చైనాపై జపాన్ దురాక్రమణ డ్రాగన్ సీడ్
1930వ దశకంలో చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యింటికి పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి.
ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత్రి పెర్ల్ ఎస్. బక్ చైనీయుల గురించి రచించిన గొప్ప నవలలో ప్రసిద్ధి పొందిందీ, ఆమెకు నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టిందీ ‘ద గుడ్ ఎర్త్’(1931). ఆ తరువాత అంత ప్రాచుర్యాన్నీ పొందిన నవల ‘డ్రాగన్ సీడ్’(1942). యీ నవలని హాలీవుడ్ చిత్రంగానూ నిర్మించారు. చిత్రం విజయవంతమైంది.
బక్ 1892లో అమెరికాలో జన్మించినప్పటికీ అనేక కారణాల వల్ల వివిధ దశల్లో చైనాలో చాలాకాలం నివసించారు. వారి జీవితాన్ని దగ్గరగా పరికించారు. చైనీస్ భాషని నేర్చుకున్నారు. అక్కడి గ్రామీణ జీవితంతో ఆమెకు బాగా పరిచయం వున్నది. చివరికి చైనా రాజకీయ విధానాలతో విసుగెత్తి అమెరికా తిరిగి వచ్చారు. రచయిత్రిగా, సంఘసేవకురాలిగా మనుగడ సాగించి 1973లో మరణించారు.
డ్రాగన్ సీడ్ పేరులోనే ప్రత్యేకత వున్నది. చైనా సాంప్రదాయ రీతిలో డ్రాగన్ అనేది దుష్ట జంతువు కాదు. దాన్ని వారు పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. ఆ మాటనే శాంతీ ప్రగతీ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా భావిస్తారు. అటువంటి ‘అంకురం’ యీ నవల్లో కనపడుతుంది.
ఈ దాడి జరిగిన కాలంలో పెర్ల్ బక్ చైనాలో లేదనీ, యీ నవలకు సంబంధించిన ముడి సమాచారాన్ని ఆమె సేకరించి వ్రాసారనే విమర్శలున్నప్పటికీ యిది గొప్ప నవలల కోవకి చెందుతుంది. లైఫ్ మేగజైన్ వారి 1924–44 మధ్య వెలువడిన వంద గొప్ప పుస్తకాల జాబితాలో చోటు సంపాదించుకొంది.
1937లో చైనాను జపాన్ దురాక్రమణ చేసింది. జపాన్ సైనికులు చేసిన మారణహోమాన్ని ‘నాంకింగ్ మానభంగం’ అని చైనా చరిత్రలో పేర్కొంటారు. ఆ దౌర్జన్య కాండే యీ నవలకు నేపథ్యం. దాని ఫలితంగా ఛిన్నాభిన్నమైన అమాయక రైతు కుటుంబమే యీ నవలకు కథావస్తువు. సాటి మానవుడే శత్రువు రూపంలో దానవుడై వినాశనానికీ విధ్వంసానికీ పాల్పడినప్పటికీ దాన్ని తట్టుకొని మరో మానవుడు నిలబడగలడనీ మనగలడనీ యీ నవల ఒక ఆశావాదాన్ని ప్రబోధిస్తున్నది.
వాస్తవ జీవితంలో లాగే నవలలోనూ బహుపాత్రలుంటాయి. కథనం నాంకింగ్ పట్టణానికీ అక్కడికి కాలినడక దూరంగా వున్న వ్యవసాయాధారిత పల్లెకూ మధ్య నడుస్తుంది. చైనీయుల జీవన విధానాన్ని సరళమైన ఇంగ్లిష్ శైలిలో బక్ అద్భుతంగా వర్ణించి విశదీకరిస్తారు.
లింగ్‌టాన్ ఒక చైనీస్ పల్లె రైతు. శత్రువు జీవితాల్ని విచ్ఛిన్నం చేయగలడు; సంపదల్ని కొల్లగొట్టగలడు; కానీ నేలను మాత్రం అపహరించలేడు అన్న ఉద్దేశంతో వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు. అనుకూలవతిౖయెన భార్యా, వ్యవసాయానికి తగిన దృఢ శరీరం గల ముగ్గురు కొడుకులూ, ఆపైన యిద్దరు కుమార్తెలూ, యిద్దరు కోడళ్ళూ వున్నారు. మనుమలున్నారు. పెద్దకుమార్తె భర్తతో పట్నంలో వుంటున్నది. వారికీ పిల్లలున్నారు. సారవంతమైన చైనా నేల వారి కుటుంబానికి జీవనాధారంగా విలసిల్లుతున్నది. అందరూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
1930వ దశకంలో నాటి చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. అసలు వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి. నిరక్షరాస్యత కరడుగట్టి వున్నది. నవలలో ఆ యింటికి ఒక పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది.
జపాన్ వారి దురాక్రమణ చైనా వారి జీవితాల్లో కల్లోలం రేపింది. విమానాల ద్వారా బాంబులు వర్షించాయి. పట్టణాలు నేలమట్టమైనాయి. ఆరువారాల పాటు సైనికుల హింసా కాండ నిరాఘాటంగా కొనసాగింది. చైనా పాలకులు పరారైనారు. వారి సైన్యం చెల్లాచెదురైంది. రెండులక్షల మంది చనిపోయారు. వేలాదిమంది క్షతగాత్రులుగానూ, నిరాశ్రయులుగానూ మిగిలిపోయారు. పల్లెలు ఆక్రమితమైనాయి. జీవనాధారమైన వారి పంటలు నాశనమైనాయి. చైనా భూభాగమే రక్తసిక్తమైంది. వీటన్నిటినీ నవల్లో సందర్భోచితంగా చక్కగా చిత్రించారు రచయిత్రి.
లింగ్‌టాన్ యింట్లో శాంతి భగ్నమైంది. అతడి వృద్ధ వియ్యపురాలూ, కోడలూ మానభంగానికీ హత్యకూ గురైనారు. సైనికులు స్త్రీల శవాలనూ అనుభవించడం మానవ చరిత్రలోనే మాయనిమచ్చగా మిగుల్తుంది. చివరకు స్త్రీలు లభించకపోవడంతో లింగ్‌టాన్ అందమైన చిన్న కొడుకునే మానభంగం చేస్తారు. వాడు సిగ్గుతో యిల్లు వదలి కొండలు పట్టిపోతాడు. భయభ్రాంతులైన ప్రజలు యిళ్ళూవాకిళ్ళూ వదలి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పశ్చిమాన వున్న పర్వత ప్రాంతాలవైపు వలసపోసాగారు. లింగ్‌టాన్ రెండో కొడుకూ కోడలూ వారి వెంట వెళ్ళారు. అంతవరకూ ఐక్యతతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం చెట్టుకో పిట్టగా చెదిరిపోయారు.
వ్యాపారమే పరమావధి కాగా శత్రువుతో కూడా సహజీవనం చెయ్య గల వ్యక్తులకు ప్రతినిధిగా లింగ్‌టాన్ అల్లుడు నిలుస్తాడు. ఆ రోజుల్లోనే చదువుకున్న విప్లవ వనితగా రెండో కోడలు నిలుస్తుంది. ఆమె ముసలి వేషంలో వెళ్లి, విందులో పాల్గొంటున్న శత్రువులకు విషం నింపిన బాతుల్ని అమ్మి వారంతా చనిపోయేటట్టు చెయ్యగలుగుతుంది.
దుఃఖంతో కృంగిపోయిన లింగ్‌టాన్ కుటుంబం ధైర్యాన్ని కూడగట్టుకొని తిరుగుబాటు బాటపట్టింది. గ్రామస్తులు దళాలుగా ఏర్పడి దొరికిన శత్రువుని మట్టుబెట్టడం నేర్చుకున్నారు. తన గ్రామ దళానికి లింగ్‌టాన్ నాయకత్వం వహిస్తున్నాడు. చీమకు కూడా అపకారం చెయ్యని అతడు శత్రువు పట్టుబడితే చాలు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. అతని భార్య కూడా నైతిక బలాన్నిస్తున్నది. అతని కుమారులూ, ఆ గ్రామ యువకులూ కలిసి ఆ యింట్లోనే ఒక నేల మాళిగ ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఆయుధాలు దాచుకున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహించి గెరిల్లా పోరాటాన్ని మొదలుపెట్టారు.
చైనీయుల యీ సై్థర్యమే యీ నవలకు డ్రాగన్ సీడ్ (క్షాత్ర బీజం) అని పేరు పెట్టడానికి కారణమై వుంటుంది. రానున్న రెండో ప్రపంచ యుద్ధపు సంకేతాలు చైనా ప్రజలకు అందుతాయి. తమ శత్రువు (జపనీయులు)కు వారికన్నా బలమైన శత్రువు (అమెరికా, రష్యా) లున్నారని వారు తెలుసుకొని సంబరపడతారు. రైతాంగం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వర్షసూచనలతో నవల ఆశావహంగా ముగుస్తుంది.
యుద్ధం వల్ల కలిగే వినాశనాన్నీ, సైనికుల క్రౌర్యాన్నీ, అకృత్యాల్నీ సరళమైన యింగ్లిష్‌లో బక్ సమర్థవంతంగా చిత్రించారు. ఒక చారిత్రక దుశ్చర్య ఆధారంగా వ్రాసిన యీ నవల విశ్వసాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
(వ్యాసకర్త ‘డ్రాగన్ సీడ్’ నవలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో ఉన్నారు.)