
సాధికారత వల్లే బంగారు భవిత
సమాజాన్ని చీల్చే శక్తులు పదే పదే ఓడిపోతున్నాయి. అయినా ఆ శక్తుల కుట్రలు ఆగలేదు. చిన్న పగులునైనా పెను అగాధంగా మార్చడానికి అలాంటి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
స్వీయ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే దళారులకు, కపట రాజకీయవేత్తలకు కాలం చెల్లింది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, నిండైన విశ్వాసంతో ముందడుగేయడానికి యువత కదులుతున్నది. వారికి తిరుగులేని సాధికారత కల్పిస్తే ఈ దేశానికి బంగారు భవితవ్యం సాధ్యమవుతుంది.
అనుభవమే మన గురువైనప్పుడు జ్ఞానం బహు రూపాల్లో లభిస్తుంది. చాన్నాళ్లక్రితం ఓ పాలకుడిని కలుసుకున్న ప్రతినిధి బృందంలో నేనూ ఒక సభ్యుణ్ణి. మైనారిటీల్లో విద్య విస్తృతి, నాణ్యత, గాఢత ఏమేరకు ఉన్నాయో తెలుసుకోవడమే మా ఏక సూత్ర ఎజెండా. ముఖ్యంగా ముస్లిం బాలికల కోసం ఇంకేమి చేయవచ్చునో తెలుసుకోవడం మా ఉద్దేశం. ఓ సత్కార్యం కోసం ఉత్తములందరూ కలిశారు. ప్రతినిధి బృం దంలో సంపాదకులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అప్పుడప్పుడు సామాజిక సేవలందించేవారూ ఉన్నారు. పాలకుడి కార్యాలయానికి చేర్చి ఉన్న ఓ గదిలో అందరం కూర్చున్నాం. అందరి మొహాలూ పరమానందంగా వెలిగిపోతున్నాయి. తప్పనిసరి నిరీక్షణ తర్వాత గంభీర వదనాలతో ఒకరి వెనక ఒకరం ఆయన గదిలోకి ప్రవేశించాం. ఆ గౌరవనీయ నేత సమక్షంలో అందరూ అర్ధంలేని నవ్వులు చిందించడం పూర్తయ్యాక ఒకాయన గొంతు సవరించుకుని ఏదో చెప్పారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆయన దాన్ని సావధానంగా చదివారు. మా సమష్టి జ్ఞానం ఆయన సైద్ధాంతిక పరిధిని విస్తృతపరిచిన జాడ కనబడింది.
అంగీకార సూచకంగా ఆయన తలపంకించారు. అంతే...ఒక్కసారిగా గందరగోళం. ప్రతినిధి బృందంలోని వారంతా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం మొదలెట్టారు. నిర్ఘాంతపోవడం నావంతైంది. అందరూ సిగ్గువిడిచి ఎవరికి కావలసినవి వారు అడగటం ప్రారంభించారు. ఓ చిన్న పత్రికకు సంపాదకుడిగా ఉన్నాయనకు మరిన్ని వాణిజ్య ప్రకటనలు కావాలి. ఖాళీ అయిన ఒక సంస్థకు అధిపతి కావడం మరొకాయన కోరిక. అంత వ్యామోహంతో, అంత శ్రద్ధతో తమ తమ దురాశలను వారు వ్యక్తంచేసిన తీరు వ్యాపార శాస్త్రంలో ఒక అధ్యాయం అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో కొందరి కోరికలు నెరవేరాయని అనంతరకాలంలో నాకు తెలిసింది. ఇక మైనారిటీల విద్య సంగతంటరా...అందులో పెద్ద మార్పేం రాలేదు. అది మెరుగుపడకపోయినా...మరింత క్షీణించనందుకు మనం సంతృప్తిపడి ఊరుకోవాలి.
ఈ నేపథ్యంలో కొందరు ముస్లిం మత పెద్దల బృందం ప్రధాని నరేంద్ర మోదీని ఓ వారం క్రితం కలిసి సంప్రదాయానికి భిన్నమైన సమస్యల గురించి ప్రస్తావించారని తెలుసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. డబ్బు దన్నుతో కొన్నేళ్లనుంచి పుంజుకుంటూ, ఇటీవలి సంవత్సరాల్లో చురుగ్గా కదులుతున్న వహాబీ ఉద్యమం మన ముస్లింలపై చూపుతున్న ప్రభావం గురించి, వారికి చెందిన సంస్థల నియంత్రణ గురించి మాట్లాడటానికి ఆ బృందం సభ్యులు వెళ్లారు. అయితే, మన దేశంలో మత సామరస్యానికి అసాధారణమైన శక్తి ఉంది.
ఆ శక్తి మత బోధనల్లో ఉంది. మన స్వాతంత్య్రోద్యమ మూలాల్లో ఈ సమ్మిళిత సందేశం ఉంది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ వంటి మత, సామాజిక దార్శనికుల ప్రసంగాల్లో ఉంది. పటిష్టమైన, సమైక్య భారత నిర్మాణమే ఇతరేతర పాక్షిక ప్రయోజనాలకన్నా వారికి అత్యంత ముఖ్యమైనది. బ్రిటిష్ వారు మూర్ఖులేమీ కాదు గనుక సమైక్య భారత శక్తి ముందు తమ పాలన నిలబడటం కష్టమని గ్రహించారు. అందువల్లే అన్ని మతాల్లోనూ సామరస్యాన్నికాక చీలికలను ప్రోత్సహించే సంస్థలకు దన్నుగా నిలిచారు. పాకిస్థాన్ భావన ఉనికిలోనికి రావడానికి చాలా ముందే చీలిక రాజకీయాలను పెంచి పోషించారు. ఇందుకు 1905 నాటి బెంగాల్ విభజన ఒక్కటే కాదు...చాలా ఉదాహరణలున్నాయి. అయితే ఈ దేశ పౌరులు ఇతర మతాలవారితో సహజీవనానికే మొగ్గుచూపారు. చీలికవాదులు మాత్రం తమ ఓటమిని అంగీకరించలేదు. జనబాహు ళ్యంలో, రాజకీయ చట్రంలో మాటువేశారు. చిన్న పగులు కనబడినా దాన్ని అగాధంగా మార్చడానికి వేచిచూస్తున్నారు. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవమతాలవారందరికీ ఇది మౌలికమైన సవాలు. విధానపరమైన అంశాల్లో వినియోగించే ‘సామాజిక-ఆర్థిక’ అనే పదబంధం ఉపఖండంలో అదనపు అర్థాన్ని సంతరించుకుంది. వివిధ వర్గాల ప్రజలు విద్యకు దూరంకావడానికి... అసమానత, అగౌరవం, భయానక పేదరికం కోరల్లో వారు చిక్కుకోవడానికి సంస్కృతి, విశ్వాసం కూడా దోహదపడటమే ఇందుకు కారణం.
మూలాల్లో సమస్య ఉన్నప్పుడు పరిష్కారాలూ అక్కడే లబిస్తాయి. మైనారిటీల సమస్యలను దళారులకు విడిచిపెట్టడం స్వాతంత్య్రా నంతరం ఈ ఆరున్నర దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. ఫలితంగా ఆ వర్గాలవారుగాక దళారులే ఎక్కువగా బాగుపడ్డారు. రాజకీయ రంగం నిండా అలాంటివారే కనిపిస్తారు. ఈ కపట రాజకీయ నేతల ఆసక్తి అంతా స్వీయ సంక్షేమమే గనుక...వీరంతా వేర్పాటువాదాన్ని ప్రవచించే వారితోనే చేతులు కలుపుతారు. ఈ పాత రాజకీయాలకు కొత్తగా ఒక బద్ధ శత్రువు బయల్దేరింది. ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలోని యువత తమ పెద్దలకు లభించని లేదా వారికి నిగూఢంగా మిగిలిపోయిన ఒక అంశాన్ని పోల్చుకోగలిగారు. పరస్పరం పంచుకునే, సమానావకాశాలు లభించే చలనశీలమైన భారత్‌లో ఆర్థిక అభివృద్ధికి ఆస్కారమున్నదని గుర్తించారు. మన యువతకు అవకాశాన్ని, భరోసాను, విద్యను కల్పిస్తే... తిరుగులేని సాధికారతను కల్పిస్తే...ఉపాధి అవకాశాలు దండిగా లభించే, విస్తరించే ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది. దశాబ్దాల క్రితం వాగ్దానం చేసినా మనకు అందకుండా పోతున్న భవితవ్యం మనదవుతుంది.
ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు