
పెరిగే పేదరికం సంపదకే సవాల్
సమకాలీనం
గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగం కుదేలవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవ సాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు.
ప్రపంచంలో ఏడో సంపన్న దేశవాసిని నేను. భూమి మీదున్న దాదాపు రెండువందల దేశాల్లో ఇంత గొప్ప స్థానంలో ఉండటం గర్వించదగ్గ విష యమే! ఇది నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే! నాణెపు మరోవైపు చూడ టానికి సాహసం కావాలి. కొంచెం ధైర్యమూ కూడగట్టుకోవాలి. ఇంతటి వైరుధ్యం ప్రపంచంలో మరే దేశానికీ ఉండదేమో! ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో సరదాకి చెప్పుకున్న వ్యంగ్యోక్తి నేటికీ నూటికి నూరుపాళ్లు నిజం. వైరుధ్యాన్ని నిరూపించే ప్రపంచ నివేదికల్లోని కఠిన వాస్తవాల్ని మన మంతా జీర్ణించుకోవాల్సిందే! అదేంటంటే, ప్రపంచంలో ఏడో సంపన్న దేశ మైనా అత్యధిక నిరుపేదలున్న దేశం కూడా మనదే! వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలో సంపన్నులు, ముప్పయ్ కోట్లకు పైబడి నిరుపేదలు కలగలిసి సహ జీవనం చేస్తున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ మనది. అపార సహజవనరులు, గొప్ప సంస్కృతీ వారసత్వ సంపదల వల్ల భారతదేశానికున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా అప్పట్లో మేధావులు దీన్నొక గొప్ప దేశంగా అభివర్ణించేవారు. ఆ క్రమంలోనే ‘నిరుపేదలు నివసించే సంపన్నదేశమ’ని సరదా వ్యాఖ్యా వినిపించేది. వారి సరదా సంగతేమో గానీ, నేటికీ మన పేదరికం సమస్య గట్టె క్కలేదు. మహా మేధావులు రూపుదిద్దిన రాజ్యాంగం నీడలో పలు పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో నినాదాలు, అందర్నీ కలుపుకుపోయే (ఇంక్లు సివ్) అభివృద్ధి నమూనాలు.... వెరసి, మెడలో బోర్డు కట్టుకున్న ‘సంక్షేమ రాజ్యం’ ఏడు దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్యానికింకా ఆమడ దూరంలోనే ఉంది. పేదరికం పెనుశాపమై నాలుగోవంతు జనాభాను నలిపేస్తోంది. మరో వైపు సంపద మాత్రం పోగవుతూనే ఉంది. అది అవకాశాల్ని అందిపుచ్చు కున్న, అధికారానికి అతి సమీపంగా ఉన్న కొద్దిమంది వద్ద మాత్రమే జమవు తోంది. అందుకే, మనకిప్పుడు ఏడో స్థానం దక్కింది. ఒక దశ చేరాక సంపద సృష్టి కన్నా సంపద పంపిణీ ముఖ్యమై కూర్చుంటుందన్న కమ్యూనిస్టు మేధావి కారల్ మార్క్స్ మాటలు వర్తించేది ఇక్కడే! అది సవ్యంగా జరగక పోవడం వల్లే ఈ అసాధారణ అసమానతలు. అనారోగ్యకరమైన ఆర్థిక అంత రాలు. భారమైన బతుకులీడ్చే బహుజనుల్లో నిత్య అశాంతికి కారణాలు.
నిత్యం రగిలే కుంపటే!
‘న్యూ వల్డ్ వెల్’్త సంస్థ ప్రపంచంలో పది సంపన్న దేశాల జాబితాని మొన్న మంగళవారం విడుదల చేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటే చైనా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు వరుసగా దాని వెనుకున్నాయి. 5,600 బిలి యన్ అమెరికా డాలర్ల (అంటే 372.5 లక్షల కోట్ల రూపాయల) సంపదతో భారత్ ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కెనెడా, ఆస్ట్రేలియా, ఇటలీ ఉన్నాయి. ఒక దేశంలోని అందరి వ్యక్తిగత ఆస్తుల మొత్తం విలువను పరి గణనలోకి తీసుకొని ఈ సంపద లెక్కిస్తారు. అందులో ప్రతి వ్యక్తి స్థిర–చరాస్తి నగదు, ఈక్విటీ, ఇతర వ్యాపార ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకుం టారు. అప్పులు తదితర బాకీల భారాన్ని మినహాయించిన మీదటే సంపద లెక్కగడతారు. ప్రభుత్వ నిధుల లెక్కల్ని ఈ గణింపులోకి తీసుకోరు. భారత్ పెద్ద జనాభా వల్ల ఇది సాధ్యమైందని నివేదికలో పేర్కొన్నారు. అతి తక్కువ, 2.2 కోట్ల జనాభాతో ఆస్ట్రేలియా తొమ్మిదో స్థానం గడించడం గొప్పనీ పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇటలీలతో పాటు గత పదిహేనేళ్లలో సంపద పరంగా భారతదేశం బాగా బలపడిందనీ నివేదిక పేర్కొంది. అయితే, ఈ సంపద వృద్ధి మన దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలపై ఓ పెద్ద వెక్కిరింపు అని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే, స్థూల వార్షికా దాయం లెక్కల్లో గణిస్తే సగటు భారతీయుడు నిరుపేద. అలా చూసినపుడు ప్రపంచ దేశాల్లో మనం 120 స్థానంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. మొదటి పది దేశాలకు ఇదెంతో దూరం. దేశంలో నాలుగో వంతు జనాభా, అంటే 30 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన రోజూ సగటున తొంబై రూపాయలు (1.25 అమెరికా డాలర్) కూడా గడించలేని పేదరికంలో అలమటిస్తున్నారు. ఈ రాబడితో ఇంటిల్లిపాదికీ పూట గడవడమే కష్టం. 80 కోట్ల మంది దినసరి ఆదాయం 150 రూపాయల (2 యుఎస్డీ) లోపేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సంపద పంపిణీ అసమగ్రంగా ఉంటోంది. ఒక వైపు పేదరికం పెరుగుతుంటే మరో వైపు సుసంపన్నులు పెరుగుతున్నారు. మధ్యేరకం సంపన్నుల్లోనూ వృద్ధి లేదు. ముఖేష్ అంబానీ, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమ్‌జీ, శివ్ నాడార్, సైరస్ పుణావాలా, లక్ష్మిమిత్తల్, ఉదయ్ కోటక్, కుమారమంగళం బిర్లా, సునీల్ మిత్తల్, దేశ్‌బంధు గుప్తాలు అత్యంత సంపన్నులుగా తొలి పది స్థానాల్లో ఉన్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు వంద మంది బిలియనీర్లున్నారు. కానీ, మిలియనీర్లను పెద్దగా పెరగనీయడం లేదన్న విమర్శ ఉంది. దేశంలో వంద కోట్ల (బిలియనీర్) ఆస్తిపరుడొకరికి సగటున ఎంత మంది మూడేసి కోట్ల (30 మిలియన్ల) ఆస్తిపరులున్నారన్న నిష్పత్తి (యుహెచ్‌ఎన్‌ఐస్) లెక్కలు చూస్తే భారత్‌లో అసమానతలు ఇట్టే తెలుస్తాయి. అలా ఒక బిలియనీర్‌కు 29 మంది మాత్రమే మూడు కోట్లకు మించిన సంపదగల వారున్నట్టు సగటు నిష్పత్తి గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిష్పత్తి జపాన్ (1:609), బ్రెజిల్ (1:129), దక్షిణాఫ్రికా (1:119)లలో అధికంగా ఉంది. ప్రపంచ సగటు కూడా 1:100 నిష్పత్తిగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మన దేశంలోని మొత్తం జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే 76.3 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. మరీ ముఖ్యంగా 1 శాతం జనాభా చేతిలోనే 53 శాతం సంపద పోగై ఉండటం ప్రపంచాన్నే విస్మయపరుస్తోంది. అంటే, 99 శాతం జనాభా చేతిలో సగం సంపద కూడా లేదు. ఇంతటి ఆర్థిక అసమానతలే సామాజిక అశాంతికి కారణం.
అంతరాలే భవిష్యత్ సవాల్
అగ్రగామి దేశాల సంపద గర్వంగా ఉన్నా ఆరు అంశాల్లో పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగానే బాగోలేవని న్యూవల్డ్‌వెల్త్ సంస్థ పేర్కొంది. భరోసాలేని మహి ళల రక్షణ, పెరుగుతున్న సామాజిక భద్రత (పెన్షన్) భారం, ప్రజారోగ్య కల్పన వ్యయం, మందగించిన స్థూలాదాయ వృద్ధి, మత–జాతి పరమైన హింస పెచ్చరిల్లడం, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు కలతకు గురిచేసేవేనని పేర్కొంది. ప్రపంచ పేదరికమంతా అయిదే దేశాల్లో కేంద్రీకృతమైందని 2014 ప్రపంచబ్యాంకు ‘పేదల స్థితిగతుల నివేదిక’ వెల్లడించింది. అవి భారత్, చైనా, నైజీరియా, బంగ్లాదేశ్, కాంగో దేశాలుగా పేర్కొంది. మన దేశంలో పరిస్థితులు మెరుగుపడక పోగా మరింత దయనీయంగా మారుతున్నాయి. పేదరిక నిర్మూలనకు చేపట్టే చర్యలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వటం లేదు. ‘‘ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల దేశవాసులందరికీ మేలు జరుగు తుందన్న కొని ప్రతిపాదనల్ని నేను విశ్వసించాను, కానీ, అవి కొన్ని స్థాయి ల్లోని వారికి మాత్రమే ప్రయోజనం కలిగించాయని, అత్యధికులకు ఆశించిన స్థాయి మేళ్లు కలిగించలేదని వాస్తవంలో గ్రహించాను’’ అని స్వయానా దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసం ఇస్తూ చెమర్చిన కళ్లతో పశ్చాత్తాపపడ్డారు. ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల కొన్ని పెట్టుబడులు వచ్చి సంపద వృద్ధి జరిగినా పంపిణీ అస్తవ్యస్తమైంది. అది మరింత అసమానతలకు దారితీస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఆ అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, ముఖ్యంగా అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదే లవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో వరుస ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవసాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు.
సగటు బతుకుల గతి మారదా?
ఏడో సంపన్న దేశంగా ఉన్న మనం మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో 188 దేశాల్లో 130వ స్థానంలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్య క్రమం (యుఎన్డీపీ)లో భాగంగా గత డిసెంబరులో ఇచ్చిన ప్రపంచ మానవా భివృద్ది నివేదికే ఈ విషయం వెల్లడించింది. మనిషి సగటు జీవితకాలం, విద్య–వైద్య సదుపాయాలు, తెలివితేటలు–జీవన ప్రమాణాలు, మాతా–శిశు ఆరోగ్యస్థాయి, స్థూల జాతీయాదాయం, పిల్లలు బడికెళ్లటం–మానటం వంటి అంశాల ఆధారంగా ఈ స్థాయిని నిర్ణయిస్తారు. హెచ్‌డీఐ స్థాయి మెరుగ వాలంటే విద్య, వైద్యం, కనీస పౌర సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున పెట్టుబడులుండాలి. పేదలు, అల్పాదాయ వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేశంలో నాలుగోవంతు జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉండగా వారిలోనూ అత్యంత దయనీయ స్థితిలో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న వారిదీ పెద్ద సంఖ్యే! వారికంటూ ఆస్తులు లేకపోవడం, పెట్టుబడి లేకపోవడం, ఉపాధి అవకాశాలే కనిపించకపోవడం వంటివి వారి జీవన ప్రమాణాల్ని శాసిస్తున్నట్టు, అణచి ఉంచుతున్నట్టు యుఎన్డీపీ నివేదిక తెలిపింది. పేదల్లో 45 శాతం మంది నిరక్షరాస్యులని, మరో 25 శాతం మంది ప్రాథమిక స్థాయిలోనే చదువు నిలిపివేసిన వారని ఓ తాజా అధ్యయన నివేదిక చెబుతోంది. 6 శాతం మందికే తాగునీటి సదు పాయం ఉంది. పౌష్టికాహార లోపం, పరిసరాల అపరిశుభ్రత వారి ఆయు ష్షును తగ్గిస్తోంది. జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళుతున్నా... జీవితాలు పెద్దగా మెరుగవడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామంలో నెలకు సగటున మూడు వేల రూపా యలు ఖర్చయ్యే కుటుంబం వలస వెళ్లిన హైదరాబాద్ వంటి ప్రాంతంలో దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే, వలసల తర్వాత రాబడి మూడింతలు పెరిగినా, ఇదివరకటి తరహాలోనే బతు కుతారు తప్ప జీవనప్రమాణాలేమీ మెరుగుపడవు. ఇక పట్టణ ప్రాంతాలది మరో వేదన. సంపద, ఉపాధి అవకాశాలు అక్కడ కొంచెం మెరుగ్గా ఉన్నా... ఆర్థిక అంతరాలు మరింత దారుణం. వలసల పుణ్యమా అని అతి వేగంగా విస్తరిస్తున్న 100 ప్రపంచ నగరాల్లో 25 మన దేశంలోనే ఉన్నాయి. దేశంలోని దాదాపు పావు శాతం జనాభా నివసించే మన 19 నగరాలు దాదాపు మురికి వాడలేనని ప్రపంచస్థాయి నివేదిక చెబుతోంది. 35 ఏళ్ల కింద ప్రముఖ దర్శకుడు బాలచందర్ తీసిన ఆకలిరాజ్యంలో ఆత్రేయ ఒక పాట రాశారు. ‘...మన తల్లి అన్నపూర్ణ... మన అన్న దానకర్ణ... మన భూమి వేదభూమిరా తమ్ముడూ! మన కీర్తి మంచుకొండరా...!’ అని. సంపదొకవైపు పేదరికమొక వైపు పోగవుతున్న పరిస్థితికి అద్దం పట్టే మరో పంక్తి కూడా ఉంది. ‘... బంగారు పంట మనది, మున్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుదామురా.... ఇంట్లో ఈగల్ని తోలుదామురా....’ అని. నేటి పేదల పరిస్థితి అలాగే ఉంది.
ఈమెయిల్: dileepreddy@sakshi.com
-దిలీప్ రెడ్డి