అపూర్వం, అద్వితీయం! | irrigation policy powerpoint presentation more inspirational process given by KCR | Sakshi
Sakshi News home page

అపూర్వం, అద్వితీయం!

Published Sun, Apr 3 2016 1:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

అపూర్వం, అద్వితీయం! - Sakshi

అపూర్వం, అద్వితీయం!

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సభ్యులందరికీ, ప్రజలందరికీ సుబోధకంగా జలవనరుల విధానాన్ని వివరించడం మనస్ఫూర్తిగా స్వాగతించవలసిన ఆధునిక ప్రక్రియ.
 
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మాదిరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం స్వాప్నికుడు. స్వప్న సాకారం కోసం తుదివరకూ పోరాడే వజ్ర సంకల్పం ఆయనది. అందుకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సారథ్యంలో  పద మూడేళ్లపాటు సాగిన ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదికలైన మూడు అంశాలలో ఒకటి నీరు. తక్కిన రెండు: నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణలోనే ఖర్చవుతాయి కనుక నిధులు దారి మళ్లుతున్నాయన్న బాధ లేదు. నియామకాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెలకొల్పిన తర్వాత పద్ధతి ప్రకారం నియామకాలు జరుగుతాయన్న విశ్వాసం కలిగింది. గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు జరుగుతున్న సన్నాహాలు యువతలో ఆశలు నింపుతున్నాయి.
 
 గురువారంనాడు శాసనసభలో కేసీఆర్ ఆవిష్కరించిన జలదృశ్యం తెలం గాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయాలు జరిగినట్టు చెబుతూనే పాత ప్రభుత్వాలు డిజైన్ చేసిన ప్రాజెక్టులను సవరించవలసిన అవసరాన్ని వివరించేం దుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ముఖ్యమంత్రి. పాత ప్రభుత్వాలు రూపొందించిన ప్రాజెక్టుల ఆకృతిని ఎందుకు మార్చవలసి వచ్చిందో, మార్చకపోతే జరిగే నష్టం ఏమిటో, మార్చడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటో సవివరంగా విడమరచి చెప్పారు. ఒక రకంగా ఇది కేసీఆర్ హృదయావిష్కారం. కొన్ని మాసాల కిందట జర్నలిస్టుల అక్రెడిటేషన్ కమిటీ నివేదికను సమర్పించేందుకు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నాతో పాటు మరికొందరు సీనియర్ జర్నలిస్టులకు ఈ పవర్ పాయింట్ ప్రజెం టేషన్‌లో చాలా భాగం చూపించారు.  హరిత తెలంగాణ నిర్మాణం చేయాలన్న తపనతో ఈ అంశంపైన ముఖ్యమంత్రి లోతుగా అధ్యయనం చేస్తున్నారని అప్పుడే అర్థం చేసుకున్నాం.
 
 ధారాళంగా, ప్రస్ఫుటంగా, అద్భుతంగా మాట్లాడటమే కాకుండా సంక్లిష్ట మైన అంశాలను సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పగల శక్తి కేసీఆర్‌కి ఉన్నదనే ది జగద్విదితం. అపారమైన పరిజ్ఞానం, అసాధారణమైన ధారణశక్తి ఆయనది. సుదీర్ఘ ఉద్యమంలో ఆయన తెలంగాణకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలను తనకు తోచిన విధంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటులో కానీ  ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత క్లిష్టమైన సాగునీటి విధానంపైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ (దృశ్య ప్రదర్శన)ను ఒక ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఇదే ప్రథమం. దాదాపు అన్ని తెలుగు న్యూస్ చానళ్లూ ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసి ఉంటారు.
 
 తమ ప్రాంతానికి సాగు నీరు తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం ఎటువంటి వ్యూహం అమలు చేయాలనుకుంటున్నదో అర్థం చేసుకొని ఉంటారు. సాగునీటి విధానాన్ని ఇంత విపులంగా వివరించినందుకు ముఖ్యమంత్రిని అభినందించ వలసిన ప్రతిపక్షాలు ఆక్షేపించడం విడ్డూరం. సభలో ఉండి జలదృశ్యాన్ని తిలకించి ఏమైనా సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా తెలియజేస్తే ప్రజా స్వామ్యబద్ధంగా ఉండేది. ఎంఐఎం, బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, వామపక్ష సభ్యులను ఈ విషయంలో అభినందించాలి. వారు సభలో కూర్చొని సమర్ప ణను తిలకించారు. ప్రశ్నలు అడిగారు. జవాబులు పొందారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కురచ మనస్తత్వాన్ని ప్రదర్శించాయి. చట్టసభల ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందంటూ లేనిపోని రాద్ధాంతం చేయడం అనవసరం. అధిక ప్రసంగం. నిజానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సభ్యులందరికీ, ప్రజలంద రికీ సుబోధకంగా జలవనరుల విధానాన్ని వివరించడం మనస్ఫూర్తిగా స్వాగతించవలసిన ఆధునిక ప్రక్రియ.
 
 పరిష్కారం ప్రధానం
తెలంగాణలో సాగునీటి సౌకర్యం ఉన్న  విస్తీర్ణం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 20 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 19 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నదని చెబుతూ ఈ దుస్థితికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కారకు లంటూ నిందించిన కేసీఆర్ సాగునీటి సౌకర్యం ఉన్న నేల విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు విస్తరించేందుకు తాను సంకల్పించిన ప్రాజెక్టుల వివరాలు జలదృశ్య ప్రదర్శనలో  కళ్లకు కట్టారు. సాధ్యాసాధ్యాల గురించి అనుమానాలు రావడం సహజం. గతానుభవం ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా  మొదలు పెట్టిన 20 వేల సాగునీటి ప్రాజెక్టులలో సగానికి పైగా న్యాయ స్థానా లలో మగ్గుతున్నాయి. తక్కినవాటిలో సగం నిధులు లేక కునారిల్లుతు న్నాయి. పూర్తయిన ప్రాజెక్టులలో సైతం నీరు లేదు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో నీరు అడుగంటింది.
 
 గోదావరి నదిపైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అనేక బ్యారేజీలు నిర్మించిన కారణంగా తెలంగాణకు గోదావరి నీరు వచ్చే ఆశలు ఆవిరైపో యాయి. ప్రాణహిత, ఇంద్రావతి నదులపైనే తెలంగాణ ప్రజలు ఆధారపడవ లసిన పరిస్థితి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆకృతిని మార్చి వేసి, ఆయకట్టును పెంచివేసిన కారణంగా వ్యయం సహజంగానే పెరుగుతుంది. భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలను అనుమానంతో చూసే అలవాటు ఉన్నవారికి వాటిలో అవినీతి పెనుభూతం కనిపిస్తుంది. మొదట ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మడిహెట్టి వద్ద ఆనకట్ట కట్టి, ప్రాణహిత నుంచి నీటిని ఎల్లంపల్లి బ్యారేజీకి ఎక్కించాలనీ, అక్కడి నుంచి దిగువ మానేరు ద్వారా ఆయకట్టుకు నీరందించాలనీ ప్రతిపా దించారు. పునరాకృత (రీడిజైన్డ్) ప్రాజెక్టుల ప్రకారం కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద గోదావరి నుంచి ఎల్లంపల్లికి నీరు మళ్లించాలి. ఎల్లంపల్లి దిగువన ఎత్తిపోతల సామర్థ్యాన్నీ, జలాశయాల విస్తృతినీ, ఆయకట్టునూ పెంచాలని సంకల్పం.
 
 రంగారెడ్డి జిల్లాను మినహాయించి మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలలో ఆయకట్టు పెంచుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రతిపా దించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద 16.4 లక్షల ఎకరాల విస్తీర్ణం ఆయకట్టు కిందికి వస్తుందని భావించారు. కొత్త డిజైన్ కారణంగా ఆయకట్టు 20 లక్షల ఎకరాలకు పెరుగుతుంది. మారిన డిజైన్లూ, పెరిగిన మోటార్ల సంఖ్యా లెక్కలోకి తీసుకుంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 607 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరమని ప్రవీణుల అంచనా. తెలంగాణలో నీరు కావాలంటే ఎత్తిపోతలు అనివార్యం. విద్యుచ్ఛక్తి వినియోగాన్నీ, వ్యయాన్నీ తగ్గించుకోవడానికి ప్రఖ్యాత ఇంజనీరు టి. హనుమంతరావు చేస్తున్న సూచనలు పరిశీలిస్తే మంచిది.
 
 ఈ సందర్భంగా కొన్ని విమర్శలూ, కొన్ని సందేహాలూ వినిపించాయి. తమ్మిడిహెట్టి ఆనకట్ట ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించడం ద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు కేసీఆర్ తాకట్టు పెట్టారన్నది కాంగ్రెస్ పార్టీ విమర్శ. దీన్ని పెద్దగా పట్టించుకోనక్కర లేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే అంతర్రాష్ట్ర వివాదాలలో మునిగితేలు తున్న ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు. వంశధార ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల మధ్య ఏడు దశాబ్దాలుగా నలుగుతోంది. హిరమండలం జలాశ యాన్నీ, కాలువలనీ వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్నప్పటికీ వినియో గించుకోలేని దుస్థితి. ఆదివాసీ గ్రామాలున్న మూడువేల ఎకరాల భూమి ముంపునకు గురి అవుతుందంటూ ప్రాణహిత ప్రాజెక్టుకు మహారాష్ట్ర అడ్డుపెడు తూనే ఉంది. ప్రాణహిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవిస్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ధర్నాలు చేశారు.
 
 అటు వంటి వ్యక్తిని ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించడం విశే షం. తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లకు తగ్గించడం వల్ల నష్టం మూడు టీఎంసీల నీరు మాత్రమేననీ, ఆ కొర వను 180 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయంలో ఎక్కడైనా పూరించు కోవచ్చుననీ, మేడిగడ్డ నుంచి నీరు తీసుకోవచ్చునంటూ టి. హనుమంతరావు వెలిబుచ్చిన  అభిప్రాయం సమంజసమే. మహారాష్ట్రతో పడిన పీటముడి విడిపో యినందుకు సంతోషించాలి. ఇప్పుడు మహారాష్ట్రకు తెలంగాణ ప్రజల ప్రయోజ నాలు తాకట్టు పెట్టారంటూ గొడవ చేస్తున్నవారు ఆల్మట్టి, బాబ్లీ బ్యారేజీలు నిర్మిస్తున్నప్పుడు ఏమిచేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
 
 ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు
జలదృశ్యం ప్రదర్శన ప్రారంభిస్తూ కేసీఆర్ చెప్పిన అంశాలకు ఆంధ్రప్రదేశ్ చెబు తున్న అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణకు 954 టీఎంసీల గోదావరి నీరు, 299 టీఎంసీల కృష్ణ నీరూ, 75 టీఎంసీల వరద  నీరూ కేటాయించారనీ, ఈ వివరాలు కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిం చామనీ కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణకు గోదావరి నీటి కేటాయింపు ఇంత వరకూ జరగలేదంటూ తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎస్‌కె జోషీ జనవరి 24న గోదావరి నది నిర్వాహక మండలికి సమర్పించిన పత్రం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు గుర్తు చేస్తున్నారు.
 
 గోదావరి జలాల కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అంగీకారం కుద రాలి లేదా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండూ జరగలేదు. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టుకు విని యోగించవచ్చునంటూ హైకోర్టు అనుమతించిందని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు తప్పు పడుతున్నారు. కేసీఆర్ పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించారు. గోదావరికి, కృష్ణలకు ఒకేసారి వరదలొస్తూ ఉంటాయి. అలాంటిది గోదావరి వరద నీటిని వరదలో ఉన్న కృష్ణానదికి తరలించే (జలాశయం లేని) ప్రాజెక్టుపైన రూ. 1,600 కోట్లు వృథా చేయడాన్ని కేసీఆర్ మెచ్చుకోవడం ఆశ్చర్యం.
 
 జలదృశ్యం ఒక అపూర్వమైన అనుభవం. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల స్థాయినీ, ఖర్చుల తబ్శీళ్లనూ, సాఫల్యవైఫల్యాలనూ ఆరు మాసాలకు ఒకసారి ఇంతే విపులంగా, గ్రాఫిక్స్, పట్టి కలు, చిత్రాల సహితంగా చట్టసభలలో సమర్పిస్తే  పాలనా వ్యవస్థ చేస్తున్న కృషి గురించి సభ్యులకూ, టీవీలలో సభాకార్యక్రమాలు వీక్షించే సామాన్య ప్రజలకూ తేలికగా అర్థం అవుతుంది.

ప్రసార మాధ్యమాలను సద్వినియోగం చేసుకొని పారదర్శకత పాటించడంలో, ప్రగతికి సంబంధించి ప్రజలకు తాజా సమాచారం అందించడంలో కొత్త పుంతలు తొక్కినట్టు అవుతుంది. రాజకీయ నాయకులకు కొత్త ఒరవడి సృష్టించినట్టు అవుతుంది. అవినీతికి అతీతంగా, ప్రజల ప్రయోజ నాలే పరమావధిగా, జవాబుదారీతనం ప్రదర్శిస్తూ పరిపాలించిన తొలి ముఖ్య మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే సువర్ణావకాశం కేసీఆర్‌కు అందుబాటులో ఉన్నది.
 - కె.రామచంద్రమూర్తి
 సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement