jayadheer tirumala rao
-
వేయి గొంతుకల విమలక్క
ఒక గొంతుక అనేక గొంతుకలై నాలుగు దశాబ్దాలుగా ప్రజలపక్షం నిలవడం అపురూపం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసు కున్న పదేళ్ల తరువాత, విప్లవ కుటుం బంలో పుట్టిన విమల 1964లో అరుణ గానవనంలోకి ప్రవేశించింది. నలభై ఏళ్లుగా ఆగకుండా సాగుతున్న విప్లవ సాంస్కృతిక రంగంలో అజేయంగా నిలిచింది. కళాకారిణిగా ఉంటూ అరుణోదయ (ఏసీఎఫ్)కి నాయకత్వం వహిం చింది. జాతీయ స్థాయిలో తెలుగువారి చేవ చూపించిన మహి ళల్లో విమలక్క ఒక్కరే. దేశంలో వివిధ భాషా రాష్ట్రా లలో తన గళం వినిపించిన ఘనత ఆమెదే. రెండు దశాబ్దాలుగా తెలంగాణ కోసం తన పంచేంద్రియా లను ఆట, మాట, పాట, సంగీతం ఆహార్యంగా చేసింది. తనకి సంకెళ్లు వేసిననాడు గుండె చెదరలేదు. కార్యా లయాన్ని పోలీసులు ఆక్రమించి రోడ్డు మీద పడేసిననాడు వెరవలేదు. పాటలచెట్టుని నరికేశామనుకున్నారు. తాను, తన కళాకారులు రోజుకొక్క చోట తలదాచుకున్నారు. నిర్బంధా లలో సైతం అనేక రాగాలవేడి కాపు కుని చలికాచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అరెస్టు, నిర్బంధం అరుణోదయ విమలపైనే! కడుపులో బాధ ఎలా కాలి పోతుందో, విషాదాన్ని ఏ పేగు మూలన కుక్కి పెడుతుందో తెలి యదు. కానీ చిరునవ్వు ఆమె పెదా లని విడిచిపోలేని నేస్తం. మహిళా కళా కారిణులలో దేశం గర్వించే స్థాయి ఆమెది. సగం ఆకాశం కాదు. ఒకే ఒక్క విమలక్క. జనం చప్పట్లే ఆమెకు జేజేలు. విప్లవ సాంస్కృతికోద్య మంలో సుదీర్ఘంగా, నిలి చిన పాటల కొండకి అభి నందనలు. 16 సెప్టెంబర్ 2018 (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నలభై ఐదేళ్ల అరు ణోదయంలో విమలక్క విప్లవ ప్రస్థాన గానసభ’ కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో గద్దర్, అల్లం నారాయణ, జయధీర్ తిరుమలరావు, కె. రామ చంద్రమూర్తి, కె. శ్రీనివాస్, ప్రొ‘‘ ఎ. వినాయక్‌రెడ్డి తదితరులు పాల్గొం టారు. అందరికీ ఆహ్వానం. జయధీర్ తిరుమలరావు మొబైల్ : 99519 42242 -
జానపదంలో వేగు‘చుక్క’
నివాళి ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. ఆయనను కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. అతని ఇంటిపేరు చుక్క. కానీ సత్తయ్య పది సూర్యు ళ్లంత కాంతి గోళం. వర్తమాన జానపద కళారంగ విశ్వంలో అతని సాటి మరెవరూ లేరు. నేలమీద కళా గెలాక్సీ కళకళ లాడుతుంటే ఈర్ష్యపడి పై లోకం అమాంతం అతడిని తన \లోకి లాక్కుంది. ఒగ్గుకథ మూగదైంది. ఢమరుకం చిన్నబోయింది. యుద్ధ శబ్దం పలికే ‘నపీరా’ పీక నలిగి పోయింది. డిళ్ళెం పల్లెం డీలా పడింది. బీరన్న దేవుడు బీరిపోయిండు. సత్తయ్య చిరునగవు ఒక అద్భుతం. రెండు చిన్న పెదాలలోంచి ఐదు రోజుల ఒగ్గుకథ అలా వేలాదిమం దిని ఆనందాశ్రుస్నానాలు చేయించేది. మిలమిల లాడే కళ్లలో తృప్తి తొణికిసలాడేది. లోలోన మాత్రం పేదరికం బిగి కౌగిలిలో నిశ్శబ్ద యుద్ధం చేసేవాడు. మాణిక్యపురం, జనగామ నుంచి ప్రతిరోజు ప్రయాణించి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యా లయం జానపద కళల శాఖకు అందరికన్నా ముందే హాజరు. అక్కడ తీసుకునే జీతం కోసం రోజూ వంద మైళ్లు ప్రయాణించేవాడు. ఎక్కడా అలసట అతని ముఖంలో కనిపించేది కాదు. అతని చిరునగవుల కాంతిని చూసి ఈర్ష్యపడిన ఆచార్యులు అతడిని ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేద్దామా అని ఆలోచించే వారు. విద్యా ర్థులు ఆ కళాకాంతిని చుట్టుముట్టేవారు. ఒక మృదంగ కళాకారుడు అతనిలా చేరిననాడు ఆచార్యుడయ్యాడు. సత్తయ్య మాత్రం ఇన్స్ట్రక్టర్ స్థాయికన్నా దిగజారాడు. తరువాత అతడిని సాగనంపి తృప్తిపడ్డారు. సత్తయ్య ఒగ్గుకథల్ని కేసెట్లు చేసి లాభాలు తీసిన వాళ్లు క్షేమంగా ఉన్నారు. జ్వరంలో సైతం స్టెరాయిడ్స్ ఇచ్చి పాటలు పాడించుకుని, మార్కెట్లోకి పాటలు పంపి, సత్తయ్యని దవఖాన బెడ్‌మీద కూడా వేయలేదు. అలా అలా అనారోగ్యంతో కళావిహీనమయ్యాడు. సిఫెల్ పవన్, నేను సత్తయ్య తరఫున కత్తులకు, గూండాయి జానికి వెరవకుండా నిలచి 1996లో రెండు లక్షలు ఇప్పిం చాకా తిరిగి అతని పెదాలపై చిరునవ్వు వెలిగింది. ప్రజల సంతృప్తే నాకు పురస్కారం అనుకుని నాలుగు దశాబ్దాలలో నాలుగువేల ఐదువందల ప్రదర్శ నలు ఇచ్చాడు. సుప్రసిద్ధ సంస్థలు తమ తృప్తి కోసం సత్తయ్యకు అనేక అవార్డులు ఇచ్చి సంతృప్తి పడ్డాయి. సత్తయ్య ఒగ్గుకథ చెప్పడానికి హక్కుదారు కాదు. కానీ ఒగ్గుకథని అభ్యసించాడు. కులాచారంగా అధికా రిక పండుగలు చేయలేదు. కానీ ఆ కళాకారులకన్నా వంద రెట్లు ఎక్కువ ప్రదర్శన స్థాయిని పెంచాడు. నాజర్ బుర్ర కథని మహోతృష్ణ కళగా తీర్చిదిద్దినట్లే సత్తయ్య ఒగ్గు కథా కళారూప ప్రదర్శనని ఉన్నతస్థాయి కళగా మార్చాడు. శిష్ట నృత్యాల కన్నా భిన్నంగా జానపద నృత్యం ఉంటుంది. పోతే ఈ నృత్య పద్ధతులు శిష్ట నృత్యాల కన్నా ఉన్నత స్థాయిలో ప్రదర్శించవచ్చునని తాను చేసి చూపాడు. హావభావాల ప్రకటనలో సైతం, తనదైన విశిష్టతను చూపాడు. అత్యాధునిక వీధి నాటక శైలి జానపదనాటకరంగమే ఇచ్చిందని ఒగ్గుకథ చూసినవా రికి తెలుస్తుంది. ప్రత్యేక ఆహార్యం లేకున్నా పాత్రలను ప్రేక్షకుల కళ్లకు రూపు కట్టించాడు. తానే సంగీత దర్శ కుడై వాద్యాలను వాయిస్తూ ప్రేక్షక జన సమూహాలను ఉర్రూతలూపాడు. చేతిలోని చిన్న కండువాని గుర్రం కళ్లెంగా, పైటగా, కిరీటంగా చీరగా, ముసుగుగా ఎన్నో రకాలుగా వాడగల నేర్పరి సత్తయ్య. అభినయంలో కాకలు తీరిన నర్తకి నయన భాషల్ని అలవోకగా ఒలికిం చగలిగాడు. ఆటని ప్రదర్శిస్తున్నప్పుడు సత్తయ్యలో పంచ భౌతిక శక్తులు ఆయనకు సహకరించేవి. జలం ఆయన కన్నులలో కన్నీటి బొట్లై జలజలా రాలేవి. అగ్ని అతని వదనంలో జనించి కోపోద్రిక్త నాసికలోంచి బయట పడేది. రెండు చేతులు, కాళ్లు అనేక అవయవాలు గాలిగా మారి తాండవించేవి. మునివేళ్లలో జగ్గు వాద్యం వేగం పొగల్ని సృష్టించేది. నేలలోంచి పూలు పూసినట్లు, పళ్లు పండినట్లు, ఆకులు రాలినట్లు, సత్తయ్య తనువు అనే మట్టి గడ్డలోంచి ఒక్కో అంకం అనే రుతువులోంచి బయ టపడేవి. సత్తయ్య ప్రదర్శకుడే కాదు. వాగ్గేయకారుడు. అనేక ప్రాచీ రాగతాళగతులను తన సమకాలీన ప్రేక్షకు లకు నజరానాలుగా వంచేవాడు. సత్తయ్య ఒక్కడు. కానీ తన ప్రదర్శనలో.. అనేకం. ఒక దైవపాత్ర, ఒక హాస్య గాడు, సూత్రధారి, మహిళా పాత్ర, ఒక గుర్రం, ఒక రుద్ర శంకరుడు, వెరసి నవరసబ్రహ్మ. తానొక్కడే. కానీ డ్యూయెట్ నృత్యంలో హీరో, హీరోయిన్ ఆయనే. సత్తయ్య గతం కాదు. ఆయన వర్తమాన జీవి. మీరు ఇంత గొప్ప ప్రదర్శకులు కదా. ఎంతసేపూ ఒగ్గు కథేనా? కళ్ల ముందు ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊర్కుంటారా అని అడిగితే అప్పటికప్పుడు పర్యావరణ రణం అనే ఒగ్గుకథ రాసి ప్రదర్శించాడు. గత ఏడాది వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక మహాసభలను ఆయనతోనే ప్రారంభించాం. లిఖిత రచయితల సభలకు ఆయనను పిలుచుకున్నం దుకు వందలాది ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వెలిబు చ్చారు. కళాకారునికి, రచయితకు కావల్సింది శాలువా పోగులు, ఓ జ్ఞాపిక కాదు. భుక్తి గడ వడం. కుటుంబం నడవడం ముఖ్యం. అతనికి అవి కల్పించలేకపోయాం. ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. సంతాప ప్రకటనలు ఠంచన్‌గా కురిపించే విద్య తెలిసిన వారికి ఇలాంటి జానపద కళాకారులకు బతుకు గడిచే మార్గం కోసం ఆలోచనలు చేయవలసిన తరుణం ఇది. చుక్క సత్తయ్యని కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టక తప్పదు. అదీ సత్తయ్యకు ఇచ్చే నిజమైన నివాళి. -జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
‘తెలంగాణ తెలుగు’ ఉన్నట్టా? లేనట్టా?
సందర్భం ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీ కాళోజి జయంతి. ఆ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంతోషించాల్సిందే. ఏటా జయంతులు, వర్ధంతులు తామున్నామని గుర్తు చేస్తుంటాయి. ప్రభుత్వంలో, సమాజంలో ఎలాంటి కదలికలు లేకపోవడం వల్ల అవి యాంత్రికమవుతాయి. అంతేకాదు. ఆయా వ్యక్తుల స్ఫూర్తికి విరుద్ధ దిశలో జరుగుతూ ఉంటాయి. ఇది మరీ విషాదం. ఆయా సుప్రసిద్ధులకు అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా సరికాదు. గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని తెలుగు భాషాదినోత్సవంగా జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాళోజి జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరపాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రెండు కొత్త రాష్ట్రాలలో ఇప్పుడు రెండు తెలుగు భాషలకు విలువ లేకుండాపోయింది. విద్య, న్యాయ, పరిపాలనా రంగాలలో తల్లి నుడికి అవమానం జరుగుతున్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడ్డానికి ఆంధ్ర భాషే కారణం. రాష్ట్రాలు విడిపోవడానికి కూడా తెలుగు భాషే ఒక ప్రధాన కారణం. ఐనా అంతటి, ప్రాధాన్యతా అంశం అయిన భాషలకి దశాబ్దాలుగా అవమానం జరుగుతున్నది. మొదటి ప్రపంచ మహా సభలు జరిపిన ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, మధ్యలో తెలుగుదేశం పాలనలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సైతం అందరిదీ ఒకే తీరు, ఒకే విధానం. వ్యవహార భాషగా, బోధన భాషగా, పాలన భాషగా, కోర్టు భాషగా ఉండాల్సిన తెలుగు భాష ఎక్కడా కానరాదు. ఆయా రంగాలలో తెలుగు ఉంటే ప్రజలకు చాలా ఉపయోగం. కాని ప్రభుత్వాలు ప్రజల దృక్కోణంలోంచి ఆలోచించడం లేదు. అంటే ప్రజలు సృష్టించుకున్న భాషపై ఒకనాడు అగ్రకులాల పెత్తనం, ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతున్నది. ప్రజల తల్లి భాషను అసలే పట్టించుకోవద్దు. వ్యవహారంలో, సాహిత్యంలో పండిత భాషకు పట్టం కట్టాలి. సామ్రాజ్యవాదుల, జాతీయ ప్రభుత్వాల భాషా పాలసీలకు అనుగుణంగా తల వంచి జో హుకుం అనాలి. భాషని ప్రజాస్వామీకరించడానికి గిడుగు, కాళోజీలు ఎంతో కృషి చేశారు. నిజాయితీగా పోరాడారు. ఎవరికీ తలవంచలేదు. భాషా ఛాందసాన్ని తగ్గించి, ప్రజల భాషా విధానాన్ని పెంచారు. దానివల్ల అక్షరాస్యత శాతం పెరిగింది. భారత దేశంలో ప్రస్తుతం అక్షరాస్యతలో తెలంగాణ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కన్నా అధమ స్థాయిలో అంటే 32వ స్థానంలో ఉంది. ఇప్పుడున్న భాషా విధానాన్ని చూస్తే వయోజన విద్యని కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారేమో అని భయంగా ఉంది. ఏ భాషకూ కొరగాని సంకర, దద్దమ్మ విద్యార్థుల తరాన్ని తయారు చేయడం వల్ల కొత్త రాష్ట్రంలో విద్యాస్థాయి తగ్గిపోతుంది. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు తల్లిభాషా దినోత్సవాలు జరపడానికి అర్హులా? ఏమైనా అంటే, ఆ సందర్భంగా సాహిత్య తదితరమైన నాలుగు అవార్డులు ఇచ్చి భాషా దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పుకోవడం ఏపాటి సబబు. కాళోజి పురస్కారం పేరుతో కాళోజి స్ఫూర్తికి విరుద్ధమైన, వ్యతిరేక విలువలు కలిగిన వారికి పురస్కారాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి ‘దక్కన్ ల్యాండ్’ మాసపత్రిక (జూలై, 2017)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఈ ప్రపంచ మహాసభలను తెలంగాణ పేరిట నిర్వహిద్దామని కొందరు అన్నా, సీఎం మాత్రం ప్రపంచ తెలుగు మహాసభలుగానే సూచించారు’’ అని చెప్పారు. కాళోజి పేరుతో ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుతుంది. కాని ప్రపంచ మహాసభలను మాత్రం తెలుగు మహాసభల పేరనే జరుపుతారట! ఎంత విచిత్రం! ఎంత వైరుధ్యం. ఇది భాషా హిపోక్రసి. తెలంగాణా సాధనలో ‘తెలంగాణ భాష’ కూడా ఒక బలమైన హేతువు. శ్రీకృష్ణ కమిషన్‌కి ఇచ్చిన వందలాది నివేదికలలో తెలం గాణ భాష గురించినవి అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రపంచ మహాసభలు ఏ భాష గురించి మాట్లాడతాయి? అసలు ప్రభుత్వం లెక్కల్లో తెలంగాణ భాష ఉన్నట్లా? లేనట్లా? తేలవలసి ఉంది. అధినాయకులకు భాష పట్ల వివక్ష గురించి తీరిగ్గా ఆలోచించడం కష్టం. ముఖ్యమంత్రిగారికి ఎన్నో భాషా కోణాల గురించి తెలియచెప్పవలసిన బాధ్యత భాషా సంస్కృతుల శాఖల, సంస్థల పెద్దలపై ఉంటుంది. ఇవాళ కేవలం తెలుగు భాషపై సభలు జరిపితే రేపు తెలంగాణ భాష అని అనడం సాధ్యం కాదు. తెలుగు విశ్వవిద్యాలయంవారు తెలంగాణ నిఘంటువుని తయారు చేస్తున్నామనే పదే పదే గుప్పించే ప్రకటనలకు అర్థం ఏమిటి? తెలంగాణ భాష ఉన్నదనేగా! ప్రపంచ తెలుగు సభల నిర్వహణ వైఫల్యం దాని పేరులో, ఆలోచనల్లోనే దాగి ఉన్నట్లుగా అనిపిస్తున్నది. బంగారు తెలంగాణలో తెలంగాణ వైఢూర్యాల భాష భాగంగా లేకపోతే ఎలా? తెలంగాణ వారి పండుగలు చాలావరకు వేరే. బతుకమ్మ, బోనాల వంటివి తెలంగాణ రాష్ట్ర పండుగలు ప్రకటించుకున్నాం. మన సంస్కృతి వేరే అని స్పష్టంగా చెప్పుకున్నప్పుడు లేని బాధ, భాష వరకు తేడా ఎందుకు? ఇంగ్లిష్ అంతటా ఒకటే. కాని బ్రిటిష్ ఇంగ్లిష్, అమెరికన్ ఇంగ్లిష్ అని వేరు వేరుగా పిలుచుకుంటారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది. కాని భాషకీ, హృదయానికీ సెంటిమెంట్ ఎక్కువ. తల్లిని తిడితే బాధపడినట్లే, తల్లి భాషని అవమానపరిస్తే జనం భగ్గుమంటారు. ఆ సెంటిమెంటుని, సున్నితమైన అంశాన్ని తట్టిలేపడం ఇప్పుడు అవసరమా! అకాడమి అధ్యక్షులు అన్నట్లు ఇది కేవలం కె. చంద్రశేఖరరావు అభిప్రాయమా? పాలసీ పరంగా సీఎం గారి ఆలోచనా? తెలియవలసి ఉంది. ఏది ఏమైనా వారి ఆలోచనే అని, ఆయనని ఒక్కరినే బాధ్యునిగా చేయడం సరికాదు. కాళోజి బతికి ఉంటే తెలంగాణ భాష కోసం గేయాలు రాసేవారు. తన అభిప్రాయాల్ని కరాఖండిగా చెప్పేవారు. ప్రభుత్వానికి నచ్చచెప్పేవారు. కాళోజి మన మధ్య లేరు. వందలాది ‘నా గొడవ’ కవితల్లో భాష గురించి అనేక భావాలను మరోసారి అవగాహన చేసుకోవాలి. ఆయన పేర జరిపే తెలంగాణ భాషా దినోత్సవాన్ని గౌరవిస్తూ ప్రపంచ మహాసభలని తెలంగాణ భాషా సాహిత్య, సంస్కృతుల వేడుకలుగా జరిపిం చడం ఔచిత్యం. అది కాళోజికి ఇచ్చే గౌరవం. (కాళోజి జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా) జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
ఆదివాసీ సంస్కృతికి అచ్చమైన సంకేతం
సందర్భం జయధీర్ తిరుమలరావు మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తుంది. అయితే అవి సక్రమంగా అమలు కావు. గిరిజన విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రయత్నాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ దఫా కోటి మంది సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆదివాసీ దేవతలు నిన్న వనం చేరారు. నాలుగు రోజుల మేడారం జాతర సంరంభం ముగిసింది. అక్కడి దేవతల పేర్లు సమ్మక్క-సారలమ్మ. ఈ అతిపెద్ద గిరిజన జాతరకు చరిత్రతో సంబంధం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే గిరిజన దైవాలు శక్తి దేవతలు, శైవమత దైవాలు పురుష దైవాలు. వీరికి సంబంధించి ఎన్నో జాతరలు జరుగుతాయి. రాను రాను సమాజంలో శక్తి ప్రాభవం తగ్గి పురుష దైవ ఆధిపత్యం పెరిగిపోయింది. రేణుకా ఎల్లమ్మ కూడా స్త్రీ దేవతే. ఆమెని ఆరంభంలో పూజించిన కాకతీయులు ఆ తరువాత శైవం స్వీకరించి ఆమెను పక్కన పడేశారు. ఏకవీరా దేవి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవత ఖాళీ చేసి హుస్నాబాద్‌కి తరలిపోయింది. అంతేకాదు ఎల్లమ్మ తల్లి ప్రతాపరుద్రునితో యుద్ధానికి సిద్ధపడింది. ఓరుగల్లు పట్టణాన్ని రోగాలకు గురి చేసి అతలాకుతలం చేసిందని బవనీలు ఈనాటికీ పాడే కథలో స్పష్టంగా ఉంది. దాదాపు ఇదే కాలంలో కోయల ప్రాంతంలో కాకతీయ రాజులు తమ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి అటు ఆలయాలనూ, జలాశయాలనూ తవ్వించడం ప్రారంభించారు. అంటే ప్రశాంతంగా తరతరాల నుంచి తమ బతుకు తాము బతుకుతున్న కోయల జీవావరణంలోకి చొరబాటు జరిగింది. తమ పర్యావరణాన్ని నరికి కుప్పలు పెట్టడం గిరిజనులు సహించలేకపోయారు. తమ ఇలవేల్పు అయిన వెదురు వనాల విధ్వంసం చూడలేకపోయారు. గుడులు కట్టించడానికీ, చెరువులు తవ్వించడానికీ అయిన ఖర్చుని పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడానికి కాకతీయ రాజులు ప్రయత్నించినప్పుడు కోయలు ప్రతిఘటించారు. శైవం ప్రచారం చేయడం కోసం నానా తంటాలు పడటం చూసి తమ స్త్రీ అధిదైవాలు, ప్రకృతి దేవత, వనదేవతలకు ముప్పు వాటిల్లుతున్నదని ఆగ్రహించారు. సమ్మక్క-సారలమ్మలు ఆ ఆగ్రహంతో రాజ్యాన్ని ధిక్కరించి ఉంటారు. ఆ సమరంలో మరణించి దేవతలుగా పూజలందుకుంటున్నారు. ఈ జాతరలో మొదట దేవతలను గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఆ తరువాత రోజు మొక్కులు చెల్లిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి దేవతలను అనుగ్రహించమని కోరి ఊరిలోని గద్దెకు తీసుకువస్తారు. ఆ తరువాతి రోజున దేవతల వన ప్రవేశం జరుగుతుంది.. అమలుకాని సర్కారు హామీలు వరంగల్ జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తుంది. అయితే అవి అమలు జరగవు. గిరిజన ప్రదర్శనశాల మేడారంలో ఏర్పాట్లు చేయాలని రెండేళ్ల కింద చెప్పారు. చిన్న పని కూడా మొదలు కాలేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలి. కాని దానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఇంకా మొదలు కాలేదు. నిజానికి ఆదివాసీ సంప్రదాయాలు శిష్ట సంప్రదాయాలకన్నా భిన్నం. అందుకే ‘‘ఉన్నత కోయ ధర్మపీఠం’’ ఏర్పాటు చేసి వారి అజమాయిషీలోనే జాతర, పూజా పునస్కారాలు నడిపించాలి. కోయ మతానికి, ధర్మానికి సంప్రదాయానికీ దూరమైన బ్రాహ్మణ పూజా విధానం ఆదరికి చేరకుండా చూడవలసి ఉంటుంది. అంతేకాదు సుమారు కోటి మంది సందర్శకుల కోసం సౌకర్యాలు, వైద్య వసతులు ఏర్పాటు చేయడం ముఖ్యం. అయితే మంచి చెడుల పేరిట ఏ రూపంలోనూ గిరిజన విశ్వాసాలు పరిహాసానికి గురికాకుండా చూడ్డం ఎంతో ముఖ్యం. ఆగని దోపిడీ గిరిజన జాతరలకు సందర్శకులు పెరుగుతున్నారు. గిరిజనుల భూములు, నీళ్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. అభయారణ్యాలు, నీటి ధారలు, ఖనిజాలు - అన్నీ మూటగట్టుకొనే సందర్భంలో ఆదివాసులు తమ సంఘీభావానికి, ఆదివాసులతో మైదాన ప్రజల స్నేహభావనకు ఈ జాతరలు ఒక సంకేతం. నిజానికి ఆదివాసులను మోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి, ఇలా జాతరలా వారు ఒక్కసారి తరలిరావడానికి ఈ జాతర సమాగమం దారి తీస్తుంది. మేడారం ఎన్నో ఆలోచనలను ఆవిష్కరిస్తున్నది. సమ్మక్క-సారలమ్మలు అన్నల యుద్ధ రంగంలో మహిళా శక్తులై విస్తరిస్తున్నారు. అడవికి వెళ్లి తెచ్చిన ‘వెదురు’ తామరతంపరలై విస్తరించినట్లు మేడారం జాతర ఇప్పుడు వందలాది చోట్ల వెలుస్తున్నది. ఒక వెదురు ముక్క కోయల పోరాట సంకేతమై పాకిపోవాలి. ఇప్పుడు జాతర ముగిసింది. తమ బతుకుల బాగు కోసం బతుకు జాతరకు తెర తీయవలసి ఉంది. వనజాతర జన జాతర అయిననాడే ఆదివాసులకు అసలు పండగ. (వ్యాసకర్త కవి, పరిశోధకుడు) -
గోండు భాషకు కొత్త సొబగులు
గోండుల భాషపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. రేపు గుంజాల గ్రామంలో గుంజాల గోండి లిపి దినోత్సవ సందర్భంగా ఈ వ్యాసం. ఆదిలాబాద్ జిల్లా నార్నె మండలం గుంజాల అనే గ్రామంపై ఇప్పుడు అనేకమంది భాషా పరిశోధకుల దృష్టి పడింది. ఓ పది రాత పుస్తకాలతో ఆ ఊరిప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ రాత పుస్తకాలు ఏమిటి? అందులో ఏముంది? గిరిజన గోండులు ఐదారు రాష్ట్రాలలో ఉన్నారు. చాలా గిరిజనజాతులకు అత్యంత ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే అవి చాలా వరకు నోటి భాషలే. ఆ నోటి భాష కూడా అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తరువాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. గత యాభై ఏళ్లుగా చదువుపేరిట ఇంగ్లిషు కూడా దానిపై స్వారీ చేస్తున్నది. అయినా అది తట్టుకుని నిలిచింది. చాలా గిరిజన భాషలు మార్పునకు లోనై సాంకర్యంతో కళవెళ పడుతున్నాయి. ఈ సందర్భంలో గుంజాలలో పది రాత ప్రతులు లభించాయి. అదీ గోండీ లిపిలో చేతితో రాసిన ప్రతులు. దీనికే ‘గుంజాల గోండీ లిపి’ అని పేరు. వందేళ్ల క్రితం ఆ ఊరిలో ఈ లిపి ప్రచారంలో ఉండింది. ఈ లిపి సృష్టికర్త ఎవరన్నది నిర్దిష్టంగా చెప్పలేం. ఆ సమాజమే దీన్ని సృష్టించుకున్నది. అయితే మూడు తరాల కింద ఈ లిపిని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం గుంజాలకి చెందిన పెందూర్ లింగోజి, కుంరా గంగోజి. వీరు ఒక పాఠశాల ఏర్పాటు చేసి దీన్ని నేర్పారు. అలా 60-80 ఏళ్ల కింద నేర్చుకున్న కోట్నక్ జంగు, కుంరా విఠల్, అర్క జైవంత్, కంరా లాల్‌షావు, అర్క కమలాబాయి ఇప్పటికీ ఉన్నారు. వారు చదవగలరు, రాయగలరు. కమలాబాయి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్లు పైనే ఉంటుంది. దృష్టి మందగించినా ఆ రాతను చూసినప్పుడు ఆమె కళ్లల్లో మెరుపులు. ‘మా భాష మాకు కావాలి. అది మాకు గర్వకారణం’ అంటుందామె. పదేళ్ల వయసులో ‘బిడ్డా! ఇది మన లిపి. దీన్ని చదువు. కాపాడు’ అని ఆమె తండ్రి చెప్పాడట. అందుకే ఆమె ఈ లిపిని కొడుక్కి, మనవరాలికి కూడా నేర్పింది. గిరిజనులకు విద్య దూరం అనుకునే శిష్ట సమాజం నివ్వెరపోయే విషయం ఇది. ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ. ‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్‌షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది. అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం. - జయధీర్ తిరుమలరావు