విశ్లేషణ: జగన్‌మోహన్‌రెడ్డిని అసలెందుకు నిర్బంధించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్ ‘నల్లి’ లాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్ అధిష్టానం జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమూ, సీబీఐలే!
‘‘జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీ ల్లో పెట్టుబడులు పెట్టిన ఎని మిది కంపెనీల్లోనూ లాభ లబ్ధి (క్విడ్ ప్రోకో) ప్రాతిపదికపై ఎటువంటి లావాదేవీలూ జరగలేదు. ‘క్విడ్ ప్రోకో’ ఉన్నట్టు దర్యాప్తులో తేలలేదు. మిగిలిన విషయాలు (ఆదాయపు పన్ను చెల్లింపులు వగైరా అంశాలు) సంబంధిత శాఖలకు నివేదించాం’’ - ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ముందు సీబీఐ దాఖలు చేసిన మెమొరాండం (23.9.2013)
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లాభ లబ్ధి ద్వారా ‘అక్రమ ఆస్తులను’ ఆర్జించారంటూ సీబీఐ సాగించిన దర్వాప్తు ప్రహసనం చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లయింది. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేయాలనే లక్ష్యంతో సీబీఐని ఇష్టానుసారంగా వాడుకుంది. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతో, రాజ్యాధికారం కోసం తీరని తపనతో ఉన్న ‘దేశం’ అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలపగా సీబీఐ ఎక్కడ లేని అభియోగాలతో జగన్‌పై కొండవీటి చాంతాండంత కేసును తయారు చేసింది.
ఇది గ్రహించడానికి పాలక పక్షానికి, ‘గొర్రెదాటు’ పద్ధతిలో ఉన్న కొన్ని ప్రతిపక్షాలకు 16 మాసాలు చాలవు! వెనకటికి మాయ లేడిని ‘బంగారు లేడి’ అనుకుని సీత కోసం శ్రీరాముడు దాని వెంట పరుగులు పెట్టినట్టుగా కాంగ్రెస్‌ను చాలా ‘నిజాయితీ’ గల పార్టీ అనుకుని, దాని ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సీబీఐ నిష్పాక్షికమైనదని భావించిన వివిధ పార్టీలు జగన్‌పై విరుచుకుపడుతూ వచ్చాయి! కాని, అవి రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అనిశ్చితిని చవిచూడవలసి వచ్చింది. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రలో దేశ ప్రధాన ధాన్యాగారాలలో ఒకటైన ‘అన్నపూర్ణ’ను చెరబట్ట యత్నించి కాంగ్రెస్ బోర్లాపడే స్థితికి చేరింది. రాష్ట్రంలో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జగన్‌మోహన్‌రెడ్డిని అసలెందుకు నిర్బంధించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్ ‘నల్లి’ లాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్ అధిష్టానం ‘పిలక తిరుగుడు పువ్వు’ లాగా మెడ చుట్టూ వేళ్లు తిప్పి ‘ముక్కు’ చూపించినట్టుగా జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమూ, సీబీఐలే!
తప్పనిసరై కొన్ని నిజాలు...
ఇటీవల ‘2-జీ’ స్కాము సందర్భంగానూ, కోల్‌గేట్ కుంభకోణంలోనూ పాలకుల వేలిముద్రగా మారిన సీబీఐ విచారణాధికారి ఒకరు ఇరుకునపడ్డారు. ఆ దరిమిలా సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో సీబీఐ డెరైక్టర్ తామెలాంటి ఒత్తిళ్లకు లోనుకావలసి వస్తోందో కోర్టుకు సంజాయిషీ చెప్పుకోవలసివచ్చింది. అటు పిమ్మట ‘సుప్రీం’ ఇచ్చిన గుండె ధైర్యంతో, సీబీఐ తన స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకొనే దిశగా అడుగులు వేస్తోంది. గుజరాత్‌లో మోడీ ప్రభుత్వ ఆదేశాలపైన ఇష్రాత్ జహాన్‌ను దొంగ ఎన్‌కౌంటర్‌లో హతమార్చడంలో కేంద్ర గూఢచారి సంస్థ (ఐబీ) అధికారికి పాత్ర ఉందన్న ఆరోపణపైన సీబీఐ విచారణకు దిగింది. ఆ విషయమై ఐబీ-సీబీఐల మధ్య సాగిన పరస్పర ఆరోపణల వల్ల ఆ రెండు సంస్థల పరువే కాదు, యూపీఏ ప్రభుత్వం పరువే గంగలో కలిసిపోయింది. ఈ పరిణామాల ఫలితంగా సీబీఐ మిగిలిన తన పరువును సంరక్షించుకునేందుకు కొంత ధైర్యాన్ని చిక్కబట్టుకోవడం జరిగింది. ఫలితంగానే జగన్‌పై కేసుల విషయంలో అది పాలకశక్తుల స్వార్థ ప్రయోజనాల ఒరవడి నుంచి బయటపడాలనుకుని, కొన్ని వాస్తవాలతో ఆఖరి ఛార్జిషీట్లను దఖలు పరచాల్సివచ్చింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో నిందితులు నేరం చేశారో లేదో తేలే దాకా వారు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అంటూ అది కాలు కాల్చుకున్న పిల్లిలా సీబీఐ కోర్టు ముందిచ్చిన ప్రకటనలో ముక్తాయించాల్సి వచ్చింది! కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మిగిలిన ఆరోపణలన్నీ ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర శాఖల పరిశీలనకు వదిలేశామని చెప్పింది.
‘2-జీ’ స్కాములో సుప్రీంకోర్టు దేశ పరిధుల్లోని రేడియో తరంగాలు సహా సహజ వనరులన్నీ దేశ ప్రజల ఉమ్మడి సొత్త్తేగాని, వ్యక్తిగత లాభార్జన పరుల సొత్తు కాదని రాజ్యాంగ పరంగా ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పింది. అయినా దేశీయ, విదేశీ టెలికాం గుత్త కంపెనీల ఆగడాలు సర్దుమణగలేదు. ఎందుకని? 1991లో మొద లైన ‘ప్రపంచ బ్యాంకు’ ప్రజావ్యతిరేక సంస్కరణలను కాంగ్రెస్, బీజేపీలు రెండూ బేషరతుగా తలకెత్తుకొని ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టాయి. విదేశీ మదుపు సంస్థలైన ఎఫ్‌ఐఐ గుత్తేదారీ వర్గాలకు దేశీయ స్టాక్ మార్కెట్లలో స్వేచ్ఛా జూదానికి దారులు తెరిచారు. చిన్న పరిశ్రమలను, వ్యవసాయాన్ని పండబెట్టారు.
భారత ప్రభుత్వం కేవలం ఒక బ్రోకర్‌గా మాత్రమే (ఫెసిలిటేటర్) వ్యవహరించాలని ప్రపంచ బ్యాంకు శాసించింది. పారిశ్రామిక, కార్మిక చట్టాలను సవరించాలని ఆదేశించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ శాసించే దిగుమతులన్నింటినీ దేశంలోకి అనుమతి లభించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను లంచగొండి వ్యవస్థగా దిగజార్చింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ హవాలా ట్రేడింగ్‌కూ, మల్టీ నేషనల్ కంపెనీలు ఇండియాలో పన్నులు చెల్లించనక్కరలేకుండా వ్యాపార లావాదేవీలు సాగించడానికి వీలు కలిగించారు. పలితంగా లక్షల కోట్లలో దొంగ డబ్బు చట్టాలకు అందకుండా సరిహద్దులు దాటి స్విట్జర్లాండ్, తదితర గుప్త ధన కేంద్రాలలో మేట వేసుకుంది. అమెరికాలో 400 మంది మహా కోటీశ్వర్లుంటే మన దేశంలో 1500 మంది కోటీశ్వరులూ, మహా కోటీశ్వరులూ పుట్టుకొచ్చారు. ఇదే మన ఆర్థిక వ్యవస్థ ‘బలుపు’నకు బ్రాండ్ మార్క్ అయింది!
జగన్ ఎదిగిపోతారనే బెంగతో...
ఇలాంటి వ్యవస్థలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు జగన్‌పై విరుచుకుపడి కుహనా అవినీతి వ్యతిరేక పోరాటం పాలక వర్గాలు ప్రకటించాయి. రుజువుకాని ఆరోపణలతో, జగన్ ప్రమేయమే లేని వైఎస్ హయాము నాటి 26 జీవోల చాటున దాగి ఆయనపై వేధింపులకు దిగారు. కేంద్రంలో రాహుల్ ఎదిగి రాకుండానే జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని నేతగా ఎదిగిపోతాడేమోనన్న బెంగతో, కచ్చితో జగన్‌పైన కాంగ్రెస్ అధిష్టానం కత్తిగట్టిందని రాష్ట్ర ప్రజల, యువత మనస్సుల్లో ఏర్పడిన అభిప్రాయం. అది ఇప్పట్లో తొలగిపోదు. వ్యక్తిత్వంతో వెలిగే ఏ వ్యక్తి అయినా పాలనా వ్యవస్థకు కూడా స్థిరత్వం అందించగలుగుతాడు. జగన్ లాంటి కొడుకు ‘దేశం’ నిర్మాత అయిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు ఒక్కడైనా ఉండి ఉంటే ఎన్టీఆర్ ‘దశమగ్రహం’ చంద్రబాబు ‘వెన్నుపోటు’కు సరిపోటు ఆనాడే పడి ఉండేది! ఎన్ని కేసులు ఉన్నాగానీ రాజ్యాంగం నిర్బంధంలో ఉన్న పౌరులకు సహితం జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించింది. కుళ్లిపోయిన ఈ పాలనా వ్యవస్థ యువకుడైన జగన్‌మోహన్‌రెడ్డిని 16 మాసాల పాటు అనూహ్యమైన ఎత్తుగడలతో ఆ హక్కులు లేకుండా ఇబ్బందుల పాలుచేసింది.
అయినా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు (బహుశా దేశ చరిత్రలో కూడా) యుక్త వయస్సులో ఉన్న ఏ మంత్రి కొడుకులోనూ, ఏ ముఖ్యమంత్రి కొడుకులోనూ మనం చూడని, చూడబోని నిబ్బరాన్ని, మనోధైర్యాన్ని, నిర్బంధం మధ్య సైతం చెక్కు చెదరని చిరునవ్వునూ, విషాన్ని సహితం అమృతంలా స్వీకరించగల గరళ కంఠాన్నీ - ఒక్క జగన్‌లో మాత్రమే చూడగలమంటే ఆశ్చర్యం లేదు! కనుకనే కొందరికి అన్నీ ఉంటాయిగాని ‘అసలుది’ మాత్రం ఉండదట! అలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం.
బహుశా అందుకే ఉద్దండులైన పాశ్చాత్య తత్వవేత్తలైన థోరే, ఎమర్సన్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణ అనూహ్యమైన సత్యాన్ని ఆవిష్కరించింది. వ్యక్తులపై అభియోగాలు మోపి అరెస్టు చేసిన 90 రోజులలోనే వారు బెయిల్‌కు అర్హులని ఇండియన్ పీనల్ కోడ్ కోడై కూస్తున్నా ఆ పరిధిని సహితం లెక్కచేయకుండా 16 మాసాల పాటు విచారణ లేకుండా జైలులో నిర్బంధించిన పూర్వరంగంలో నాటి థోరే మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘ఏ వ్యక్తినైనా అన్యాయంగా జైల్లో నిర్బంధించే ప్రభుత్వ జమానాలో, న్యాయ ప్రవర్తనుడైన వ్యక్తి స్థానం కూడా ఆ జైలులోనే ఉంటుంది’’ అన్నాడు థోరే వ్యంగ్యంగా. ఈ మాటలను విన్న ఎమర్సన్ ‘‘అదేమిటయ్యా, నీవిక్కడ - జైలులో ఉన్నావేంటి’’ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. దానికి థోరే... ‘‘నీవూ ఈ జైల్లో ఎందుకు లేవో చెప్పుకో చూద్దాం’’ అని ఎదురు ప్రశ్నించాడు! అంటే, కొన్ని రకాల నిర్బంధాలకు ఎదుటి పక్షం స్వార్థ ప్రయోజనాలు తప్ప మరో కారణం ఉండదు! అంటే, ‘క్విడ్ ప్రోకో’ కాస్తా ‘క్విట్ ప్రోకో’గా మారిపోయిందన్నమాట! నవ్విన నాప చేనే పండింది! అందుకే ఏడుపులూ, వెకిలి వ్యాఖ్యలూ!