కోడికి కూడా ఒకరోజు వస్తుంది!
యజమాని పుంజుని అపురూపంగా చూసుకుంటాడు. తన మంచం కోడికి కట్టేసుకుంటాడు. విషప్రయోగాలు జరగకుండా చూసుకుంటాడు. పందేల తరుణం రావడానికి రెండు నెలల ముందు నుంచి పుంజుతో బ్రహ్మచర్యం పాటింపచేస్తాడు.
ఔను. అన్నట్టే వచ్చింది. కోడి గురించి లోకం కోడైకూ సింది. కోడి పందెం హింసాత్మకమా, వినో దాత్మకమా నిగ్గు తేల్చ డానికి దేశ అత్యున్న త న్యాయస్థానాలు సిద్ధపడ్డాయి. ఆఖరికి కోడి చావకుండా, కత్తి దుయ్యకుండా తీర్పులిచ్చారు. వందల, వేల బరుల్లోకి జాతిపుంజులు దిగాయి. చంద్రన్న సం క్రాంతి కానుక పథకం మూడొందల కోట్లు అయి తే, సంక్రాంతి పందెపు కాపులు, పైకాపులు మూడొందల కోట్ల పైమాటే. నేతలకి, పందెంరాయుళ్లకి, చానల్స్‌కి, పోలీసులకి వినోదం ఎగస్ట్రా. కోడిపుంజు చాలా ప్రాచీన పక్షి. పురాణాల్లో కనిపి స్తుంది. కుమారస్వామి వాహనం నెమలికి తోడు కోడి పుంజు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. నెమలి కోడిపుం జుకి సాక్షాత్తూ మేనమామ. ఆ పోలిక వచ్చే దీనికీ రెక్క లున్నా ఎగరడం రాలేదు.
పింఛం రాలేదు గాని, పౌరు షం వచ్చింది. శ్రీనాథ కవిసార్వభౌముడు కోడిపందే లను, పౌరుషాలను సీసాలకెత్తారు. కోడిపుంజుకి కావ్య గౌరవం ఇచ్చారు. ‘‘బరిలో పోరిపోరి వీరమరణం చెందే కోడిపుంజులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందా? రంభ, ఊర్వ శి మొదలైన అచ్చర కన్నెల పొందు లభిస్తుందా?’’ అని శ్రీనాథకవి సూటిగా ప్రశ్నించారు. నాకూ ఇదే డౌటు వచ్చి ఒక పెద్దాయనని అడిగా! స్వర్గంలో ప్రతిజాతి లోను అచ్చరలుంటారు. అచ్చర కోడిపుంజులుంటాయి. ఏనుగుల్లో, గుర్రాల్లో, లొట్టిపిట్టల్లో అప్సరసలుంటాయి. ఎందుకంటె యుద్ధాలలో ఈ జాతులన్నీ వీరమరణం చెంది స్వర్గానికి వెళ్తాయి కదా! దేవేంద్రుని ఐరావతం కోసం అలాయిదాగా-అంటే సెపరేట్‌గా గజదేవకన్య లుంటారు. ఇంకా వివరంగా నా డౌటు క్లియర్ చేశారు. వీటినే తెలుగులో చొప్పదంటు ప్రశ్నలంటారు. జలచరా లను, భూచరాలను, ఖేచరాలను సృష్టించిన ఆ దేవుడు స్వర్గంలో అవసరాలకు తగిన విధంగా వసతులు సమ కూర్చడా! అనగా సమకూరుస్తాడని భావము.
ఇక మళ్లీ వార్తల్లోని పక్షి కోడి వ్యవహారానికి వస్తే, పుంజుల్లో బెరస, నెమలి, కాకి అంటూ బోలెడు జాతులు న్నాయి. కాళ్లకి అడ్డంగా పెరిగిన ‘కాటా’ ఉంటుంది. దానికే కత్తి కడతారు. కత్తి కట్టడం ఒక కళ. పందెపు కోడిని మేపడం ఒక కళ. బాదంపప్పులతో సహా ఖరీదైన పప్పులతో ‘దాణా’ తయారుచేస్తారు. రోషం కోసం ఉల్లి పాయలు తినిపిస్తారు. ఉత్సాహం పుట్టడానికి సీమ సారాయి తాగిస్తారు. దమ్ము పెరగడానికి చెరువులో ఈతలు కొట్టిస్తారు. కోడి యజమాని పుంజుని అపురూ పంగా చూసుకుంటాడు. తన మంచం కోడికి కట్టేసుకుం టాడు. పోటీదారుల నుంచి విషప్రయోగాలు జరగకుం డా చూసుకుంటాడు. పందేల తరుణం రావడానికి రెం డు నెలల ముందు నుంచి పుంజుతో బ్రహ్మచర్యం పాటింపచేస్తాడు. గుర్రప్పందేలలో గుర్రాల చరిత్రలని స్టడీ చేసినట్టు వీటి నేపథ్యాలు పరిశీలిస్తారు. పల్నాటి విత్తనానికి మంచి గిరాకీ ఉంటుంది. అంటే దాని మీద బెట్టిం గులు బాగా సాగుతాయి. కారెంపూడి పోతు గడ్డ మీంచి మట్టి తెచ్చి మరీ ట్రెయినింగ్ బరులు తయారు చేస్తారు.
ఇంత కథా కమామిషూ ఉన్న కోడిపం దేలను నిషేధిస్తామంటే ఎలా? జూదం అంటారా- అది మన భారతీయ వారస త్వం. రాజ్య సంపదలని, సోదరులని, భార్య ని సైతం ఒడ్డిన ధర్మరాజులం. ఇందులో హింస ఉందం టారా? పందెం అన్నాక, పోటీ అన్నాక హింస తప్పదు. పోటీ పరీక్షలలో మన పిల్లలు హింసకు గురి అవడం లేదా? ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఆరగించేది కోడి మాంసాన్నే. బెట్టింగులు లేకముందు గెలిచిన కోడితో పాటు, ఓడిన కోడిని తెచ్చుకోవడం రివాజు. పెద్దపండుగలలో ఇదొక ఆటవిడుపు. ‘రిలాక్సేషన్’ అన్నారు నాయకులు, ప్రజలు. ఇది శతాబ్దాలుగా వస్తు న్న సంప్రదాయం. కోడిపుంజు జాతికి మేల్కొలుపులు పాడుతుంది. అందుకే మోదీ సర్కారు జాగృతం చేసే కోడిని, స్వచ్ఛ భారత్‌కు కాకిని అధికారికి చిహ్నాలుగా నిర్ణయించాలని లోకుల తరఫున కోరుతున్నా!
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
- శ్రీరమణ