జెండర్ వివక్ష మీద ఖడ్గధార
సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిలో స్త్రీ-పురుషులు జమిలిగా పాలు పంచుకోవడం వల్లనే సామాజిక జీవనం సజావుగా సాగడానికి వీలు కలిగింది. ఈ కనీస జ్ఞానం చాలా మందిలో లోపించడం వల్లనే ఈ వివక్ష, ఈ పెడబుద్ధులు చోటు చేసుకుంటున్నాయి.
‘నేను స్త్రీల నుంచి, ముఖ్యంగా స్త్రీవాద మహిళల నుంచి నేర్చుకుంటున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. జెండర్ హింస గురించి స్వయంగా ఆ హింసకు గురైన మహిళల నుంచే ముఖతహ తెలుసుకున్నాను. స్త్రీల పట్ల అత్యాచారం ఆధారం లేని శూన్యంలో జరగదు. ఒక స్త్రీని అవమానించే ఒక పురుషుడు తన పురుష జన్మను గౌరవించే నాగరికతలో మాత్రమే బతికి బట్టక డుతూ ఉంటాడు. వీధుల్లో స్త్రీలను వేధించటం, సమాన గౌరవంతో చూడకపోవటం, పని మధ్యలో వారిని అటకాయించటం, నోటికొచ్చినట్టు వదరటం, అధికారం, పెత్తనం చెలాయించ బోవటం, పని చేసుకునే చోట లైంగికంగా వేధించటం - ఇత్యాది వేధింపులన్నీ ఈ దుర్మార్గాలన్నింటికీ పునాది. ఈ పునాది మీదనే జెండర్ వివక్ష, హింస మరింతగా కొనసాగుతోందని గుర్తించాలి’
- బెన్‌జిమన్, సంస్కర్త (లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 20 ఏళ్లుగా పని చేస్తున్న ‘నోమాస్’ సంస్థ ప్రతినిధి.)
మహిళలపై అత్యాచారాలనూ, హింసనూ అరికట్టి స్త్రీ-పురుష సమానత్వం గురించి ప్రబోధించేందుకు బెన్‌జిమన్ వచ్చేవారం సతీసమేతంగా ఇండియా వస్తున్నారు. యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ఆయన ఉద్దేశం. ఈ సందర్భంగా మన ఆడపడుచుల మీద రకరకాల వేధింపులు, అత్యాచారాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటి వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను పరిశీలించడం అవశ్యం. అసలు స్త్రీ-పురుష నిష్పత్తిలో ఇప్పుడున్న తీవ్రమైన వ్యత్యాసానికి కారణం ఏమిటి? ఈ అసమ వ్యవస్థలో మున్నెన్నడూ లేని రీతిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎందుకు కుంచించుకుపోతున్నది? ఆడ శిశువును కడుపులోనే, లేకుంటే పుట్టగానే ఎందుకు చిదిమేస్తున్నారు? 21వ శతాబ్దంలో కూడా ఇంకా కొందరు స్త్రీ విద్య అంటే ఎందుకు గొణుగుతున్నారు? ఏ రంగంలో, విద్యలో ఆడపిల్లలు మగపిల్లల కన్నా వెనుకబడి ఉన్నారు, వివక్షలో తప్ప! సమాజంలో అనాదిగా మత ఛాందసానికీ, అభివృద్ధి నిరోధక భావాలకూ పెద్ద పీట వేసిన ‘మగరాయుళ్లు’ ఇందుకు కారణం. సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిలో స్త్రీ-పురుషులు జమిలిగా పాలు పంచుకోవడం వల్లనే సామాజిక జీవనం సజావుగా సాగడానికి వీలు కలిగింది. ఈ కనీస జ్ఞానం చాలా మందిలో లోపించడం వల్లనే ఈ వివక్ష, ఈ పెడబుద్ధులు చోటు చేసుకుంటున్నాయి.
ఇంకా ‘అభయ’మివ్వాలా?
రకరకాల మానసిక దౌర్బల్యాల ద్వారా, అడ్డంకుల ద్వారా స్త్రీ జాతి ప్రగతికి సంకెళ్లు తగిలించి, ఆమె కంటకమార్గాలలో ప్రయాణించేటట్టు చేసింది మన మగరాయుళ్లే. ఆ వివక్ష ఈ 21వ శతాబ్దంలో కూడా పురుషుడి మనసును కుమ్మరి పురుగులా తొలుస్తున్నందునే ‘పూట బత్తెం పుల్ల వెలుగు’ జీవితాలు గడుపుతున్న పేద సాదల ఆడపడుచుల పట్లనే కాదు, విద్యార్థినుల పట్లనే కాదు, చివరికి ముక్కుపచ్చలారని చిన్నారులపై కూడా కళ్లు పూడుకుపోయిన కాముకతతో మగరాయుళ్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటివాళ్లు ఇంతగా బరితెగిస్తున్నారంటే, ఈ ‘పుండు’ ఎక్కడుందో గమనించడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించవలసిన సమయం వచ్చింది. మన ఆడపడుచులలో నిర్భీతి ఆచరణాత్మకంగా కనిపించాలంటే ధనిక వర్గ వ్యవస్థకు కాపలాదార్లుగా వ్యవహరిస్తున్న పార్టీలూ, ప్రభుత్వాలూ ‘అభయ’, ‘నిర్భయ’ అంటూ ప్రకటనలకు పరిమితమైతే చాలదు. నిజానికి ‘అభయం’, ‘నిర్భయం’ అనడంలోనే వేరెవరో స్త్రీ రక్షణ బాధ్యతను తీసుకోవాలన్న ధ్వని ఉందనిపిస్తుంది. ఆమె ‘అబల’, ‘అస్వతంత్రురాలు’ అన్న భావనను నూరిపోసే తంతు ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికితోడు, ‘ఇంత జనాభా ఉన్న దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరగకుండా ఆపడం కష్టం’ అంటూ కొందరు నాయకులు సిగ్గు విడిచి చేస్తున్న ప్రేలాపన ఒకటి. మరో వైపున మతాంతర కులాంతర వివాహాల మీద ‘హిందుత్వ’ దాడులు కూడా కొనసాగుతున్నాయి.
మోసపూరిత ప్రకటనలే అండ
మీడియా నాలుగు చెరగులా ఇంతగా విస్తరించి ఉండకపోతే ఈ మాత్రం సమాచారం కూడా ప్రజల ముందుకీ, ప్రభుత్వాల దృష్టికీ వచ్చి ఉండేది కాదు. సుప్రీంకోర్టు ఎన్ని హెచ్చరికలూ, తీర్పులూ ఇచ్చినా ఈ అత్యాచారాలూ, హత్యలూ అదుపులోనికి రాకపోవడానికి ప్రధాన కారణం- 65 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పెట్టుబడిదారీ, ఫ్యూడల్, ధనికవర్గ పార్టీలు పైపై మోసపూరిత ప్రకటనలతో సరిపెట్టడమే. ఇన్ని దుర్మార్గపు పరిణామాల మీద భావుకులూ, స్త్రీవాద రచయితలూ, రచయిత్రులూ, కవులూ ఆగ్రహం ప్రకటించకుండా ఉండడం ఎలా సాధ్యం? ‘కళ్లల్లో కాలాగ్ని’ ద్వారా అత్యాచారాల మీద ‘సంహార శక్తి’ని ఆవాహనం చేస్తూ సుద్దాల అశోక్‌తేజ ఇలా గళం విప్పవలసివచ్చింది-
‘ఓ దురాత్మ రక్తదాహినీ/ సంహార శక్తిశాలినీ/ మహాగ్ని జ్వాలా శూలినీ/ కాళివా, నవకాళికలేకమైన అగ్నిశూలివా/ కళ్లల్లో కాలాగ్ని/ గుండెల్లో జ్వాలాగ్ని/ చేతుల్లో త్రేతాగ్ని/ శ్వాసిస్తే విషయాగ్ని/ నీ చెల్లెళ్ల కన్నీళ్లే నిలువెత్తున దహిస్తుంటే/ కిరాతకుల కాల్చివేయ/ కదులుతున్న -భస్మాగ్నివై/ పిశాచకుల కూల్చివేయ- ఏకమైన యోగాగ్నివై/ కదలివచ్చి’’ ఆ స్ఫూర్తిలోనే దేశంలోని ఆడపడుచులంతా నిర్భీతిగా బతకాలని కోరుకున్నాడు మన కవి.
