రాజకీయ సునామీగా ఎదిగిన అ'సామాన్యుడు'
అతనో సామాన్యుడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడై కొంతకాలం ఇంజనీర్ గా, మరికొంత కాలం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశాడు. మంచి ఉద్యోగమే అయినా అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. తాను ఎంచుకున్న మార్గం తనకు సరిపోదన్న వెలితి. ఏమేతైనేం ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ప్రజా సేవే మార్గంగా ఎంచుకున్నాడు. మదర్ థెరిసాను స్ఫూర్తిగా తీసుకుని కొంతకాలం సేవ చేశాడు. ఆ తర్వాత అవినీతిపై యుద్ధం ప్రకటించి ఉద్యమ బాట పట్టాడు. చివరకు రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయ నేపథ్యం లేదు. కోటీశ్వరుడు కాదు. పెద్దగా ఛరిస్మా కూడా లేదు. ఆ మాటకొస్తే రెండేళ్ల క్రితం వరకు అతని గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇదంతా గతం. అయితేనేం నేడు అతనో చరిత్ర. ఆ సామాన్యుడే సునామీగా మారి సమకాలీన భారత రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాడు. దేశ ప్రజల్ని తనవైపు ఆకర్షించేలా చేశాడు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను ఢీకొట్టి ఢిల్లీ కోటపై జెండా నాటాడు. అతనే 45 ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు. ఢిల్లీకి కాబో్యే ముఖ్యమంత్రి.
అవినీతి వ్యతిరేకంగా గళమెత్తిన అన్నా హజారే పౌరసమాజం బృందంలో సభ్యుడిగా కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు. అన్నా హజారే అనుచరుడిగా ప్రాచుర్యం పొందారు. రెండేళ్ల క్రితం దేశ ప్రజల్ని కదిలించిన హజారే నిరాహార దీక్షలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. అనంతరం అన్నా ఉద్యమ బాటలోనే పయనించగా, కేజ్రీవాల్ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. గురుశిష్యుల మధ్య ఈ ఒక్క విషయంలోనే భేదాభిప్రాయం. గతేడాది కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినపుడు పెద్దగా అంచనాలు లేవు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారం కోసం పావులు కదుపుతుండగా, నరేంద్ర మోడీ ప్రభతో పుంజుకుంటున్న బీజేపీ అధికారమే లక్ష్యంగా పోరాడుతోంది. ఇలాంటి తరుణంలో రెండు జాతీయ పార్టీలను ఢీకొని కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని అప్పట్లో ఎవరూ ఊహించిఉండరు.
ఎన్నికలంటేనే కొట్లు కుమ్మరించాల్సిన నేటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ వినూత్న పంథాను ఎంచుకున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి, నిధుల సేకరణ వరకు కొత్త ఒరవడికి నాంది పలికారు. పార్టీ గుర్తు (చీపురు) కూడా వినూత్నమే. ప్రత్యర్థి పార్టీలు తనను రాజకీయ నాయకుడిగా గుర్తించకున్నా, తనను అవహేళన చేసేలా విమర్శించినా స్పందించలేదు. పార్టీలో సామాన్యులకు, యువతకు పెద్ద పీటవేశారు. ఆర్బాటాలకు తావివ్వకుండా ఓ సామాన్యుడిగా ఆమ్ ఆద్మీని జనంలోకి తీసుకెళ్లారు. సామాన్యుల పార్టీగా పిలుచుకునే ఆమ్ ఆద్మీని వారి చెంతకు తీసుకెళ్లడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. దీని ఫలితమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సంపాదించి పెట్టింది. ఆమ్ ఆద్మీ 28 ఎమ్మెల్యేలను గెలిపించుకుని 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసింది. కేజ్రీవాల్ ఏకంగా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ (8 మంది ఎమ్మెల్యేలు)తో మూడో స్థానానికి పడిపోగా, బీజేపీ (31) అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ సాధించలేకపోయింది. ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్ మద్దతుతో ఆమ్ ఆద్మీ ఢిల్లీని ఏలబోతోంది. నాటి సామాన్యుడు ఢిల్లీ పీఠం అధిరోహించబోతున్నారు. సమకాలీన రాజకీయాల్లో ఈ ఘట్టం స్ఫూర్తిదాయకం. అవినీతి పాలకులతో విసిగిన ప్రజలకు ఓ ఆశాకిరణం. నిజాయితీ రాజకీయాలకు ఓ భరోసా.