'మార్కెట్' లో కొనుక్కోవాలా?
తాము చేసిన చట్టాలను ప్రజలంతా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది.
విశ్లేషణ
1860లో వచ్చిన భారతీయ శిక్షాస్మృతిని చాలాసార్ల్లు సవరిం చారు. నిర్భయ దుర్మా ర్గం జరిగిన తరువాత ఐపీసీలో ఆత్మరక్షణ నియమాలను సవరిస్తూ తాజా చట్టం చేశారు. యాసిడ్ దాడులు, రేప్ ప్రయత్నాలను ప్రతిఘటించడానికి హత్య చేసినా ఆత్మరక్షణ మినహాయింపు వర్తిస్తుందని ఈ కొత్త సవరణ వివరిస్తున్నది. కొన్ని కొత్త నేరాలను కూడా ఐపీసీలో చేర్చారు. లైంగిక దాడుల కేసులను రిజిస్టర్ చేయకపోవడం నేరం అని శిక్ష నిర్దేశించారు. బాధితులు ఈ చట్టం ప్రకారం ఆత్మ రక్షణ హక్కు వినియోగించుకోవాలంటే, ఫిర్యాదు చేయాలంటే ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. కాని అసలు చట్టమే అందుబా టులో లేకపోతే పౌరులకు ఏవిధంగా తెలుస్త్తుంది, ఏవిధంగా ఆత్మరక్షణ చేసుకుంటారు?
సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా వందసార్లకు పైగా సవరణలకు గురైంది. అధికారికంగా సమ గ్రమైన, సవరించిన చట్టం కాపీ అందుబాటులో లేదు. ఇంతెందుకు భారత రాజ్యాంగం పరిస్థితి కూడా అంతే. వందసార్లు సవరణ జరిగిన ఈ కీలక జాతీయ శాసనం ప్రతి తుదిరూపం అందు బాటులో లేదు. డబ్బు పెట్టి కొనుక్కుంటే తప్ప.
ఫలానా సెక్షన్‌ను సవరించిన చట్టం ఉంటుంది కాని. సవరించిన సెక్షన్ ప్రజలకు అందు బాటులో ఉండదు. ప్రైవేటు ప్రచురణకర్తలు పుస్తకాల మీద వ్యాపారం చేసేవాళ్లు సవరణలతో కూడిన అసలు చట్టాలను ప్రచురించి వందల రూపాయలకు అమ్ముతున్నారు. వ్యాఖ్యానాలు లేని కేవలం చట్ట పాఠం ఇదివరకు పది పాతిక రూపాయలకు అమ్మితే ఈ రోజు వంద రూపా యలు మించి అమ్ముతున్నారు. ప్రజలు పాటించి విధేయంగా ఉండవలసిన చట్టం కొనుక్కుంటే తప్ప దొరకదు. చట్టాలలో ఎవరికీ కాపీరైట్ ఉం డదు. చట్టాలు ఉచితంగా సులువుగా తెలుసుకునే అవకాశం ఉండాలి. పౌరులకు తమ ప్రభుత్వం చేసిన చట్టాలేమిటో తెలుసుకునే హక్కు ఉంది. చట్టాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఫలానా చట్టం ఉందని నాకు తెలియదు అని నిందితుడు చెప్పుకునే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. కనుక వారికి చట్టం గురించి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు క్రైస్తవ వివాహ చట్టం గురించి అధ్యయనం చేయవలసివచ్చింది. ఇది బ్రిటిష్ కాలపు చట్టం. ఎక్కడా దొరకలేదు. ప్రభుత్వం వారి దగ్గర కూడా లేదు. ఇండియా కోడ్ వెబ్‌సైట్‌లో ఉంది కాని అది చదవడానికి అనుకూలంగా లేదు. వాక్యాలు కలుపుకోవాలన్నా కొన్ని రోజులు పడుతుంది. ప్రైవేట్ పబ్లిషర్ల దగ్గర ఈ ప్రచురణ లేదు. క్రైస్తవ మహిళల హక్కులకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలియకుండా ఆ హక్కుల రక్షణ సాధ్య మవుతుందా? కనుక ఆయన కాపీ కావాలని కేంద్ర న్యాయ శాఖను ఆర్టీఐ కింద అభ్యర్థించారు. కాని న్యాయమంత్రిత్వ శాఖ పీఐఓ ఏం చేయ గలరు? ఆ చట్టాన్ని వెతికి పట్టుకోవడం ఎడిట్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని. అదే జవాబు ఇచ్చారాయన.
కాని పీఐఓ పబ్లిక్ అథారిటీకి ప్రతినిధి, వ్యక్తిగతంగా ఆయన చేతిలో పరిష్కారం లేనందువల్ల సమాచారం ఇచ్చే బాధ్యత నుంచి మినహాయింపు లభించదు. చట్టం ప్రతిని కచ్చితంగా పబ్లిక్ అథారిటీ ప్రజ లకు ఇవ్వవలసిందే. దీనికి ఏవిధమైన మినహా యింపూ సమాచార హక్కు చట్టంలో లేదు. దీని వల్ల ప్రైవేటు ప్రచురణ వ్యాపారులను ప్రోత్సహిం చడమేకాకుండా చట్టాలు సామాన్యులకు అందు బాటులోకి రావు. తాముచేసిన చట్టాలను ప్రజలం తా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది.
అన్ని చట్టాలను అప్‌డేట్ చేసి అందుబా టులో ఉంచే కార్యక్రమాన్ని తమ మంత్రిత్వశాఖ చేపట్టిందని సీపీఐఓ వివరించారు. ఇందుకు గాను ఇద్దరు ఇంగ్లిష్, మరో ఇద్దరు హిందీ సంప్రదింపు దారులను నియమించారు. అధికారులు కూడా చట్టాలను చదువుతున్నారు. నవీకరిస్త్తున్నారు. సవరణలను పొందుపరుస్తున్నారు. ఆంగ్లంలో చట్టాల నవీకరణ త్వరగా పూర్తవుతుంది. హిందీ నవీకరణ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం 2014 సంవత్సరం చట్టాల నవీకరణ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగానే వెనుకటి సంవ త్సరాల చట్టాలకు సవరించిన తాజాప్రతులను తయారు చేయడం కొనసాగుతున్నదని పీఐఓ వివరించారు.
ఈ చట్టాల సమాచారాన్ని ఇవ్వడం సెక్షన్ 4(1)(బి) కింద ప్రభుత్వ బాధ్యత. అడిగినా ఇవ్వకపోవడం చట్టం ఉల్లంఘన అవుతుంది. కనీసం అడిగిన ఈ చట్టాన్ని సవరించడానికి నెల రోజుల సమయం ఈ మంత్రిత్వ శాఖకు సరిపోక పోవడం సమంజసం కాదు. నెల కాకపోయినా కనీసం రెండు నెల్లకో ఏడాదిలోగానో ఇస్తే బాగుం డేది. కాని నాలుగేళ్లయినా ఇప్పటికీ ఇవ్వలేదు. అడిగిన విద్యార్థి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇం డియా యూనివర్సిటీ నుంచి బంగారు పతకా లతో సహా డిగ్రీ తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు అతనికి అవసరం లేదు. కాని లా విద్యార్థులంద రికీ అవసరం. మంత్రిత్వ శాఖ ఆ యూనివర్సిటీకి పది వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదే శించక తప్పలేదు.
(CIC_SS_C_2013_900008-SA లో నా తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్)
professorsridhar@gmail.com