ఉల్‌స్టోన్ క్రాఫ్ట్ అనుభవం
ఇలాంటి ఆశావహమైన, ఉత్తేజమైన సందేశానికి ఇంగ్లండ్ మహిళ మేరీ ఉల్‌స్టోన్‌క్రాఫ్ట్ నాంది పలికింది. ఫ్రెంచ్ విప్లవ కాలం(1789)లో స్వీయానుభవమే పాఠంగా స్త్రీ విమోచన కోసం ప్రపంచ మహిళల హక్కుల ఉద్యమానికి క్రాఫ్ట్ శ్రీకారం చుట్టారు. ‘మహిళల హక్కుల మేనిఫెస్టో’ (ఎ విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్) అనే మహత్తర రచనను ఆవిష్కరించారామె. క్రాఫ్ట్ రచన పురుషాధిక్య సమాజం మీద ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు తప్ప, మరొకటి కాదు. ఎలాగంటే, స్త్రీ-పురుష బంధం బానిస బంధంలా ఉండకూడదనీ, సహజమైన పరస్పర ప్రేమానుబంధంతో ముడిపడి ఉండాలని క్రాఫ్ట్ అందులో పేర్కొన్నారు. కృత్రిమ బంధనాల మధ్య అస్వతంత్రతా సంబంధాలతో కుములుతున్న స్త్రీలకు చేయూతనివ్వడానికి పురుషులు బేషరతుగా ముందుకు వచ్చిననాడు ‘మమ్మల్ని (స్త్రీలను) పురుషులు అణుకువ గల కుమార్తెలుగా, ప్రేమాస్పదులైన అక్కాచెల్లెళ్లుగా, మరింత అనుకూలవతులైన, నమ్మదగిన భార్యలుగా, హేతుబద్ధమైన తల్లులుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మరింత బాధ్యత గల పౌరులుగా చూడగలుగుతారు’ అని 300 ఏళ్ల నాడే క్రాఫ్ట్ ఎలుగెత్తి చాటింది. ఇంకా, ‘అప్పుడు మాత్రమే మేము (స్త్రీలు) పురుషులను నిజమైన ఆప్యాయత, అనురాగాలతో ప్రేమించగలుగుతాం. ఎందుకంటే, బాధ్యత గల స్త్రీలుగా మమ్మల్ని మేము గౌరవంతో మెలిగేలా, ఎదిగేలా చూసుకోవాలి గనుక!’ అని కూడా చెప్పారు క్రాఫ్ట్.
మగ అహంకారాన్ని గుర్తు చేసేందుకే
క్రాఫ్ట్ చాటిన విశ్వాసం ఈ దోపిడీ సమాజ వ్యవస్థలో కలిగే వరకు వర్గ వ్యవస్థలో, కుటుంబంలో భర్త బూర్జువాగానూ, భార్య శ్రమ జీవిగానూ (ప్రోలిటేరియన్)కాలం గడుపుతారని ఫ్రెడరిక్ ఏంగెల్స్ అన్నాడు. కనుకనే తాజా సర్వేలో ఐక్య రాజ్య సమితి పురుషులతో పోల్చితే స్త్రీ జనాభా నిష్పత్తి క్రమంగా తరిగిపోతూ ఉండడానికీ, మరిన్ని అరాచకాలకూ కారణమవుతోందని ఇండియాను ఉదహరిస్తూ పేర్కొన్నది. కనుకనే మగజాతికి బాధ్యతలూ అహంకార దర్పాన్నీ గుర్తు చేయడానికి ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఒక చలం, ఒక మహాశ్వేతాదేవి, ఒక రంగనాయకమ్మ, ఒక జయప్రద, ఒక సత్యవతి, ఒక కుప్పిలి పద్మ అవసరం అనివార్యమౌతుందేమో! ఇన్ని ఆటుపోట్ల మధ్య ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తోంది. అటు చూడండి! వివక్షకూ, పరువు హత్యలకూ పేరొందిన హర్యానాలో దూసుకుపోతున్న కుస్తీలు పట్టే మహిళా వస్తాదులను చూసి మగరాయుళ్లు సుస్తీ పడుతున్నారు.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు) - ఏబీకే ప్రసాద్