పేదలు మనుషులు కారా? | mahesh vijapurkar comments on | Sakshi
Sakshi News home page

పేదలు మనుషులు కారా?

Published Tue, Sep 13 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

పేదలు మనుషులు కారా?

పేదలు మనుషులు కారా?

అధికారిక వ్యవస్థ మాత్రమే కాదు.. సమాజంలో భాగమై ఉంటున్న మనం కూడా దేశంలోని నిస్సహాయుల వెతలపట్ల స్పందించడం లేదు.

అధికారిక వ్యవస్థ మాత్రమే కాదు.. సమాజంలో భాగమై ఉంటున్న మనం కూడా దేశంలోని నిస్సహాయుల వెతలపట్ల స్పందించడం లేదు. పేదలు ఇక్కడ మనుషులు కారు. వారు ఆత్మ లేని సంఖ్యలు మాత్రమే.
 
ఆదాయాల్లో అసమా నత్వం అనేది ఒక ప్రపంచ వ్యాప్త దృగంశం అనే చెప్పాలి. ఉదాహరణకు ఒకరు సంపదతో కంపు గొడుతున్నప్పటికీ మరొ కరు నిరుపేదగా ఉండని విధంగా యూరప్‌లో కొన్ని దేశాల జీవన ప్రమా ణాలుంటున్నాయి. జాతి వివక్షాపరమైన కొన్ని పక్ష పాతాలు ఉంటున్నప్పటికీ మనం చూస్తున్న మేరకు, ఆ దేశాలలో వ్యక్తులతో వ్యవహరించే పద్ధతిలో ఒక సమానతా భావం ఉంటోంది.
 
కానీ పేదలను మనుషులుగా చూడకపోవడం భారత్‌లో మనం చాలా స్పష్టంగా చూస్తుంటాము. పురాతన నాగరికతా ప్రాతిపదికన మనది ఆధునిక దేశంగా మనకు మనమే పిలుచుకుంటున్నప్పటికీ, పేదలను మనం ప్రాణంలేని జడ పదార్థాలుగా చూస్తూనే ఉన్నాం. చివరకు చావులో కూడా ఈ రెండు వర్గాల ప్రజల మధ్య వ్యత్యాసం ఉంటోంది. సంప న్నుడు చనిపోతే చక్కగా అంత్య క్రియలు జరగడమే కాదు.. ఆ కమ్యూని టీకి చెందిన మూలస్తంభం కుప్ప గూలిపోయినట్లు భావిస్తుంటారు. అదే పేదల విషయంలో అయితే వారు బికారి స్థాయి అంత్యక్రియలకు కూడా నోచుకోలేరు. వీరు చెట్టు మీంచి రాలిపడి, కాలికింద నలిగిపోయే ఆకులా కనిపిస్తుంటారు.
 
 మీరట్‌లో ఒక మహిళ చనిపోయిన తన పిల్లవా డితో పాటు రాత్రంతా ఆసుపత్రి వెలుపల గడ పాల్సి వచ్చింది. ఎందుకంటే జిల్లా సరిహద్దులను దాటడానికి అంబులెన్సులకు అనుమతి లేదు. నిబం ధనలు అడ్డొచ్చాయన్నమాట. అదే సంపన్నులు లేదా మధ్యతరగతి వ్యక్తులు ఇలాంటి సందర్బాల్లో ప్రైవేట్ అంబులెన్స్‌ని కిరాయికి తీసుకుంటారు లేదా డ్రైవర్‌కు లంచమిచ్చి పని జరిపించుకుం టారు. ప్రైవేట్ వాహనం అంటే ఒక ట్రిప్పుకు రూ.2,500లు చెల్లించుకోవల్సిందే.
 కాన్పూర్‌లో అయితే వ్యాధిగ్రస్తుడైన తండ్రిని ఆసుపత్రిలో ఒక విభాగం నుంచి మరొక విభా గానికి తీసుకుపోవడానికి కనీసం స్ట్రెచ్చర్‌ని కూడా ఇవ్వలేదు. చివరకు కుమారుడి భుజాలమీదే అతడు చనిపోయాడు. ఇక ఒడిశాలో అయితే ఒక వ్యక్తి చని పోయిన తన భార్యను స్వస్థలం తీసుకెళ్లడానికి 12 కిలోమీటర్ల దూరం ఆమె శవాన్ని మోసుకెళ్లాడు. ఇక్కడా ఆసుపత్రి అతడికి వాహనం కేటాయించ లేదు. మరొక  కుటుంబాన్ని మధ్యలోనే వాహనం లోంచి దింపేయటంతో చనిపోయిన వ్యక్తిని మోసు కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అంబు లెన్స్‌లో బతికి ఉన్న వ్యక్తి చనిపోతే వారిని గమ్య స్థలం చేర్చడం దాని బాధ్యత కాదన్న మాట.
 
 ఇలాంటి ఘటనలు వార్తలైనప్పుడు అధికార వర్గాలు సంజాయిషీతో సరిపెట్టుకుంటాయి. ఒక కేసులో మృతుడి బంధువు కాస్సేపు కూడా వేచి ఉండలేక శవాన్ని ఆదరా బాదరాగా తీసుకెళ్లాడని అధికారులు చెప్పారు. కానీ వాహనం కోసం గంట వేచి ఉండటం కంటే  12 కిలోమీటర్లు నడవటం ద్వారా వారికేం మేలు జరిగినట్లు? అధికారుల చవక బారు వాదనలు ఈ ఘటన సందర్భంగా ప్రదర్శిం చిన అగౌరవాన్ని, అనాదరణను సరిదిద్దలేవు.
 
 పోస్ట్‌మార్టమ్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒడిశాలోని మరో ఆసుపత్రిలో 80 ఏళ్ల వృద్ధ మహిళ శవం నడుం విరగ్గొట్టారు. తర్వాత వారు ఆమె దేహాన్ని ఒక కర్రకు కట్టి మోసుకెళ్లారు. అలాంటి ఘటనల్లో అధి కారిక వ్యవస్థమాత్రమే స్పందనా రాహిత్యాన్ని ప్రదర్శించటం లేదు, సమాజంలో భాగమై ఉంటున్న మనం కూడా నిస్సహా యుల వ్యథల పట్ల స్పందించడం లేదు. మధ్యప్రదేశ్‌లో భార్య శవాన్ని దహనం చేయడానికి తగినన్ని డబ్బులు లేకపోవ డంతో అతడిని వెనక్కు పంపించేశారు. భార్య శవదహనంకి తను చెల్లించలేనంత రుసుమును ఆ పంచాయతీ డిమాండు చేయడంతో అంత్యక్రియల కోసం ఆ భర్త చెత్తను ఏరుకోవలసి వచ్చింది.
 
 తమిళనాడులోని ఉలుందుర్‌పేటలో బాధిత కుటుంబానికి శవదహనం కోసం మంజూరైన రూ.12,500లను విడుదల చేయడం కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచాన్ని చెల్లించడా నికి మృతుడి కుమారుడు, మరి కొందరు యువ కులు బిక్షాటన చేస్తూ కొత్తపద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలెన్నో వెలు గులోకి రాకపోయి ఉండవచ్చు.
 
 మీడియా ఇలాగే స్పందించేటట్లయితే, మన దేశంలో పేదల పట్ల ప్రదర్శిస్తున్న క్రూర, అమాన వీయ వైఖరికి చెందిన పలు కథనాలు ఇంకా వెలు వడుతూనే ఉంటాయి. పేదలూ మనుషులే. కానీ వారిని గణాంకాల్లో ఉపయోగించడానికి ఆత్మలేని సంఖ్యలుగా మాత్రమే చూస్తుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన దారిద్య్ర రేఖకు ఎగువన ఒక్క రూపాయి అధికంగా వ్యక్తుల ఆదాయాలు ఉన్నట్లయితే, అతడు లేక ఆమె ఇక పేదవర్గంలో భాగం కారు. కానీ వారి జీవితాల్లో మాత్రం అణుమాత్రం తేడా ఉండదు.
 


 మహేష్ విజాపుర్కార్
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement