పదేళ్లూ యూటీగానే హైదరాబాద్
పార్లమెంట్‌లో ఏం జరిగింది -15
(ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20.02. 2014 నాటి రాజ్యసభ కార్య క్రమాల వివరాలివి. ఆరోజు చిరంజీవి చేసిన ప్రసంగంలోని తదుపరి భాగం.)
డిప్యూటీ చైర్మన్: నన్ను రూలింగ్ ఇవ్వనివ్వండి. చిరంజీవిగారూ! కూర్చోండి. నా తీర్పు చెప్పనివ్వండి.
వెంకయ్యనాయుడు: సార్, మీ రూలింగ్ ఇచ్చే ముందు.. ఒక్క విషయం... నా మిత్రుడు నిజాన్ని విప్పి చెప్పినందుకు కృతజ్ఞతలు. ఆయనతో సంప్రదించలేదు. ఆయన మంత్రివర్గ సహచరులతో సంప్రదించలేదు. సీడబ్ల్యూసీ ఎవ్వర్నీ పరిగణనలోకి తీసుకోకుండా, బిల్లు ఎప్పుడొస్తుందో, ఎలా ఉంటుందో చెప్పకుండా చేశారని - ఆయన ఒక్క విషయం తెలుసుకోవాలి. ఆయన నాకు మంచి మిత్రుడు, మంచి నటుడు కూడా.
అంటే, సభలో నటుడు అని కాదు. చిరంజీవిగారు, ఆయన రాష్ట్రంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన నటుల్లో ఒకరని చెప్పక తప్పదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నేను ఈ పార్లమెంట్‌లో అనేక సంవత్సరాలుగా సభ్యుణ్ణి. మంత్రిమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి మాట్లాడకూడదని అనేకసార్లు రూలింగ్ చెప్పారు.
నిర్ణయం ఆయనకు ఇష్టం లేకపోతే మంత్రి మండలిలో ఉండకూడదు. మంత్రిమండలిలో కొనసాగా లంటే నిర్ణయాన్ని ఒప్పుకోవాలి. నిర్ణయం మీద తన అసమ్మతి తెలియజేయాలంటే మంత్రివర్గ సమావేశంలో తెలియజేయాలి. లేదా మీ పార్టీ మీటింగ్‌లో చెప్పాలి. రాజ్యసభలో మాట్లాడకూడదు. మాకు మార్గదర్శకంగా రూలింగ్ ఇవ్వవల్సిందిగా చైర్మన్‌గారిని కోరుతున్నా.
డిప్యూటీ చైర్మన్: నన్ను రూలింగ్ ఇవ్వనివ్వండి. మొట్టమొదటగా, అధికార పక్షం తరఫున ఎవరు మాట్లా డాలో నిర్ణయించేది వారే. ఆ విషయంలో అధ్యక్షస్థానం ప్రమేయమే ఉండదు. రెండవది, మంత్రిగానీ సభ్యుడు గానీ ఏం మాట్లాడాలో వారి నిర్ణయం. ఇలా మాట్లాడా లని అధ్యక్షులు చెప్పడానికి కుదరదు. మూడవది, గవర్నమెంట్‌లో ఉంటూ గవర్నమెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చా? ఇది సభ్యుడి నైతిక విచక్షణకు చెందిన విషయం. చిరంజీవిగారూ! మీరు కొనసాగించండి.
చిరంజీవి: కృతజ్ఞతలు. నాయుడుగారు నేను తెర మీదే కాని ఇక్కడ నటుడ్ని కాదు అన్నారు. దానిని ఒక అభినందన సర్టిఫికెట్‌గా భావిస్తున్నా. నేను ఎవరి తర ఫున మాట్లాడుతున్నాననేగా ప్రశ్న... నేను గాయపడిన ప్రజల తరఫున మాట్లాడుతున్నా. మనమందరమూ ప్రజాప్రతినిధులం. ప్రజల ఆవేదన వ్యక్తం చేయాలి.
డిప్యూటీ చైర్మన్: ఇక ముగించండి.
చిరంజీవి: ముగిస్తున్నా! గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఐటీ రంగంలోగానీ, వైద్య సినిమా రంగంలోగానీ, అభివృద్ధి జరిగిందంటే అది సీమాంధ్ర ప్రజల సహకారం వల్లనే. అందుకే హైదరాబాద్‌ను యూటీ చేయమంటున్నాం. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి రాజధాని అనే పదానికి అర్థమేమిటో నాకు తెలియదు. ఉమ్మడి రాజధాని అంటే యూటీ అయ్యుండాలి. అప్పుడే రెండు ప్రభుత్వాలు పనిచేసే అవకాశం ఉంటుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కూర్చొని పరిపాలన చేస్తారు.
డిప్యూటీ చైర్మన్: ముగించండి.
చిరంజీవి: చండీగఢ్ లాగే హైదరాబాద్‌ను యూటీ చెయ్యాలి. హైదరాబాద్ విద్యా ఉపాధి రంగాలకి జీవన రేఖ లాంటిది. ప్రజలు భౌతికంగా, ఉద్వేగపరంగా హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నారు. అందుకే నేను యూటీ చెయ్యమంటున్నా. కాని మనం ఉమ్మడి రాజ ధాని అని అంటున్నాం. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని మనందరికీ తెలుసు.
డిప్యూటీ చైర్మన్: ముగించండి - దయచేసి.
చిరంజీవి: అయిపోయింది. సార్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మర్యాద కాపాడండి. వారి హక్కుల్ని కాలరాయకండి. అందుకే నేను యూటీ అడుగుతున్నా. కనీసం ఆ పదేళ్లూ, ఆ మానసిక సౌకర్యం, ఇది నాది అనే భావన కల్పించాలి. గర్వంగా జీవించగలగాలి. సీమాంధ్ర నిర్మాణం జరిగి, అవకాశాలు పెంచుకున్న తర్వాత, అది తెలంగాణలో భాగమైపోతుంది. దయచేసి బిల్లులో ఈ సవరణ తీసుకురావాలని కోరుతున్నా. అలాగే బాగా వెనకబడ్డ కర్నూలు, అనంతపూర్ జిల్లాలను తెలంగాణలో కలిపితే, వారి తీవ్రమైన నీటి సమస్య కూడా పరిష్కరించబడుతుంది. అలాగే పోలవరం చాలా ముఖ్యమైనది.
మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు. పోలవరం ఏ ఇబ్బందులూ లేకుండా పూర్తి కావాలని నేను అనేకసార్లు కోరాను. కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని పూర్తి చేయాలి. ముంపుకు గురయ్యే గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే, ఆటంకాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక ఆస్తులు, అప్పులూ నిష్పత్తి ప్రకారం పంచాలి. సీమాంధ్రకు ఎదురయ్యే లోటు భర్తీకి ఏర్పాటు చేయాలి. ఈ లోటు భర్తీకి ఆర్థిక ప్యాకేజీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి.
పదేళ్లపాటు పన్ను రాయితీలు, మినహా యింపులు ఇస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్యాకేజీ ఇవ్వాలి. మంత్రిగారిక్కడే ఉన్నారు. వారు దయతో ఈ ప్రాంత అభివృద్ధిని ఆశీర్వదించాలి. అందరికీ సమాన న్యాయం కలగాలని కోరుకుంటూ, ఈ సవరణలు చేయకుండా ఈ బిల్లు పాస్ కాకూడదని గట్టిగా కోరుకుంటున్నాను. థాంక్యూ.
డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు కుమారి మాయావతి...
మాయావతి: ఉప సభాపతి గారూ! దక్షిణ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్ప ర్చటం ఆనందదాయకం.
... అంతరాయం...
డిప్యూటీ చైర్మన్: మహిళను గౌరవించండి.. దయ చేసి ఇలా చేయకండి. గౌరవనీయులైన మహిళా సభ్యురాలు..
మాయావతి: మా పార్టీ దీనిని సమర్థిస్తోంది.
డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యు లను ఉద్దేశించి) అలా చెయ్యవద్దు.. సహకరించండి.
మాయావతి: ఆఖరుగా నిర్ణయం...
డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యు లను ఉద్దేశించి) ఇలా చేయకండి.. తృణమూల్ కాంగ్రెస్ ఒక మహిళ నాయకత్వంలోని పార్టీ.. మీరు సీనియర్ సభ్యులు...
మాయావతి: ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు తెచ్చారు.. ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలు చేయబడుతోంది.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com