దేవుడా... దెయ్యమా?! | God or devil by Ramachandramurthy | Sakshi
Sakshi News home page

దేవుడా... దెయ్యమా?!

Published Sun, Aug 27 2017 12:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

దేవుడా... దెయ్యమా?!

దేవుడా... దెయ్యమా?!

గోప్యతను ప్రాథమిక హక్కుగానూ, రాజ్యాంగంలోని 21వ అధికరణలో అంతర్భాగంగానూ నిర్ధారిస్తూ తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా అద్భుతమైన తీర్పు ఇచ్చే క్రమంలో వర్త మాన రాజకీయ, సామాజిక వ్యవస్థకు వర్తించే ఒకానొక ముఖ్యమైన అంశం మెరుపులా మెరిసింది.

త్రికాలమ్‌
గోప్యతను ప్రాథమిక  హక్కుగానూ, రాజ్యాంగంలోని 21వ అధికరణలో అంతర్భాగంగానూ నిర్ధారిస్తూ తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా అద్భుతమైన తీర్పు ఇచ్చే క్రమంలో వర్త మాన రాజకీయ, సామాజిక వ్యవస్థకు వర్తించే ఒకానొక ముఖ్యమైన అంశం మెరుపులా మెరిసింది. న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ అమెరికా చరిత్ర నుంచి ఒక ఉదంతం ఉటంకించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ను ఒక మహిళ వీధిలో పట్టుకొని ‘మాకు ఎటువంటి ప్రభుత్వం ఇచ్చావయ్యా?’ అని ప్రశ్నిం చిందట. దానికి ఆయన ‘ఒక గణతంత్ర ప్రభుత్వాన్ని ఇచ్చాం. మీరు నిలబెట్టు కుంటే అది ఉంటుంది (A Republic, if you can keep it),’ అని సమాధానం చెప్పారట.

అమెరికా పౌరులు అనేక త్యాగాలు చేసి వారి రిపబ్లిక్‌ను కాపాడు కున్నారు. అరవై అయిదు సంవత్సరాల క్రితం రాజ్యాంగ నిర్మాతలు ఇండియాకు  రిపబ్లిక్‌ వ్యవస్థను ప్రసాదించారు. రిపబ్లిక్‌ను మనం రక్షించుకోగలమా? అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రక తీర్పును ఆలకించినప్పుడు భారత రిపబ్లిక్‌కు «ఢోకా లేదనిపిస్తుంది. మర్నాడు పంచకూలాలో సీబీఐ కోర్టు న్యాయ మూర్తి జగదీప్‌సింగ్‌ సాహసోపేతంగా తీర్పు ఇచ్చిన తర్వాత హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌ రాష్ట్రాలలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం గమనించినప్పుడు గణతంత్ర భారతం మనుగడపైన భయ సందేహాలు  కలుగుతాయి.  అంబేడ్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, వివేకంతో రూపొందించి ప్రసాదించిన రాజ్యాంగ విలు వలను పరిరక్షించుకోవడం జాతి ప్రాథమిక కర్తవ్యం. అందరికీ సమన్యాయం జరగాలంటే, అర్భకులకూ, అధికారం లేనివారికీ అందరితోపాటు సమాన హక్కులు ఉండాలంటే రిపబ్లిక్‌ వ్యవస్థను పరిరక్షించుకోవడం అత్యవసరం.  

అరాచకం, అల్లకల్లోలం
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి  రాకముందు ఎన్నికల ప్రచారంలోనూ, అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనూ పరిమితమైన ప్రభుత్వం, అపరిమితమైన పరిపాలన ( limited government, unlimited governance) సమకూర్చుతా మని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంపైన ఇంతవరకూ అవినీతి ఆరోపణలు రాకపోవడాన్ని అభినందించవచ్చు.  ప్రభుత్వ యంత్రాంగం పని తీరు మెరుగైందని కానీ రాష్ట్రాలలో పరిపాలన సజావుగా సాగుతున్నదని కానీ సాధికారికంగా చెప్పడం కష్టం. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ప్రభుత్వ నిర్వాకం చూసిన తర్వాత అక్కడ పరిపాలన ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో లోకానికి తెలిసిన అనంతరం రాష్ట్రాలలో పరిపాలన మెరుగైనదని బీజేపీ నేతలు సైతం ధైర్యంగా చెప్పజాలరు.

డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రాంరహీమ్‌ సింగ్‌ మహిళపైన అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు ధ్రువీకరించిన అనంతరం జరిగిన హింసాకాండలో ఒక్క  సిర్సాలోని పంచకూలాలోనే 28 మంది (ఎక్కువ మంది డేరా విధేయులే) మరణించడం హరియాణా ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. మొత్తం మీద 32 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడి నారు. 1984లో ఇందిరాగాంధి హత్యానంతరం ఉత్తర భారతంలో కనబడిన భయానక వాతావరణమే శుక్రవారం సాయంత్రం అగుపించింది. న్యాయ వ్యవస్థ, మీడియా, ఇంటెలిజెన్స్‌ వర్గాలు చేసిన స్పష్టమైన హెచ్చరికలను హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పెడచెవిన పెట్టారు.

ఖట్టర్‌ అసమర్థత
డేరా ఆశ్రమంలో 1.5 లక్షల మంది చేరడాన్ని అనుమతించారు. 144వ సెక్షన్‌ కింద అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు పంచకూలాలో కూడా విధించినప్పటికీ ఆశ్రమానికి ఈ ఉత్తర్వులు వర్తించ వంటూ రాష్ట్ర విద్యామంత్రి రాంవిలాస్‌శర్మ ప్రకటించారు. శర్మ రాంరహీమ్‌ భక్తుడు. ఖట్టర్, ఆయన సహచరులు కూడా అంతే. ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తం 47 మంది బీజేపీ శాసనసభ్యులలో 19 మంది డేరా బాబా దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత ప్రకటించుకొని వచ్చారు. 2002 సెప్టెంబర్‌ 25న నాటి ప్రధాని వాజ పేయికి ఒక అజ్ఞాత మహిళ రాసిన ఉత్తరంలో గుర్మీత్‌ రాజకీయ నేతలకు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, అతనికి అధికారమదం ఎంతగా తలకెక్కిందో వివరించింది. తనపైన అత్యాచారం చేశాడనీ, ఆ విషయం బయటికి పొక్కితే చంపి వేయగలననీ, తాను ఏమి చేసినా చట్టానికి చిక్కబోననీ, ముఖ్యమంత్రులూ, మంత్రులూ తనకు పరమ విధేయులనీ గుర్మీత్‌ చెప్పుకున్నట్టు ఆ మహిళ వివరించింది. తన అనుచరులలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు తేల్చింది. హరియాణా కోర్టు సూమోటోగా ఈ  కేసును స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

2007లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సిర్సా ఆశ్రమంలో 15 మంది సాధ్వీలను విచారిస్తే ఇద్దరు తమపైన బాబా అత్యా చారం చేశాడని ఆరోపించారు. అత్యాచారం వివరాలను బయటపెట్టిన జర్న లిస్టును హత్య చే యించాడనే అభియోగం కూడా బాబాపైన ఉన్నది. ఆరు ఉత్త రాది రాష్ట్రాలలో విస్తృతంగానూ, ఇతర రాష్ట్రాలలో పలచగానూ బాబా భక్తు లున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆరుకోట్ల మంది భక్తులు కానీ అభిమానులు కానీ బాబాకు ఉన్నట్టు అంచనా. అందుకే మొదట కాంగ్రెస్, తర్వాత బీజేపీ, అకాలీదళ్‌ బాబా అనుగ్రహం కోసం అంగలార్చాయి.  గాలి ఉన్న ఎన్నికలలో బాబా ఫలితాలను ప్రభావితం చేయలేడు. ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి అను కూలంగా గాలి ఉంటే దాని జోరు పెంచగలడు. ఉదాహరణకు పంజాబ్‌లో 2007లోనూ, 2012లోనూ డేరాబాబా కాంగ్రెస్‌కి  మద్దతు ప్రకటించారు.

2007లో కాంగ్రెస్‌ గెలిచింది కానీ 2012లో ఓడిపోయింది. 2014లో దేశమం తటా బీజేపీకి అండగా నిలిచాడు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిం చింది. హరియాణాలో బీజేపీ గెలుపొందింది. బాబాను ప్రసన్నం చేసుకుంటే ఖాయంగా గెలుస్తామన్న నమ్మకం లేకపోయినా పది ఓట్లకోసం కక్కుర్తిపడి విలు వలతో రాజీపడే రాజకీయ నాయకులు బాబా సేవ చేస్తూనే ఉన్నారు. ఇటీవల బాబాపై నిర్మించిన చిత్రం (ఎంఎస్‌జీ–2)కు హరియాణా ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్న డేరా సచ్చా సౌదాను ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో)గా రిజిస్టర్‌ చేశారు. 2016లో జాట్ల ఆందోళన సమయంలో ఘోరంగా విఫలమైన తర్వాత అయినా ఖట్టర్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసింది.  

హైకోర్టు అభిశంసన
కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించినా  పంజాబ్‌–హరియాణా హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. ‘బాబాకు రాజకీయంగా లొంగి పోయింది’ అంటూ అభిశంసించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ‘ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం’ అంటే ‘హరియాణా భారతదేశంలో లేదా? ప్రధాని కేవలం బీజేపీ ప్రధాని కాదు. దేశానికి ప్రధాని’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

సిక్కు మతం ఆవిర్భవించింది ఐదువందల సంవత్సరాల క్రితమే. ఇది ఇంకా పరిణామ క్రమంలో ఉన్నది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. తెల్ల తలపాగా ధరించే నిరంకారీలు కొంతకాలం రాజకీయాలనూ, సమాజాన్నీ ప్రభావితం చేశారు. నిరంకారీలు జరిపిన కాల్పులలో 16 మంది అనుచరులు మరణించడంతో భింద్రన్‌వాలేకు పలుకుబడి పెరిగింది.

నిరంకారీ అధినేత గురుబచన్‌సింగ్‌ను భింద్రన్‌వాలే అనుచరులు హత్య చేశారు. జైల్‌సింగ్‌ సృష్టించిన భస్మాసురుడు భింద్రన్‌వాలే ఊహకు మించిన సంక్షోభం సృష్టించాడు.  అకల్‌తఖ్త్‌పైకి సైన్యాన్ని పంపించి అతన్నీ, అతని అనుచరులనూ చంపే వరకూ పరిస్థితులు విషమించాయి. ఇందుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. భనియారా బాబా, ఫ్రీజర్‌ (అశుతోశ్‌) బాబా, అసీ రాం బాబా వగైరాలు పంజాబ్, హరియాణా  రాష్ట్రాలలో పుట్టుకు రావడానికి సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నాయి. తమ బాబా మరణించడనే విశ్వాసంతో 2014లో మరణించిన అశుతోశ్‌ను ఫ్రిజరేటర్‌లో పెట్టి అంత్య క్రియలు జరిపించకుండా ఆయన శిష్యులు శవాన్ని ఉంచారు.

బాబా భక్తుల నేపథ్యం ఏమిటి?
సంక్షేమ కార్యక్రమాల అమలులో, ఆర్థిక, సాంఘిక అసమానతలను తగ్గించ డంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి. బాధితులు తమ బాధలూ, కష్టాలూ విస్మరించేందుకు నవలోకాన్ని కలగంటున్నారు. ఏదో ఒక అద్భుతం తమ బాబా అలౌకిక శక్తుల ద్వారా జరుగుతుందనీ, తాము కోరుకుంటున్న సంపద అంతా తమ ఒడిలో పడుతుందనీ భ్రమిస్తారు. కొత్త క్రీస్తు పుట్టు కొస్తాడనీ, పునరుత్థాన సమయంలో ఆకాశం విచ్చుకొని ఫ్రిజిరేటర్లూ, ఎలక్ట్రానిక్‌ సామాగ్రి అన్నీ భూమిపైన పడతాయనీ మతం, మూఢభక్తి కలబోసిన ఉన్మ త్తతకు లోనైన భక్తులు భావిస్తారన్నది పీటర్‌ మారిస్‌ వార్‌స్లీ అనే ప్రఖ్యాత బ్రిటిష్‌ సామాజిక శాస్త్రవేత్త ప్రవచించిన సిద్ధాంతం. గుర్మీత్‌ రాంరహీమ్‌సింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని భక్తులను ఆకట్టుకు న్నాడు. బాబా చేసే సాహస కృత్యాలూ, అద్భుతాలూ అన్నీ ఆయన నిర్మించే సినిమాలలో పంచరంగులలో కనిపిస్తాయి. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ను మించిన అభూ తకల్పనలు (ఫాంటసీ) వారి చిత్రాలలో ఉంటాయి. భారీస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కాడు. సెక్స్‌వర్కర్లకి సామూహిక వివాహాలు చేసి వారికి సమాజంలో గౌరవ స్థానం ప్రసాదించాడు.

ఒక్కొక్క జంటకు రూ 1.5 లక్షలు సహాయంగా అందిస్తాడు. వితంతువుల వివాహం జరిపిస్తాడు. హిజ్రాలకు న్యాయపరమైన హోదా కల్పించాలని కోరుతూ డేరా సచ్చా సౌదా 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సంస్థ సంస్కరణలు తెస్తోంది. సత్యసాయి సేవా ట్రస్టు మాదిరే ఆస్పత్రులు నిర్వ హిస్తోంది. డేరా సచ్చా సౌదా ఆశ్రమాలలో ఒకరకమైన సమాంతర ప్రభుత్వం నడుస్తున్నది. విరాళాలు వసూలు చేసి పేదవారి కోసం ఖర్చు చేస్తున్నారు. బాబా భక్తులలో అత్యధికులు ఓబీసీలూ, సిక్కు దళితులూ. సత్యసాయిబాబా, సద్గు రులూ, స్వామినారాయణ వంటి పీఠాధిపతులూ, మఠాధిపతులూ సంపన్ను లనూ, మధ్యతరగతి ప్రజలనూ ఆకర్షించారు. ఈ తరహా భక్తులకు ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది. పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుంది. డేరాబాబా భక్తులు అందరూ నిమ్నకులాలకీ, దిగువవర్గాలకీ చెందినవారు. వీరికి తమ బాబాపైన ఎటువంటి భక్తివిశ్వాసాలు ఉంటాయంటే వారు పోలీసులనీ, చట్టాలనీ లెక్కచేయరు. బాబా ఆదేశిస్తే ఏదైనా చేస్తారు. వారికి ఆశ్రమమే సర్వస్వం. బాబానే కొత్త దేవుడు. ఈ దేవుడికి మానవులకు ఉండే బలహీనతలు ఉంటాయంటే వారు నమ్మరు. అందుకే అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఆమోదించరు.

ఈ ఉదంతంలో హరియాణా ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించి తగిన చర్య తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో ప్రధాని గుర్తించాలి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సుపరిపాలన గురించి చేసిన ప్రస్తావనను మనసుకు పట్టించుకొని పేద, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశిం చిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేయడానికి ప్రభుత్వం అహరహం శ్రమించాలి. మూఢ నమ్మకాలనూ, మూఢాచారాలనూ ప్రజల జీవితాల నుంచి పారదోలడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.

-కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement