ఆదివాసీ సంస్కృతికి అచ్చమైన సంకేతం
సందర్భం
జయధీర్ తిరుమలరావు
మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తుంది. అయితే అవి సక్రమంగా అమలు కావు. గిరిజన విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రయత్నాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ దఫా కోటి మంది సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ఆదివాసీ దేవతలు నిన్న వనం చేరారు. నాలుగు రోజుల మేడారం జాతర సంరంభం ముగిసింది. అక్కడి దేవతల పేర్లు సమ్మక్క-సారలమ్మ. ఈ అతిపెద్ద గిరిజన జాతరకు చరిత్రతో సంబంధం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే గిరిజన దైవాలు శక్తి దేవతలు, శైవమత దైవాలు పురుష దైవాలు. వీరికి సంబంధించి ఎన్నో జాతరలు జరుగుతాయి. రాను రాను సమాజంలో శక్తి ప్రాభవం తగ్గి పురుష దైవ ఆధిపత్యం పెరిగిపోయింది.
రేణుకా ఎల్లమ్మ కూడా స్త్రీ దేవతే. ఆమెని ఆరంభంలో పూజించిన కాకతీయులు ఆ తరువాత శైవం స్వీకరించి ఆమెను పక్కన పడేశారు. ఏకవీరా దేవి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవత ఖాళీ చేసి హుస్నాబాద్‌కి తరలిపోయింది. అంతేకాదు ఎల్లమ్మ తల్లి ప్రతాపరుద్రునితో యుద్ధానికి సిద్ధపడింది. ఓరుగల్లు పట్టణాన్ని రోగాలకు గురి చేసి అతలాకుతలం చేసిందని బవనీలు ఈనాటికీ పాడే కథలో స్పష్టంగా ఉంది. దాదాపు ఇదే కాలంలో కోయల ప్రాంతంలో కాకతీయ రాజులు తమ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి అటు ఆలయాలనూ, జలాశయాలనూ తవ్వించడం ప్రారంభించారు. అంటే ప్రశాంతంగా తరతరాల నుంచి తమ బతుకు తాము బతుకుతున్న కోయల జీవావరణంలోకి చొరబాటు జరిగింది.
తమ పర్యావరణాన్ని నరికి కుప్పలు పెట్టడం గిరిజనులు సహించలేకపోయారు. తమ ఇలవేల్పు అయిన వెదురు వనాల విధ్వంసం చూడలేకపోయారు. గుడులు కట్టించడానికీ, చెరువులు తవ్వించడానికీ అయిన ఖర్చుని పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడానికి కాకతీయ రాజులు ప్రయత్నించినప్పుడు కోయలు ప్రతిఘటించారు. శైవం ప్రచారం చేయడం కోసం నానా తంటాలు పడటం చూసి తమ స్త్రీ అధిదైవాలు, ప్రకృతి దేవత, వనదేవతలకు ముప్పు వాటిల్లుతున్నదని ఆగ్రహించారు. సమ్మక్క-సారలమ్మలు ఆ ఆగ్రహంతో రాజ్యాన్ని ధిక్కరించి ఉంటారు. ఆ సమరంలో మరణించి దేవతలుగా పూజలందుకుంటున్నారు.
ఈ జాతరలో మొదట దేవతలను గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఆ తరువాత రోజు మొక్కులు చెల్లిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి దేవతలను అనుగ్రహించమని కోరి ఊరిలోని గద్దెకు తీసుకువస్తారు. ఆ తరువాతి రోజున దేవతల వన ప్రవేశం జరుగుతుంది..
అమలుకాని సర్కారు హామీలు
వరంగల్ జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తుంది. అయితే అవి అమలు జరగవు. గిరిజన ప్రదర్శనశాల మేడారంలో ఏర్పాట్లు చేయాలని రెండేళ్ల కింద చెప్పారు. చిన్న పని కూడా మొదలు కాలేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలి. కాని దానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఇంకా మొదలు కాలేదు. నిజానికి ఆదివాసీ సంప్రదాయాలు శిష్ట సంప్రదాయాలకన్నా భిన్నం. అందుకే ‘‘ఉన్నత కోయ ధర్మపీఠం’’ ఏర్పాటు చేసి వారి అజమాయిషీలోనే జాతర, పూజా పునస్కారాలు నడిపించాలి. కోయ మతానికి, ధర్మానికి సంప్రదాయానికీ దూరమైన బ్రాహ్మణ పూజా విధానం ఆదరికి చేరకుండా చూడవలసి ఉంటుంది. అంతేకాదు సుమారు కోటి మంది సందర్శకుల కోసం సౌకర్యాలు, వైద్య వసతులు ఏర్పాటు చేయడం ముఖ్యం. అయితే మంచి చెడుల పేరిట ఏ రూపంలోనూ గిరిజన విశ్వాసాలు పరిహాసానికి గురికాకుండా చూడ్డం ఎంతో ముఖ్యం.
ఆగని దోపిడీ
గిరిజన జాతరలకు సందర్శకులు పెరుగుతున్నారు. గిరిజనుల భూములు, నీళ్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. అభయారణ్యాలు, నీటి ధారలు, ఖనిజాలు - అన్నీ మూటగట్టుకొనే సందర్భంలో ఆదివాసులు తమ సంఘీభావానికి, ఆదివాసులతో మైదాన ప్రజల స్నేహభావనకు ఈ జాతరలు ఒక సంకేతం. నిజానికి ఆదివాసులను మోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి, ఇలా జాతరలా వారు ఒక్కసారి తరలిరావడానికి ఈ జాతర సమాగమం దారి తీస్తుంది.
మేడారం ఎన్నో ఆలోచనలను ఆవిష్కరిస్తున్నది. సమ్మక్క-సారలమ్మలు అన్నల యుద్ధ రంగంలో మహిళా శక్తులై విస్తరిస్తున్నారు. అడవికి వెళ్లి తెచ్చిన ‘వెదురు’ తామరతంపరలై విస్తరించినట్లు మేడారం జాతర ఇప్పుడు వందలాది చోట్ల వెలుస్తున్నది. ఒక వెదురు ముక్క కోయల పోరాట సంకేతమై పాకిపోవాలి. ఇప్పుడు జాతర ముగిసింది. తమ బతుకుల బాగు కోసం బతుకు జాతరకు తెర తీయవలసి ఉంది. వనజాతర జన జాతర అయిననాడే ఆదివాసులకు అసలు పండగ.
(వ్యాసకర్త కవి, పరిశోధకుడు)