నలుపు మందారాల మాన్యం చెల్క
‘అట్టడుగు వర్గాల నుంచి వచ్చే వారు తమ జీవిత సత్యాలను చిత్రించడం ప్రారంభిస్తారు. అప్పుడు, ఈనాడు మనం చూసి మురిసే సాహిత్యం, పేలపిండిలా గాలిలో కలసిపోతుంది’ అన్న కొడవటిగంటి కుటుంబరావు వ్యాఖ్యకు తదనంతర కాలంలో నిలువుటద్దంలా నిలిచారు బోయ జంగయ్య.
‘అట్టడుగు వర్గాల నుంచి వచ్చే వారు తమ జీవిత సత్యాలను చిత్రించడం ప్రారంభిస్తారు. అప్పుడు, ఈనాడు మనం చూసి మురిసే సాహిత్యం, పేలపిండిలా గాలిలో కలసిపోతుంది’. 1955లో కొడవటిగంటి కుటుంబరావు పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నాటికి బోయ జంగయ్య టీనేజ్‌లోకి ప్రవేశించారు. నల్లగొండ జిల్లా పంతంగి (లింగారెడ్డిగూడెం) గ్రామంలో దళిత కుటుంబంలో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో 1942 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు. కొ.కు పలికిన సాహిత్య పరిణామ క్రమానికి తదనంతర కాలంలో జంగయ్య నిలువుటద్దంలా నిలిచారు. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు. అన్ని ప్రక్రియల్లోనూ ప్రముఖుల అభినందనలనూ, పాఠకుల అభిమానాన్నీ పొందారు. తాను చూసిన జీవితానికి వెనుక చోదక శక్తులను పాఠకుల ముందు నిలపడం సాహితీకారునిగా తన బాధ్యతగా భావించారు.
జంగయ్య ‘జాతర’ నవల తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అత్యున్నత నవలగా పురస్కారం పొందింది. కేంద్ర దళిత సాహిత్య అకాడెమీ డా.అంబేద్కర్ సాహితీ ఫెలోషిప్ పొందారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రచయితల సంఘాలకు బాధ్యులుగా పని చేశారు. నల్లగొండలోని ఆయన ఇంటి పేరు ‘మాన్యం చెల్క’. ఆ సాహితీ క్షేత్రం నుంచి బోయ జంగయ్య పండించిన పంటలు: ఎలుతురు, పావురాలు అనే కవితా సంపుటాలు; గొర్రెలు, ఎచ్చరిక, దున్న, రంగులు, చీమలు అనే కథా సంపుటాలు.
హైద్రాబాద్ స్టేట్‌లో హైద్రాబాద్ వేరు. స్టేట్‌లోని తెలంగాణ వేరు. నిజాం పాలనలో హైద్రాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా పేరుపొందింది. సమస్త ఆధునిక వసతులూ ఇక్కడ ఉండేవి. కుల వివక్షత కనిపించేది కాదు. గ్రామీణ తెలంగాణ వేరు. అక్కడి పాలన మాలీ పటేల్-పోలీస్ పటేల్-పట్వారీ చేతుల్లోనే ఉండేది. గ్రామీణ ప్రాంతం నుంచి తనకు రావాల్సిన ఆదాయాన్ని మాత్రమే పట్టించుకున్న నిజాం, ప్రజల బాగోగుల బాధ్యతను చిల్లరదేవుళ్లకు వదిలేశాడు. జంగయ్య రచనల్లో గ్రామీణ తెలంగాణ కన్పిస్తుంది. పూర్వపు పాలన అవశేషాలు తెలంగాణ పల్లెలను ఎలా పీడిస్తున్నవో వివరించడం కన్పిస్తుంది. ఆధునిక అస్తిత్వ ఉద్యమాలకు పూర్వమే అణగారిన వర్గాల గురించి, ముఖ్యంగా వృత్తికారులు, స్త్రీలు, దళితుల గురించి స్వీయానుభవాల ఆధారంగా రచనలు చేసిన వారిలో బో.జ. ముందువరుసలో ఉంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జంగయ్య పనిచేశారు.
ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పల్లెలోని చివరి వరుసలోని చివరి వ్యక్తికి ఎలా చేరుతుంది? శ్రమజీవి సృష్టించిన సంపద ప్రభుత్వానికి ఎలా చేరుతుంది? అనే కీలకమైన పరిణామదశలు ఆయనకు నిత్యానుభవం. అలా అవి తన రచనల్లోకి సహజంగా వచ్చేవి. ఆయన కథలకు రాచకొండ విశ్వనాథశాస్త్రి ముందుమాట రాస్తూ- తాను ఇతివృత్తానికి మించిన శ్రద్ధ శిల్పం కోసం తీసుకుంటాననే విమర్శ ఉందనీ, అందుకు కారణం, ఎలా చెప్పాలి అని ఆలోచించడమేననీ, జంగయ్య కథలు సహజంగా ఉంటాయనీ, అందుకు కారణం ఏమి చెప్పాలి అనే అంశంలో ఆయనకు గల స్పష్టతేననీ కితాబునిచ్చారు.
గ్రామాల్లో మూఢనమ్మకాల వెనుక గల రాజకీయాలు, పరస్పర శత్రుత్వాలు, హత్యలకు దారితీసే ఉదంతాలు జంగయ్య రచనల్లో విస్మయం గొలిపే సహజ రీతిలో ఉంటాయి. భార్య వివాహేతర సంబంధానికి ఏమి శిక్ష విధించాలా? అని పంచాయితీ ఆలోచిస్తోంటే, భార్య తాలూకు దుస్తులు, వస్తువులు తీసుకువచ్చి నీకు నచ్చిన వాడితో నీవు వెళ్లు అనే భర్త ‘మనస్సు’ అనే కథలో కన్పిస్తాడు. గిరిజన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించని గ్రామీణ స్వభావాలను తన కథల్లో జంగయ్య ప్రతిభావంతంగా చిత్రించారు.
ఆయన తన పుస్తకాల ముఖచిత్రాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఎలుతురు కవితా సంపుటికి హేండ్‌మేడ్ పేపర్‌పై దాసి సుదర్శన్‌తో ముఖచిత్రం వేయించారు. గొర్రెలు కథా సంకలనానికి చంద్ర వేసిన ముఖచిత్రం (అయిదు వేళ్లల్లోని రెండు వేళ్లు... బొటనవేలు-మధ్యవేలు పరస్పరం ఢీకొట్టుకుంటాయి) ఆయన కథలసారాంశాన్ని ఒక్క చూపులో చెప్పిందని విమర్శకులు ప్రశంసించారు. సమాజాన్ని శాసిస్తోన్న రెండు ప్రధాన సామాజిక వర్గాల వెనుక అసలైన శక్తి ఎంకులు-రంగయ్యలేననీ, రెడ్డి-చౌదరి తమ ప్రయోజనాలకోసం ఏకమైనా ఎంకులు-రంగయ్యలు ఒక్కటి కాలేకపోతున్నారనీ డెబ్బయ్యవ దశకంలోనే జంగయ్య విశ్లేషించారు. పక్షులు మసీదులకూ పోతాయి, మందిరాలకూ పోతాయి. మనుషుల మధ్య ఆంక్షలెందుకు? అని ‘పావురాళ్లు’ కవితలో జంగయ్య వేసిన ప్రశ్నకు కాలం సమాధానం చెప్పకపోగా పదును పెడుతోంది!
జంగయ్య మాన్యం చెల్కలో మాండలీకాల పంట ఉంది. ప్రచారసాధనాల వలన మనుషులు మాట్లాడే మాటల్లో ఒకానొక కృత్రిమభాష వ్యావహారంలోకి వస్తోన్న వాతావరణంలో జంగయ్య రచనలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పల్లెల్లో వివిధ సమూహాలకు, సామాజిక వర్గాలకు చెందిన మనుషులు మాట్లాడే మాండలీకాలను బోయ జంగయ్య తన రచనలలో వాడారు. జాల - దవ్వు - అబక - గాడ్పు కొట్టిండు వంటి గ్రామీణుల పదాలు ఆయన రచనల్లో మెరుస్తాయి. తన సాహిత్యానికి గైడ్‌గా బోయ జంగయ్య కృతజ్ఞతలు వ్యక్తం చేసిన నోముల సత్యనారాయణ మాటల్లో: ‘జంగయ్య రచనల్లో ఇతి వృత్తానికి శిల్పం చర్మం వలె సహజంగా ఉంటుంది. చాలామంది శిల్పాన్ని కోటులా ధరిస్తారు’.
- పున్నా కృష్ణమూర్తి
ఇండిపెండెంట్ జర్నలిస్ట్; ఫోన్: 7680950863
- బోయ జంగయ్య
అక్టోబర్ 1, 1942 - 7 మే 2016