ఆ దుస్థితి చరిత్రకెందుకు?
సాక్షి సాహిత్యం పుటలో 20-06-2016 నాడు ‘తొలి తెలుగు సినీకవి’ వ్యాసం గురించి పాఠకులకు కొన్ని విషయాలు తెలపాల్సివుంది.
1. ‘‘జనన మరణాల దృష్ట్యా... వారం’’ అన్నారు మొదటి వాక్యంగా. కాని చందాల కేశవదాసు మరణించింది జూన్ 14న కాదు. అది మే 14న (1956).
2. ధర్మవరం రాసిన నాటకం ‘భక్తప్రహ్లాద’ కాదు; ‘ప్రహ్లాద నాటకం’ మాత్రమే.
3. సరస్వతీ టాకీసు వారు హెచ్.వి.బాబు దర్శకత్వంలో తీసిన కనకతార సినిమాను 1937లో విడుదల చేశారు. 1936లో కాదు. దీన్నే 1956లో మళ్లీ తీశారు. 1955లో కాదు.
4. కేశవదాసు గారు ఏ ‘ప్రహ్లాద’ నాటకానికీ పాటలు రాయలేదు.
5. కేశవదాసు శ్రీకృష్ణ తులాభారం నాటకంలో మూడు మాత్రమే కాదు, అన్ని పాటలూ రాశారు. అలాగే రాధాకృష్ణ నాటకానికీ అన్ని పాటలూ రాశారు. కురుకూరి సుబ్బారావు గారు 1929లో వేసిన పుస్తకం ఇందుకు ప్రబల సాక్ష్యం.
6. ధర్మవరం వారి ‘వింతాయెన్ వినన్’ పాటను తొలి తెలుగు సినిమా పాట అనడం పైడిపాల గారి ‘స్వవచో వ్యాఘాతం’. సినిమా కోసం ప్రత్యేకంగా రాయించుకున్న పాట ‘తొలి’ అవుతుంది కాని నాటకంలో పాటకా ప్రత్యేకత ఉండదు. రచయిత ఉద్దేశం ప్రకారం ‘పరితాప భారంబు’ సురభివారి కోసం (కేశవదాసు) రాస్తే అదీ నాటక గీతమే అవుతుంది. కనుక ‘తొలి గీత రచయిత’ కేశవదాసూ కాదు, ధర్మవరమూ కాదు, అని భావించే దుస్థితి చరిత్రకెందుకు? హెచ్.ఎం.రెడ్డి గారి సృజనాత్మకతను సురభివారికి అంటగట్టే ఈ ధోరణి అందరికీ అవమానకరం. హెచ్.ఎం.రెడ్డి కావాలని సినిమా కోసం కొత్త దృశ్యాన్ని కల్పించి రాయించుకున్న పాటను చందాల కేశవదాసు రచించారని చెప్పుకుంటే పైడిపాల వారికి ఏమన్నా అవమానం కలుగుతుందా? ప్రహ్లాద నాటకానికి కేశవదాసు పాటలు రాశారనే అభూత కల్పనతో మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసం?
డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య
9396611905