విస్మృత మానవ సంవేదనల చరిత్ర | Human resources of history of explorer | Sakshi
Sakshi News home page

విస్మృత మానవ సంవేదనల చరిత్ర

Published Sun, Oct 11 2015 5:00 AM | Last Updated on Mon, Aug 13 2018 7:57 PM

విస్మృత మానవ సంవేదనల చరిత్ర - Sakshi

విస్మృత మానవ సంవేదనల చరిత్ర

వాస్తవ సంఘటనల్ని నమోదు చేసే శుష్కమైన చరిత్ర కంటే, ఆ సంఘటనల బారినపడ్డ అసంఖ్యాక మానవ సంవేదనల్నీ, భావోద్వేగాల్నీ తెలుసుకునేందుకే స్వెత్లానా అలెక్జీవిచ్ 30-40 ఏళ్లుగా విలేకరి కళ్లతో, రచయిత్రి హృదయంతో ప్రయత్నిస్తోంది. భయంకరమైన యుద్ధాల్లో పాల్గొన్న కుటుంబాల విషాదాలు, ఊహించని దుర్ఘటనలకు ఆహుతైన కుటుంబాల ఆక్రందనలు, ప్రభుత్వాల దమననీతికి బలైపోయినవారి బాధలు కొన్నాళ్లకు ఎవరికీ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోతాయి. అదిగో, అటువంటివారిని వెతికి, కలుసుకుని, వారి మాటల్లోనే కళ్లకు కట్టినట్టు వినిపిస్తున్న సాహసి 67 ఏళ్ల పరిశోధనాత్మక పాత్రికేయురాలు స్వెత్లానా అలెక్జీవిచ్.వాస్తవ సంఘటనల్ని నమోదు చేసే శుష్కమైన చరిత్ర కంటే, ఆ సంఘటనల బారినపడ్డ అసంఖ్యాక మానవ సంవేదనల్నీ, భావోద్వేగాల్నీ తెలుసుకునేందుకే ఆమె 30-40 ఏళ్లుగా విలేకరి కళ్లతో, రచయిత్రి హృదయంతో ప్రయత్నిస్తోంది.
 
 అందుకే 2015 సాహిత్య నోబెల్ పురస్కారం ఊహించినట్టుగానే ఆమెకే దక్కింది. స్వెత్లానాకు నోబెల్ ప్రకటిస్తూ, ‘విభిన్న స్వరాలతో ఆమె రచనలు సమకాలీన ప్రపంచంలోని బాధల్నీ, సాహసాల్నీ వినిపిస్తాయి’ అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. 1901 నుండీ ఇప్పటివరకూ ఈ బహుమతి పొందిన 112 మందిలో, రష్యన్ భాషలో రాసి ఈ బహుమతి పొందినవారిలో స్వెత్లానా ఆరవవారు, మహిళల్లో 14వ వారు, బెలారస్ నుండి మొదటివారు. కాల్పనికేతర సాహిత్యానికి నోబెల్ రావడం ఇది మూడోసారి. అంతకుముందు విన్‌స్టన్ చర్చిల్‌కూ, బెర్ట్రాండ్ రస్సెల్‌కూ వచ్చినా, పత్రికా శైలి రచనలకు బహుమతి రావడం ఇదే మొదటిసారి!
 
 స్వెత్లానా అలెక్జీవిచ్ ఉక్రెయిన్‌లో జన్మించింది (31 మే 1948). తండ్రి బెలారసియన్, తల్లి ఉక్రెయిన్ జాతీయురాలు. స్వెత్లానాను బెలారసియన్ రచయితలు అలెస్ ఆడమోవిచ్, డేనీల్ గ్రానిన్ రచనలు అత్యంత ప్రభావితం చేసాయి. ముఖ్యంగా ఆడమోవిచ్ రచనలు ఒక కొత్త ప్రక్రియకు నాంది పలికాయి. ఏమని పిలవాలో తెలియక దానిని సమష్టి నవల, హరికథల్లాంటి నవల, నిదర్శనాయుత నవల, తమ గురించి తామే మాట్లాడుకునే నవల, ఐతిహాసిక బృందగానంలాంటి పేర్లతో పిలుచుకునేవారు. ఆడమోవిచ్ తన గురువు అని ఆ ప్రక్రియను అనుసరించిన స్వెత్లానా అనేకమార్లు చెప్పుకుంది.
 
 ‘నేను వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రక్రియకోసం చూసేదాన్ని. ఎందుకో వాస్తవం నన్ను అయస్కాంతంలా ఆకర్షించి, చిత్రహింసలు పెట్టి, నన్ను లోబర్చుకుంది. దానిని కాగితం మీద పెట్టే ప్రయత్నం చేసేదాన్ని. అది ప్రజల గొంతుకలో సాక్ష్యాలుగా, ప్రమాణ పత్రాలుగా బయటకొచ్చేది. నిజానికి నేను ప్రపంచాన్ని అలాగే వినేదాన్ని, చూసేదాన్ని. అది వారి వైయక్తిక స్వరాల పల్లవిలా, దినవారీ వివరాల దృశ్య రూపకల్పనలా తయారయేది. అలానే నా కన్ను చెవి పనిచేసేవి. నాలోని మానసిక భావోద్వేగ శక్తి పూర్తిగా నాకు తెలియకుండానే బయటకొచ్చేది. ఏకకాలంలో రచయిత్రిగా, విలేకరిగా, సమాజ శాస్త్రవేత్తగా, మనస్తత్వవేత్తగా, బోధకురాలుగా కూడా నన్ను నిలబెట్టాయి’ అని తన రచనల ప్రభావాన్ని స్వెత్లానా చెప్పుకుంది. స్వెత్లానా మొదటిపుస్తకం I've Left My Village ఆమెను సోవియట్ వ్యతిరేకిగా నిలబెట్టింది. స్టాలిన్ విధానాల మూలంగా గ్రామాలు వదిలి, చలి శిబిరాలలో ఉండి, సరైన ఆహారం దొరకక మృతిచెందిన రైతు కుటుంబాల దీనగాథలవి.
 
 War's Unwomanly Face పుస్తకాన్ని 1983లో ఆమె పూర్తిచేయగలిగింది. అయితే, రెండేళ్లపాటు ప్రచురణకర్తల దగ్గరే ఆగిపోయింది. యుద్ధవ్యతిరేకిగా, ప్రాకృతికవాదిగా, సోవియట్ మహిళల్ని ప్రశంసించలేనిదానిగా ఆమెను నిందించారు. ఆ నిందల మూలంగా బెలారసియన్ కేంద్ర కమ్యూనిస్ట్ సంఘం ఒత్తిడితో ఆ పుస్తకం ధ్వంసం చేయబడింది. మిఖైల్ గోర్బచెవ్ వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చి, 1985లో ఆ పుస్తకం మిన్స్క్‌లోనూ మాస్కోలోనూ ఒకేమారు వెలుగు చూసింది. అనేక ప్రచురణలకు నోచుకుని 20 లక్షల ప్రతుల వరకూ అమ్ముడయింది. పది లక్షలకు పైగా సోవియట్ స్త్రీలు, రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీ నాజీ సైన్యాన్ని ఎదురించి, అన్ని రంగాల్లోనూ యుద్ధంలో దూసుకువెళ్లారు. వారంతా 15-30 ఏళ్ల మధ్యనున్న మహిళలు. అయితే యుద్ధంలో జయించాక వారి పాత్ర ఎక్కడా నమోదు కాలేదు సరికదా, వారి పాత్రే లేనట్టుగా వారిని విస్మరించారు. ఆమె తర్వాతి పుస్తకం The Last Witnesses: 100 Unchildlike Stories కూడా 1983లోనే వెలువడింది. యుద్ధ స్మృతులుగా మిగిలిన 7-12 ఏళ్ల మధ్య పిల్లలు వారి అమాయక కళ్లతో చెప్పిన గాథలవి.
 
 1989లో స్వెత్లానా The Boys in Zinc వచ్చింది. తగరం శవపేటికల్లో అఫ్గానిస్తాన్ యుద్ధంలో మరణించిన సోవియట్ సైనికుల్ని పంపేవారని, పుస్తకానికి ఆ పేరు పెట్టింది. 1979-89 వరకూ పదేళ్లపాటు సోవియట్ ప్రజలకు దాచిన, కొన్ని వేలమంది రష్యన్లు మరణించిన సోవియట్-అఫ్గాన్ యుద్ధం ఆ పుస్తకానికి భూమిక. సైనికుల తల్లుల, వితంతువుల, అనాథల, బలిపశువులైన అధికారుల కథలవి. పుస్తకం విడుదలయ్యాక ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మిన్స్క్ కోర్టులో చర్యలు మొదలయ్యాయి. అయితే ప్రజాస్వామ్యవాదులు ఆమెకు దన్నుగా నిలవడంతో ఆ వ్యాజ్యం మూసేయబడింది.
 
 కూలిపోయిన సోవియట్ సామ్రాజ్య మూలంగా, ఆ మార్పుని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారి కథనాలుగా Enchanted with Death 1993లో వెలువడింది. 1997లో వచ్చిన స్వెత్లానా Voices from Chernobyl: The Oral History of a Nuclear Disaster 1986లో జరిగిన చెర్నోబిల్ అణుప్రమాదం కంటే, ఆ ప్రమాద మూలంగా సంభవించిన పరిస్థితుల మీద రాసింది. దానిని మూడవ ప్రపంచ యుద్ధమంత భయంకర అణుయుద్ధంగా ఆమె అభివర్ణించింది. ఉక్రెయిన్‌లో 1986లో జరిగిన చెర్నోబిల్ అణువిధ్వంసంలో తన సొంత చెల్లి చనిపోయింది. తల్లి గుడ్డిదయింది.స్వెత్లానా పుస్తకాలు భారతదేశంతో సహా 19 దేశాలలో ప్రచురించబడ్డాయి. కనీసం ఐదు పుస్తకాలు ఇప్పటికే ఆంగ్లంలో అనువాదమయ్యాయి. 21 డాక్యుమెంటరీలకు, అనేకచోట్ల ప్రదర్శించబడ్డ మూడు నాటకాలకు ఆమెనే రచయిత్రి.
 
 The Wonderful Deer of the Eternal Hunt పుస్తకాన్ని పూర్తిచేసే పనిలో స్వెత్లానా ప్రస్తుతం ఉంది. ఆమె ఇతర రచనలన్నింటికీ భిన్నంగా ఇవి వివిధ తరాల మధ్య వ్యక్తిగత ప్రేమకథలు. ఆనందాన్ని పొందే క్రమంలో ఒక వందమంది స్త్రీ పురుషుల వైఫల్యాల కథల సంకలనం ఇది.
 
 ‘నా అన్ని పుస్తకాలకూ, ఒక్కో పుస్తకానికీ కనీసం నాలుగైదు సంవత్సరాలు పట్టింది. వాయిస్ ఆఫ్ చెర్నోబిల్‌కి మాత్రం పదేళ్లకు పైన పట్టింది. ఆ పదేళ్లలో 500-700 మందితో భేటీ అయ్యాను. చివరికి 107 మందినే అందులో చేర్చగలిగాను. అంటే దాదాపు ఐదుగురిలో ఒక్కరిని మాత్రం. అందులో ఒక్కొక్కరిదీ ఒక్కోమారు నాలుగు కంటే ఎక్కువ టేపుల్లో రికార్డు చేసాను. అవే అచ్చులో 100-150 పేజీల విషయాలుండేవి. అందులో ధ్వని, సారాంశం బట్టి, అరపేజీ నుండి పది పేజీల కథనం తయారుచేసుకునేదాన్ని. ఇదే పద్ధతి నా అన్ని పుస్తకాలకూ అనుసరించాను’ అని తన రచనా విధానాన్ని స్వెత్లానా చెప్పుకుంది. ఆమె రచనలు స్వరకల్పనలో బ్రహ్మాండమైన బృందగానంలా ఉంటాయి. అయితే ఆ బృందగానం ఎక్కడో దూరం నుంచి స్పష్టంగా వినిపిస్తుంటుంది.
 - ముకుంద రామారావు
     9908347273

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement