
నివాళి
ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. ఆయనను కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి.
అతని ఇంటిపేరు చుక్క. కానీ సత్తయ్య పది సూర్యు ళ్లంత కాంతి గోళం. వర్తమాన జానపద కళారంగ విశ్వంలో అతని సాటి మరెవరూ లేరు. నేలమీద కళా గెలాక్సీ కళకళ లాడుతుంటే ఈర్ష్యపడి పై లోకం అమాంతం అతడిని తన \లోకి లాక్కుంది. ఒగ్గుకథ మూగదైంది. ఢమరుకం చిన్నబోయింది. యుద్ధ శబ్దం పలికే ‘నపీరా’ పీక నలిగి పోయింది. డిళ్ళెం పల్లెం డీలా పడింది. బీరన్న దేవుడు బీరిపోయిండు. సత్తయ్య చిరునగవు ఒక అద్భుతం. రెండు చిన్న పెదాలలోంచి ఐదు రోజుల ఒగ్గుకథ అలా వేలాదిమం దిని ఆనందాశ్రుస్నానాలు చేయించేది. మిలమిల లాడే కళ్లలో తృప్తి తొణికిసలాడేది. లోలోన మాత్రం పేదరికం బిగి కౌగిలిలో నిశ్శబ్ద యుద్ధం చేసేవాడు.
మాణిక్యపురం, జనగామ నుంచి ప్రతిరోజు ప్రయాణించి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యా లయం జానపద కళల శాఖకు అందరికన్నా ముందే హాజరు. అక్కడ తీసుకునే జీతం కోసం రోజూ వంద మైళ్లు ప్రయాణించేవాడు. ఎక్కడా అలసట అతని ముఖంలో కనిపించేది కాదు. అతని చిరునగవుల కాంతిని చూసి ఈర్ష్యపడిన ఆచార్యులు అతడిని ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేద్దామా అని ఆలోచించే వారు. విద్యా ర్థులు ఆ కళాకాంతిని చుట్టుముట్టేవారు. ఒక మృదంగ కళాకారుడు అతనిలా చేరిననాడు ఆచార్యుడయ్యాడు. సత్తయ్య మాత్రం ఇన్‌స్ట్రక్టర్ స్థాయికన్నా దిగజారాడు. తరువాత అతడిని సాగనంపి తృప్తిపడ్డారు.
సత్తయ్య ఒగ్గుకథల్ని కేసెట్లు చేసి లాభాలు తీసిన వాళ్లు క్షేమంగా ఉన్నారు. జ్వరంలో సైతం స్టెరాయిడ్స్ ఇచ్చి పాటలు పాడించుకుని, మార్కెట్లోకి పాటలు పంపి, సత్తయ్యని దవఖాన బెడ్‌మీద కూడా వేయలేదు. అలా అలా అనారోగ్యంతో కళావిహీనమయ్యాడు. సిఫెల్ పవన్, నేను సత్తయ్య తరఫున కత్తులకు, గూండాయి జానికి వెరవకుండా నిలచి 1996లో రెండు లక్షలు ఇప్పిం చాకా తిరిగి అతని పెదాలపై చిరునవ్వు వెలిగింది. ప్రజల సంతృప్తే నాకు పురస్కారం అనుకుని నాలుగు దశాబ్దాలలో నాలుగువేల ఐదువందల ప్రదర్శ నలు ఇచ్చాడు. సుప్రసిద్ధ సంస్థలు తమ తృప్తి కోసం సత్తయ్యకు అనేక అవార్డులు ఇచ్చి సంతృప్తి పడ్డాయి.
సత్తయ్య ఒగ్గుకథ చెప్పడానికి హక్కుదారు కాదు. కానీ ఒగ్గుకథని అభ్యసించాడు. కులాచారంగా అధికా రిక పండుగలు చేయలేదు. కానీ ఆ కళాకారులకన్నా వంద రెట్లు ఎక్కువ ప్రదర్శన స్థాయిని పెంచాడు. నాజర్ బుర్ర కథని మహోతృష్ణ కళగా తీర్చిదిద్దినట్లే సత్తయ్య ఒగ్గు కథా కళారూప ప్రదర్శనని ఉన్నతస్థాయి కళగా మార్చాడు. శిష్ట నృత్యాల కన్నా భిన్నంగా జానపద నృత్యం ఉంటుంది. పోతే ఈ నృత్య పద్ధతులు శిష్ట నృత్యాల కన్నా ఉన్నత స్థాయిలో ప్రదర్శించవచ్చునని తాను చేసి చూపాడు. హావభావాల ప్రకటనలో సైతం, తనదైన విశిష్టతను చూపాడు. అత్యాధునిక వీధి నాటక శైలి జానపదనాటకరంగమే ఇచ్చిందని ఒగ్గుకథ చూసినవా రికి తెలుస్తుంది. ప్రత్యేక ఆహార్యం లేకున్నా పాత్రలను ప్రేక్షకుల కళ్లకు రూపు కట్టించాడు.
తానే సంగీత దర్శ కుడై వాద్యాలను వాయిస్తూ ప్రేక్షక జన సమూహాలను ఉర్రూతలూపాడు. చేతిలోని చిన్న కండువాని గుర్రం కళ్లెంగా, పైటగా, కిరీటంగా చీరగా, ముసుగుగా ఎన్నో రకాలుగా వాడగల నేర్పరి సత్తయ్య. అభినయంలో కాకలు తీరిన నర్తకి నయన భాషల్ని అలవోకగా ఒలికిం చగలిగాడు. ఆటని ప్రదర్శిస్తున్నప్పుడు సత్తయ్యలో పంచ భౌతిక శక్తులు ఆయనకు సహకరించేవి. జలం ఆయన కన్నులలో కన్నీటి బొట్లై జలజలా రాలేవి. అగ్ని అతని వదనంలో జనించి కోపోద్రిక్త నాసికలోంచి బయట పడేది. రెండు చేతులు, కాళ్లు అనేక అవయవాలు గాలిగా మారి తాండవించేవి.
మునివేళ్లలో జగ్గు వాద్యం వేగం పొగల్ని సృష్టించేది. నేలలోంచి పూలు పూసినట్లు, పళ్లు పండినట్లు, ఆకులు రాలినట్లు, సత్తయ్య తనువు అనే మట్టి గడ్డలోంచి ఒక్కో అంకం అనే రుతువులోంచి బయ టపడేవి. సత్తయ్య ప్రదర్శకుడే కాదు. వాగ్గేయకారుడు. అనేక ప్రాచీ రాగతాళగతులను తన సమకాలీన ప్రేక్షకు లకు నజరానాలుగా వంచేవాడు. సత్తయ్య ఒక్కడు. కానీ తన ప్రదర్శనలో.. అనేకం. ఒక దైవపాత్ర, ఒక హాస్య గాడు, సూత్రధారి, మహిళా పాత్ర, ఒక గుర్రం, ఒక రుద్ర శంకరుడు, వెరసి నవరసబ్రహ్మ. తానొక్కడే. కానీ డ్యూయెట్ నృత్యంలో హీరో, హీరోయిన్ ఆయనే.
సత్తయ్య గతం కాదు. ఆయన వర్తమాన జీవి. మీరు ఇంత గొప్ప ప్రదర్శకులు కదా. ఎంతసేపూ ఒగ్గు కథేనా? కళ్ల ముందు ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊర్కుంటారా అని అడిగితే అప్పటికప్పుడు పర్యావరణ రణం అనే ఒగ్గుకథ రాసి ప్రదర్శించాడు. గత ఏడాది వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక మహాసభలను ఆయనతోనే ప్రారంభించాం. లిఖిత రచయితల సభలకు ఆయనను పిలుచుకున్నం దుకు వందలాది ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వెలిబు చ్చారు. కళాకారునికి, రచయితకు కావల్సింది శాలువా పోగులు, ఓ జ్ఞాపిక కాదు. భుక్తి గడ వడం. కుటుంబం నడవడం ముఖ్యం. అతనికి అవి కల్పించలేకపోయాం.
ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. సంతాప ప్రకటనలు ఠంచన్‌గా కురిపించే విద్య తెలిసిన వారికి ఇలాంటి జానపద కళాకారులకు బతుకు గడిచే మార్గం కోసం ఆలోచనలు చేయవలసిన తరుణం ఇది. చుక్క సత్తయ్యని కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టక తప్పదు. అదీ సత్తయ్యకు ఇచ్చే నిజమైన నివాళి.
-జయధీర్ తిరుమలరావు
వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక
మొబైల్ : 99519 42242