ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్‌డీలా? | How PHD has given to Puin job? | Sakshi
Sakshi News home page

ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్‌డీలా?

Published Sun, Sep 20 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

మొన్నటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థలలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు.

 మొన్నటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థలలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధనలేదు. ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబితాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు.
 
 కొన్ని వాస్తవాలు అభూతకల్పనల కంటే ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాకుం డా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 368 ప్యూన్ (చప్రాసీ) పోస్టులు నింప డానికి ప్రకటన జారీ చేస్తే 23 లక్షల దరఖాస్తులు వచ్చినట్టూ, అందులో 250 పీహెచ్‌డీ చేసిన నిరుద్యోగుల నుంచి వచ్చినట్టూ వార్త.  ఈ పరిస్థితి దేనికి సంకే తం? మన ఆర్థికవ్యవస్థ అనారోగ్యానికా లేక మన విద్యావ్యవస్థ దుస్థితికా లేక రెండింటికా?  
 
 ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కి పరిమితమైన వ్యవహారం కాదు. దేశం అంతటా ఇదే పరిస్థితి. చదువుకు తగిన ఉద్యోగం రాదు. చదివినంత మాత్రాన ఉద్యో గానికి అవసరమైన మెలకువలు తెలియవు. చదువు వేరు. ఉద్యోగం వేరు. బతుకుతెరువు నేర్పే చదువులు చెప్పడం లేదు. ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్‌డీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? పీహెచ్‌డీ చేసినవారికి ఉద్యో గాలు ఎందుకు రాలేదు? పొట్టనింపని పీహెచ్‌డీ విలువ ఏపాటిది? దాదాపు మూడు దశాబ్దాలుగా సగటున ఏటా ఆరు శాతం స్థూల జాతీయ ఉత్పత్తి పెరు గుదల నమోదు చేసుకుంటూ వచ్చిన దేశంలో ఉద్యోగాల సృష్టి గణనీయంగానే జరుగుతోంది. తగిన అభ్యర్థులు లభించని కారణంగా కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఒక విచిత్రమైన స్థితి. పీహెచ్‌డీ చేసిన నిరుద్యోగులు ఒక వైపు, అర్హులు లేని కారణంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మరో వైపు. ఉద్యో గాలకు పనికి వచ్చే చదువులు (ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్) నేర్పాలనే ఇంగి తాన్ని మన విధాన నిర్ణేతలు పాటించని ఫలితం ఈ విషాదం.
 
 ఉబుసుపోక పీహెచ్‌డీ
 పట్టా తీసుకున్న తర్వాత ఉద్యోగం దొరకని యువకుడు లేదా యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, అప్పటికీ ఉద్యోగం రాకపోతే ఊరకనే ఉండటం ఎందుకని పీహెచ్‌డీకి రిజిస్టర్ చేయించుకోవడం, సమాజానికి ఎటువంటి సంబంధం కానీ ప్రయోజనం కానీ లేని అల్పమైన విషయంపైన పరిశోధన చేయడం, గైడు సహాయంతోనో, అధ్యాపకుల సహకారంతోనో థీసిస్ రాయ డం, పీహెచ్‌డీ పుచ్చుకోవడం మన దేశంలో రివాజు. పెద్దగా శ్రమించకుండానే పీహెచ్‌డీ పట్టా చేతికి వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, పీహెచ్‌డీ పూర్తయ్యేనాటికీ తేడా ఏమిటి? వయస్సు పెరుగుతుంది కానీ జ్ఞానం అంతగా పెరగదు. ఉద్యోగాలకు వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. ఉత్తీర్ణులు కారు. ఇంటర్వ్యూలలో ఎంపిక కారు. ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నదని తెలిసినా తమ చదువుతో, అర్హతతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసు కుంటారు. ప్యూను ఉద్యోగమైనా అది ప్రభుత్వ ఉద్యోగం కనుక పరవాలేదను కుంటారు. అమెరికాలో కానీ యూరప్‌లో కానీ ఒక విద్యార్థి చేతికి పీహెచ్‌డీ పట్టా రావాలంటే అయిదేళ్ళ కఠోర పరిశ్రమ చేయాలి.
 
  ప్రవీణుల బృందం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తమ థీసిస్‌లో రాసిన అంశాలనూ, చేసిన నిర్ధారణలనూ సమర్థించుకోవాలి. అటువంటి పరిశోధనలను ప్రభు త్వాలు విధాన నిర్ణాయక క్రమంలో  పరిశీలనాంశాలుగా స్వీకరిస్తాయి. పీహెచ్‌డీ పూర్తి కాగానే అధ్యాపకులుగానో, శాస్త్రజ్ఞులుగానో ఉద్యోగాలలో చేరతారు. పరిశ్రమలకూ, విద్యాసంస్థలకూ మధ్య అనుసంధానం మన దేశంలో తక్కువ. పరిశ్రమల అవసరాలకు తగిన ప్రవీణులను విద్యాసంస్థలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.
 
 అందుకే ఎల్ అండ్ టీ వంటి సంస్థలు తమ సిబ్బందిని తయారు చేసుకోవడానికి స్వయంగా శిక్షణసంస్థలు నిర్వహిస్తున్నాయి. మీడి యా సంస్థలు సైతం విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే పట్టాలపట్ల విశ్వాసం లేక ప్రవేశ పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి ఆరు మాసాలకు తగ్గకుండా మీడియా మెలకువలలో శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగంలో పెట్టుకుంటు న్నాయి. ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలే కాదు ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా ప్రమాణాలు అంతంత మాత్రమే. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ‘యాస్పైరింగ్ మైండ్స్’ అనే సంస్థ విద్యార్థుల యోగ్యతలపైన ఒక అధ్యయనం చేసింది. ఇందుకోసం 55,000 మంది ఇంజనీరింగ్ పట్టభదులను ప్రశ్నించింది. వారిలో మూడు శాతం మందికి మాత్రమే ఐటీ సంస్థలలో ఉద్యోగాలు పొందే అర్హత ఉన్నదని నిర్ధారించింది.
 
  17 శాతం మందికి కనీసమైన ప్రావీణ్యం లేదు. 92 శాతం మందికి ప్రోగ్రామింగ్‌లో ప్రవేశం లేదు. 78 శాతం మందికి ఇంగ్లీ షులో భావవ్యక్తీకరణ సమస్య. 56 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యం (ఎనలిటికల్ స్కిల్స్) లేదు.  ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ దేశంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించు కుంటున్నారు. అమెరికాలోనో, యూరప్‌లోనో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికి కొంత ప్రావీణ్యం అబ్బుతుంది. స్వతహాగా తెలివితేటలు ఉండటం వల్ల వారు విదేశాలలో ఉద్యోగాలలో రాణిస్తున్నారు. అటువంటివారిని చూపించి ‘భారత యువతీయువకులలాగా మీరు కూడా సాంకేతిక ప్రావీణ్యం సంపాదించుకో వాలి’ అంటూ అమెరికా యువతకు బరాక్ ఒబామా ఉద్బోధిస్తూ ఉంటారు.
 
 విద్యే ఉపాధికి సోపానం
 తీరం దాటి అంతర్జాతీయ వేదికపైన పోటీలో నిలిచి గెలుస్తున్నవారికంటే దేశం లోనే నిరుద్యోగులుగా కునారిల్లుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య చాలా రెట్లు అధికం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కళాశాలలు లేని చోట్ల కూడా ఇంజనీరింగ్ కళాశాలలను వేలంవెర్రిగా ప్రోత్సహించి లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసి వీధులలోకి వదిలిన తర్వాత ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నా దర ఖాస్తుదారులలో సగానికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. కాలక్రమంలో విద్య ఉపాధికి సోపానం అన్న దృక్పథం జన సామాన్యంలో బలపడింది. ప్రతి కుటుంబం తన ఆదాయంలో 7.5 శాతం విద్యపైన ఖర్చు చేస్తున్నది.
 
 ఇది ఇతర ‘బ్రిక్స్’ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో కంటే అధికం. ఆదాయం పెరగడం, వెనకబడినవర్గాల విద్యా ర్థుల ఫీజు ప్రభుత్వాలు చెల్లించడం కారణంగా ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులైన వారిలో 2004లో 11 శాతం మంది ఉన్నత విద్యాసంస్థలలో చేరగా 2014 నాటికి 23 శాతం మంది చేరారు. విద్యాహక్కు చట్టం ఫలితంగా అక్షరాస్యత 1991లో 54 శాతం నుంచి 2014 నాటికి 74 శాతానికి పెరిగింది. ఈ దశాబ్దం చివరికి మన దేశంలో 25 నుంచి 34 సంవత్సరాలలోపు వయస్సు గల పట్టభద్రులు 2.40 కోట్ల మంది ఉంటారు. ఇది ప్రపంచంలోని పట్టభద్రులలో 12 శాతం. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన యువకులు ఇంజనీరింగ్ చదివిన తర్వాత వ్యవసాయ పనులలో పాల్గొనకుండా, ఉద్యోగం లేకుండా రికామిగా మిగిలిపోయి అటు కుటుంబానికీ, ఇటు సమాజానికీ సమస్యగా పరిణమిస్తు న్నారు.
 
  మన విద్యావిధానంపైనా, విద్యాసంస్థల ప్రమాణాలపైనా, ఇంజనీరింగ్ పట్టభద్రుల ప్రావీణ్యరాహిత్యంపైనా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేయడం ఈ నేపథ్యంలోనే. మొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థ లలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధన లేదు. ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబి తాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు. ఇంత పెద్ద దేశం,  2050 నాటికి అమె రికా, చైనాల సరసన నిలుస్తుందని ప్రవీణులు అంచనా వేస్తున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచస్థాయి విద్యాసంస్థను ఒక్కదానిని కూడా నెలకొల్పలేకపోవడం ఘోర మైన వైఫల్యం. ఇందుకు సమాజాన్నీ, ఇంతకాలం దేశాన్ని ఏలిన రాజకీయ పార్టీలనూ నిందించాలి.
 
 విపణి నియంత్రించే ఆర్థిక వ్యవస్థ (మార్కెట్ ఎకానమీ) ఉన్న దేశాలలో సైతం ప్రాథమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉంటాయి. ఉన్నత విద్య మాత్రం ప్రైవేటురంగంలో ఉంటుంది. మన దేశంలో ప్రాథమిక, ఉన్నత అన్న తేడా లేకుండా ఆరోగ్య, విద్యారంగాల నుంచి ప్రభుత్వం క్రమంగా నిష్ర్క మించింది. ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారిలో 60 శాతం మంది ప్రైవేటు విద్యాసంస్థలలోనే చదువుతున్నారు. దేశంలోని 14 లక్షల విద్యాసం స్థలలో అయిదు లక్షల సంస్థలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి.
 
 మూడు కోట్ల మంది విద్యార్థులు ఈ సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలూ,  విశ్వవిద్యాలయాలూ కొన్ని ఫక్తు వ్యాపార సరళిలో నడుస్తున్నప్పటికీ, కొన్ని మాత్రం విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు అంకితభావంతో కృషి చేస్తు న్నాయి. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ పేరుతో నెలకొల్పిన విశ్వ విద్యాలయం, హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడి పేరు మీద స్థాపించిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, ఉక్కు పారిశ్రామికవేత్త జిందాల్ పేరుతో వెలసిన యూనివ ర్సిటీ, ఢిల్లీలోని అశోకా యూనివర్సిటీ ఈ కోవలోకి వస్తాయి. అయిదారేళ్ళలో వీటిలో కొన్ని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా పరిగణన పొందే అవకాశం ఉంది.
 
  కొన్ని విశ్వవిద్యాలయాలు మంచి పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలతో పొత్తు పెట్టుకున్నాయి. ఐటీ, మేనేజ్‌మెంట్ విద్యలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉన్నతమైన సేవలు అందిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్‌కు ఈ ఏడాది కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ సంస్థ 62 లక్షల మందికి వివిధ రంగాలలో ఉద్యోగాలకు అవసర మైన శిక్షణ ఇస్తుంది. విద్యకు పౌరులు ఇస్తున్న ప్రాధాన్యం ప్రభుత్వాలు ఇవ్వక పోవడం మన దౌర్భాగ్యం. విద్యావిధానంలో చీటికీమాటికీ మార్పులు తీసుకు రావడం, ప్రమాణాల విషయంలో పట్టింపు లేకపోవడం, అధ్యాపకుల పని తీరును సమీక్షించాలన్న నియమంలేకపోవడం, విద్యార్థులకు నియమావళి లేక పోవడం మన విద్యావ్యవస్థను వేధిస్తున్న ప్రధానమైన సమస్యలు.
 
 అపారమైన అవకాశాలు
 ఆర్థికాభివృద్ధికీ, పరిశ్రమల విస్తరణకూ అవసరమైన నైపుణ్యం ప్రసాదించే విద్యాసంస్థలకు భవిష్యత్తు ఉంది. ప్రముఖ శాస్త్రజ్ఞుడు రఘునాథ్ ఎ మషేల్కర్ (ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ మాజీ అధ్యక్షడు) అన్నట్టు మన దేశంలోని వనరులను విజ్ఞతతో వినియోగించుకోగలిగితే మరో పదేళ్ళలో మన దేశం ప్రపంచంలోనే మేటి విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందగలదు. విద్యారంగంలో అవసరమైన సంస్కరణలు అమలు చేస్తూ, అధ్యాపకులకు మంచి జీతాలు ఇస్తూ, పరిశోధనకు పెద్దపీట వేసినట్లయితే దేశంలో ఉన్న అపారమైన అభివృద్ధి అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవచ్చు.
 
మరో రెండు దశాబ్దా లలో ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశంగా ఇండియా చైనాను అధిగ మించబోతోంది. ఆర్థికంగా కూడా చైనాను అధిగమించాలన్నా లేదా కనీసం చైనా సరసన సగర్వంగా నిలవాలన్నా శాస్త్ర, సాంకేతిక విద్యావ్యవస్థను పెంపొం దించుకోవాలి. అటు పారిశ్రామిక, సేవా రంగాలకూ, ఇటు విద్యారంగానికి మధ్య అనుసంధానం సాధించాలి. అప్పుడు పీహెచ్‌డీ డిగ్రీలు అంత తేలికగా చేతికి అందవు. పీహెచ్‌డీ నిజంగా చేసినవారికీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికీ ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవలసిన దుస్థితి ఉండదు. చదువు సార్థకం అవుతుంది.

 - కె.రామచంద్రమూర్తి
సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement