ప్రపంచ రంగస్థలిపై మన్మోహన్
మన్మోహన్ కోసం అంతర్జాతీయ రంగస్థలిపై ఒక ముఖ్య భూమిక వేచి చూస్తోంది. పగ, విద్వేషాలకు అతీతమైన తటస్థ స్వరం మన్మోహన్‌కుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనాలతోపాటూ సంక్షోభ ప్రాంతాల నడుమ ఉన్న అన్ని దేశాలలోను ఆయనకు విశ్వసనీయత ఉన్నది. సముచితమైన, ఆచరణాత్మక తీర్పరితనం, ప్రశాంతత ఆయనకు పెన్నిధి.
ప్రధానిగా మన్మోహన్‌సింగ్ అవతార అస్తమయం తదుపరి ఆయన ఏమి చేస్తారా అని అనవసరంగా ఆందోళన చెందనివారిగా కనిపిస్తున్నది ప్రధాన మం త్రి ఒక్కరే. అది ఆయన వ్యక్తిత్వంలోనే ఉంది. ఉన్నత ప్రభుత్వాధికారిగా ఆయన తన నైపుణ్యాన్నంతటినీ ప్రదర్శించి ప్ర భుత్వ యంత్రాంగపు జారుడు మెట్ల నిచ్చెనలను అధిరోహించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఉపకార వేతనం అందుకున్న బాలుని దశ నుంచి రిజర్వు బ్యాంకు గవర్నరు హోదా వరకు ఆయన వృత్తిపరమైన జీవితమంతా అద్భుతంగా సాగింది.
అయితే పదవీ విరమణ తదుపరి మన్మోహన్ సాధిం చిన వాటికి మాత్రం ఏదీ సాటిరాదు. అదంతా భగవంతుడు మహా ఉదార మానసిక స్థితిలో ఉన్నప్పుడు రాసిన తలరాత మాత్రమే అయివుండాలి. 1991లో ఆయన ఆర్థిక మంత్రి అయినందుకు భారత దేశం విస్తుపోయింది. పదమూడేళ్ల తర్వాత ఆయన ప్రధాని కావడంతో ప్రపంచమే నిర్ఘాంత పోయింది. ‘పదమూడు’ పాశ్చాత్య ప్రపంచానికే దురదృష్టకరమైన సంఖ్య.
.. ప్రాచ్య ప్రపంచానికి కాదు.
రాహుల్ గాంధీకి సలహాల గోరు ముద్దలను తిని పిస్తూ కాలాన్ని వృధా చేయడం మన్మోహన్ చేయని పనుల్లో ఒకటి. అక్కర్లేని వాటిని ఆయన ఇవ్వజూపడం అతి అరుదు. అణగిమణిగి ఉన్నా ఆయన ఎప్పుడు, ఏది సరిగ్గా సముచితమైనదో నిర్ణయించగల అద్భుత తీర్పరి. సంరక్షక పాత్రలో గద్దె చుట్టూ తచ్చాడే ప్రయత్నం ఆయన ఎంత మాత్రమూ చేయరు. రాచరిక యుగంలోనే అలాం టి పనిని ఈసడించేవారు. ఇక ప్రజాస్వామ్యంలో అది మరింత అవాంఛనీయమైనది.
రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించడంతోనే స్టేట్ మంత్రులు మినహా నేటి మంత్రి వర్గంలోని వారంతా విలువను కోల్పోతారు. పేరుపేరునా చెప్పడం బాధాకరం కావచ్చు. ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినవారి విషయంలో ఇది తప్పదు. గత దశాబ్ద కాలంగా పతాక శీర్షికల్లో కిక్కిరిసి కనిపించిన పలువురు అత్యంత బలహీనమైన గొంతుకతో కడపటిసారిగా జయజయ ధ్వానాలను చేస్తుండటాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అరవైలు, డెబ్భైలలో ఉన్న గత తరం కాంగ్రెస్ నేతలకు మన్మోహన్ పెద్ద తలకాయగా సైతం మారరు. రాహుల్ మాట్లాడుతున్నది భిన్నమైన భాష. అది... మన్మోహన్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీల వంటివారి భాష కంటేనే కాదు, రాహుల్ కన్నా రెండు దశాబ్దాలు పెద్దవారైన సీనియర్ల భాష కంటే కూడా భిన్నమైనది.
అయితే ఏంటి, మన్మోహన్ పదవీ విరమణ తదుపరి జీవితాన్ని లైబ్రరీలోనే గడుపుతారా? నిర్వికార ప్రసన్నమూర్తి అయిన ఆయన తన అసాధారణమైన జీవితంలో అత్యంత ఉద్విగ్నమైన మెరుపులను చూశారు. ప్రత్యేకించి ప్రధాన మంత్రి దినచర్యతో ఆయన శరీరం ఎంతగా అలసిపోయిందో మేధస్సు, ఆత్మ కూడా అంతగానూ అలసిపోయాయి. కాబట్టి తొలి ఆలోచనగా పుస్తక పఠనంలోని శాంతి ఆయనను ఊరిస్తుంది. అయితే త్వరలోనే ఆయన శరీరక స్థితి మెరుగుపడుతుంది.
బ్రిటన్ ఆర్థికశాస్త్రవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ తన వృత్తి జీవితం కంటే ఎక్కువ కాలం కమ్యూనిస్టేతర వామపక్షవాదులకు ఎజెండాను సమకూర్చారు. గత జ్ఞాపకాల కలబోతగా కీన్స్ పుస్తకాల్లోని పేజీలను తిరగేయడంతోనే రోజు వెళ్లబుచ్చడం కంటే మించినది ఏదైనా చేయాలని మన్మో హన్ కోరుకుంటారు. ఇక చేయడానికి ఆయనకు ఏముం టుంది? అంతర్జాతీయ రంగస్థలిపై మన్మోహన్ మాత్రమే నిర్వహించాల్సిన ఒక భూమిక వేచి చూస్తోంది. నేడు ఆయన కాంగ్రెస్ ఊత కర్రలపై కుంటుకుంటూ దేశ రాజకీయ రంగస్థలి వెలుగులకు దూరం కావాల్సి వస్తున్న మాట నిజమే. అయితే అది ప్రత్యామ్నాయ రంగంలో ఆయనను నిరోధించగలిగేదేమీ కాదు. నేడు ఆయనలో దాగివున్న ఆందోళనంతా ఆయన నిష్ర్కమణతోనే మటుమాయమై మరపున పడిపోతుంది. రాజకీయాల్లో పైకి ఎగసినది ఏదైనాగానీ కిందకు రాక తప్పదని బాగా ఎరిగిన అంతర్జాతీయ అభిమానుల బృందం ఆయనకు ఉంది. వచ్చే జనవరి నాటికి మన్మోహన్ పీడకల ముగిసిపోతుంది.
నేడు ఆసియాలోని యుద్ధ ప్రాంతాలు లెబనాన్, పాకిస్థాన్‌ల నుంచి మధ్య అసియా, పశ్చిమ చైనా ప్రాంతాలకు విస్తరిస్తుండగా, తూర్పు మధ్య ఆఫ్రికా నరమేధపు ఊబిగా దిగజారిపోతోంది. పేరుకుంటున్న ఈ అంతర్జాతీ య సంక్షోభం వచ్చే జనవరి నాటికి విపత్కర ప్రమాణాలకు చేరుతుంది.
జాతీయ సరిహద్దులను దాటి గణనీ యంగా గుర్తింపు ఉన్న వాళ్లు నేడు ఇద్దరే ఉన్నారు... బిల్ క్లింటన్, టోనీ బ్లయర్. క్లింటన్ ఎక్కడికి వెళితే అక్కడ అయన చెప్పేది వినేవారున్నారు. బ్లయర్ ఉపన్యాసాలకు రుసుం చెల్లిస్తారు. క్లింటన్ నేడు మనకు అవసరమైన ప్రపంచ రాజనీతిజ్ఞుడు కాగలవారు. కానీ ఆయన హృదయమంతా అమెరికా రాజధాని వాషింగ్టన్‌పైనే ఉంది, ఆయన భార్య శ్వేత సౌధ పీఠం కోసం పోటీకి దిగే అవకాశాలపైనే ఉంది.
మధ్యప్రాచ్యం గాయాలకు ఉపశమన కారిగా, భావజాల పరిరక్షకునిగా పాశ్చాత్య దేశాలు టోనీ బ్లయర్ లాంటి దారి దొంగను ఎంచుకోవడం కొంత దిగ్భ్రాంతికరమైన విషయమే. ఇరాక్‌లో బ్లయర్ నిర్వాకం ప్రపంచంలోనే అతి పెద్ద విప్లవకర అతివాదపు (రాడికల్ ఎక్స్‌ట్రీమిజం) మరుగుదొడ్లలో ఒకటిగా నిలుస్తుంది. అవసరమైనదాని కంటే ఎక్కువ కాలమే సహించిన గత కాలపు మిడిసిపాటు నేతగా ఆయనను వదిలి వేయడమే బహుశా జరగు తుంది. పైగా ఆఫ్రో-ఆసియా దేశాలకు కావాల్సింది ఆఫ్రో-ఆసియన్ నాయకత్వమే.
విద్వేషపూరితమైన యుద్ధాలకు ఆజ్యాన్ని పోసే ఉద్వేగాలలో చిక్కుపడిపోయిన ప్రాంతాలలోని పగ, విద్వేషాలకు అతీతమైన తటస్థ స్వరం మన్మోహన్‌కు ఉన్న అతి పెద్ద అనుకూలత. అరబ్బు-ఇజ్రాయెల్‌ల చారిత్రాత్మక యుద్ధం విషయంలో మాత్రమే అది ఒకప్పుడు నిజం. కానీ సిరియా అంతర్యుద్ధం, ఇరాక్‌లో తిరిగి నెలకొన్న అరాచకత్వం పాలస్తీనాను కమ్మేసాయి. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా ఉనికి ఒక స్థావరానికి, మూసిన తలుపులకు కుంచించుకుపోయాక కాబూల్ తాలిబన్ల మధ్య యుద్ధాలు తీవ్రమై, పాకిస్థాన్‌కు పాకుతాయి. యుద్ధాలకు సరిహద్దులపై ఎప్పుడూ గౌరవం ఉండదు.
అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా ప్రభుత్వాలతో పాటూ సంక్షోభ ప్రాంతాల నడుమ ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాల వద్ద మన్మోహన్‌కు బోలెడంత విశ్వసనీయత ఉన్నది. ఆయనకు అంతా మంచి, అంతా చెడూ అనే నలుపు-తెలుపు ఎంపిక పద్ధతి లేదు. ఆయనలోని ఈ లక్షణం అలసట చెంది ఉన్న యోధులకు సాంత్వనను కలుగ జేస్తుంది. మన్మోహన్‌లోని సముచితమైన, ఆచరణాత్మక మైన తీర్పరితనం, ప్రశాంతత పెన్నిధి కాగలుగుతాయి. ఆ రెండు గుణాలకు బహుమతులుంటాయి.