హైదరాబాద్ను యూటీ చేస్తే అగ్నిగుండమే
హైదరాబాద్ : హైదరాబాద్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తాము అంగీకరించేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండమే అవుతుందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని దానం తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని దానం తెలిపారు. హైదరాబాద్పై అధిష్టానం పునరాలోచన చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు.
కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నిన్న ఢిల్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనన్నారు.