలోనే పుతిన్ రుజువు చేశాడు. కానీ ఉక్రెయిన్ తాజా సంక్షోభానికి సూత్రధారి పుతిన్ కారు. కాగల కార్యం ‘గంధర్వులే’ చేస్తుండగా తన చేతులకు నెత్తురు పులుముకునే మూర్ఖుడు కాడాయన.  క్రిమియాకు తూర్పు ఉక్రెయిన్‌కు పోలికే లేదు. సాంప్రదాయకంగా రష్యాతో అనుబంధం కలిగిన తూర్పు, దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఈయూలో చేరడానికి వ్యతిరేకం. రష్యా నేతృత్వంలోని ఉమ్మడి కస్టమ్స్ యూనియన్‌లో చేరడం ద్వారా లబ్ధి పొందగలమని భావించే బాపతు. వారంతా ఈయూకు వ్యతిరేకంగా ఓటు చేసిన వారే. నేడు తిరుగుబాట పట్టిన ఆందోళనకారులు స్వాతంత్య్రాన్ని కోరడం లేదు. రష్యాలో భాగం కావాలనుకోవడం లేదు. స్వయం ప్రతిపత్తిని కోరుతున్నారు. ఆ డిమాండుగానీ, ఆందోళన గానీ పుట్టడానికి కారణం ‘విప్లవ’ ప్రభుత్వమే. జనాభాలో 60 శాతానికిపైగా మాట్లాడే రష్యన్ భాష గుర్తింపును తొలగించి, ఉక్రెయినీని ఏకైక అధికార భాషగా ప్రకటించారు. యానుకోవిచ్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన మైదాన్ సాయుధ నియో నాజీ ముఠాలు రష్యన్లను తుడిచి పెట్టాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నాయి. మే 27న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ ప్రధాని ట్యామషెంకో సైతం రష్యన్లను తుడిచిపెట్టేయమని పిలుపునిస్తూ జరిపిన టెలిపోన్ సంభాషణ రచ్చకెక్కింది. తుర్చియనేవ్ ఆమెకు నమ్మిన బంటు. అమెరికా నిలిపిన జాతీయోన్మాద ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రష్యన్లలో భద్రతారాహిత్యాన్ని సృష్టించింది. ఆ యాదృచ్ఛిక స్వభావమే తూర్పు ప్రాంతంలోని తిరుగుబాటు తత్వంలో కనిపిస్తోంది.
 
 ఓడిపోయే కొద్దీ ఒడ్డే జూదగాడిలా అమెరికా ఈ రష్యా అనుకూల ఆందోళనల్లో ఓటమిని గెలుపుగా మార్చుకునే అవకాశాన్ని చూసినట్టుంది. సీఐఏ అధిపతి జాన్ బర్నార్ హడావిడిగా శనివారం కీవ్‌కు వెళ్లారు  ఆయన ఎందుకు వెళ్లారో, ఎవరితో చర్చలు జరిపారో  చెప్పడం లేదు. కానీ హఠాత్తుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పుట్టుకొచ్చింది. నిజానికి ఇదంతా పుతిన్‌కు చికాకు కలిగిస్తూ ఉండి ఉండాలి. తమకు బకాయి పడ్డ 16,000 కోట్ల డాలర్ల రుణం కక్కమని ఉక్రెయిన్‌కు తాఖీదు ఇచ్చారు. సహజ వాయువుపై సబ్సిడీని ఉపసంహరించారు. దీంతో ఉక్కిరిబిక్కిరై  అదే కాళ్ల బేరానికి వస్తుందని ఎదురు చూస్తున్నారు. జార్జియాలో లాగా స్వయం నిర్ణయాధికార పోరాటాలు పుట్టుకొచ్చేలా చేయడానికి దీర్ఘకాలిక పథకాలు సిద్ధం చేసుకున్నారు. సీఐఏ బరాక్ ఒబామాతో మరో తీవ్రమైన తప్పు చేయించింది. దానికి మూల్యం ఉక్రెయిన్ చెల్లించుకోవాల్సి ఉంది.
 
 పి. గౌతమ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement