హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని లేదా యూటీగా ఉంచాలి: చిరంజీవి
- రాజీనామాలతో ప్రయోజనం లేదని భావించాం: శీలం
- కార్యాచరణపై ఢిల్లీలో సీమంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని అలాకని పక్షంలో ఢిల్లీ తరహాలోగానీ ఉంచాలని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర కేంద్రమంత్రులతో కలిసి దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటన ప్రకారం.. కేబినెట్‌లో పెట్టబోయే బిల్లు కేవలం ‘తెలంగాణ విభజన పక్రియ మొద లుపెడతాం’ అని మాత్రమే ఉంటుంది. అంతేకానీ తుది నిర్ణయం కానీ, మిగతా అంశాలు ఎలా ఉంటాయన్న దానిపై నిర్ణయం ఉండదు. తుది బిల్లుకు ఇంకా సమయం ఉంది. అప్పుడు అందరితో చర్చిస్తారు..’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించే అవకాశముందా?’ అన్న ప్రశ్నకు ‘‘ఖచ్చితంగా ఉంది.. మా ప్రయత్నాలన్నీ ఆ దిశగానే జరుగుతున్నాయి’’ అని బదులిచ్చారు. ‘‘సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను దిగ్విజయ్‌సింగ్‌కు వివరించాం. విద్యార్థులు, రైతులు, ఎన్జీవోలు, ఉపాధి అవకాశాలు తదితర సమస్యలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేసి, పని చేసేలా చూడాలని కోరాం’’ అని జె.డి.శీలం తెలిపారు.
దిగ్విజయ్‌ను కలవటానికి ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 8 మంది కేంద్రమంత్రులు పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమై తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అస్వస్థతతో ఉన్న కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మినహా మిగిలిన మంత్రులు - ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి ఈ భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభ జన విధివిధానాలు ఇంకా ఖరారు కానందున ఈ దశలో తాము మంత్రి పదవులకు రాజీనామాలు చేయటం వల్ల ఫలితముండదన్న అభిప్రాయంతో ఉన్నామని భేటీ అనంతరం జె.డి.శీలం మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని అధిష్టానాన్ని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలతో సహా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు చేసిన ఏకగ్రీవ తీర్మానంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, దిగ్విజయ్‌సింగ్‌ను కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. దిగ్విజయ్‌ను కలిసిన తర్వాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ను కూడా కలిశారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోనే ప్రధాని మన్మోహన్‌ను కలిసేందుకు అనుమతి కోరారు.