గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం | Mohan write a article on vietnam war | Sakshi
Sakshi News home page

గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం

Published Sun, Apr 26 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం

గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం

40 ఏళ్ల క్రితం ఈ రోజు - విజయవాడ ‘విశాలాంధ్ర’ డైలీ ఆఫీసు. ఆ రోజుల్లో టీవీ కంప్యూటర్ నెట్ లేవు. మా న్యూస్ డస్క్ దగ్గర టెన్షన్. పాతికేళ్లు హోరాహోరీగా సాగిన వియత్నాం యుద్ధం క్లైమాక్స్ కొచ్చింది. టీవీ ప్రింటర్ల చుట్టూ కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నాం. రోల్ అవుతున్న న్యూస్ బైట్స్‌ని చింపుకొస్తున్నాం.
 
 ‘‘వియత్నమీస్ ఆర్మీ టాంకులు దక్షిణానికొస్తున్నా యా? ఎక్కడున్నాయి. అమెరికన్ బాంబింగ్ ఎక్కడ జరుగుతోంది?’’ మా ఎడిటర్ సి. రాఘవాచారి ఆత్రంగా అడుగుతున్నారు. ‘‘క్వాంగ్రీటీ, దానాంద్, హువే సిటీల మీద కార్పెట్ బాంబింగ్ జరుగుతోంది. సైగాన్ గురించి న్యూస్ లేదు’’ మేం చెప్పాం.
 
అంతకుముందు బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో ఒక్క సప్తమ నౌకాదళం మన మద్రాసు, విశాఖ పక్క నుంచి పైకి బెంగాల్ వేపు కదుల్తుందంటేనే ఠారుకు చచ్చాం. అలాటిది మన కేరళ కంటే కొంచెం పెద్దగా ఉండే బుల్లి వియత్నాంను ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి చుట్టు ముడుతుందంటే గుండెలు అవిసిపోవూ. ఇది పాతికేళ్లు గా డేవిడ్‌కీ గొలియత్‌కీ మధ్య సాగుతున్న పోరు. మొదట నాటు తుపాకులూ, విమానాలు కూల్చే గన్స్ తప్ప పెద్దగా ఏమీలేని దక్షిణ వియత్నాం విముక్తి సైన్యం కొద్ది కాలంగా అధునాతనమైన ట్యాంకులూ, మెషీన్ గన్స్‌ని రష్యా ఇవ్వగా తెచ్చుకుంది.
 
అచ్చు కేరళ లాగా, కోనసీమ, గోవాల్లాగా కొబ్బరి చెట్లూ, అరటి తోపులూ వరి పొలాలతో మన ఊరు లాగే పచ్చగా మెరిసే వియ త్నాం బొగ్గులా తయారయింది. ‘‘ఒరేయ్ మీరు రాతి యుగంలోకెళ్లే వరకూ బాంబింగ్ చేస్తాం’’ అని ఒక అమె రికన్ జనరల్ వార్నింగ్ ఇచ్చినంత పనీ జరిగింది. దురా క్రమణ చేసినప్పుడల్లా అక్కడ ప్రజాస్వామ్యాన్నీ, ఎల క్షన్లనీ తెచ్చి పెడతామని చెప్పడం అమెరికాకి ఓ ఫ్యాషన బుల్ మంత్రం.
 
దాంతోనే ఓ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా రివాజు. అప్పటికి ఈ కీలు బొమ్మ పాలన సైగాన్‌ని దాటి దేశంలో ఒక్క ఇంచికి మించింది లేదు. ప్రజలంతా విముక్తి సేన వెంటే. కొద్ది మంది తైనాతీలు తప్ప. మరి ఓటమి సూటిగా కళ్లలోకి తేరిపార చూస్తున్నందువల్ల అమెరికాకి పిచ్చెత్తి ఒక నాటు ఆటంబాంబు వేసినట్టు అన్ని నగరాలనూ, పట్నాలనీ ధ్వంసం చేసేస్తే? అంత సీన్‌లేదు. చాలా కష్టం.
 
ఎందుకంటే ఒక్క యుద్ధ రంగంలోనే కాదు ప్రపం చమంతటా దౌత్య రంగంలో కూడా వియత్నాం ప్రజాభి ప్రాయాన్ని పోగేసింది. అప్పటికే 58 వేల మంది అమెరి కన్ సైనికుల శవపేటికలు అమెరికాకు వరసగా చేరాయి. ఒక్కో కాఫిన్ తీసుకోవడానికొచ్చే కుటుంబాలన్నీ ఈ యుద్ధం ఇక వద్దని వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు చేస్తున్నా యి. హాలీవుడ్‌లో ఎక్కువ మంది స్టార్స్, వైట్ హౌస్ ముందుకు వేనకు వేలు ప్రజల్తో వచ్చి యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పిడికిళ్లు బిగిస్తున్నారు.
 
ప్యారిస్ శాంతి చర్చ ల్లో కేసింగర్ లాంటి కొమ్ములు తిరిగిన శకుని వాదాలను,  ఊరూ పేరూ లేని మేడమ్ బిన్ (దక్షిణ వియత్నాం తాత్కాలిక విప్లవ ప్రభుత్వ విదేశాంగ మంత్రి) పచ్చి అబద్ధాలని ప్రపంచ వేదిక మీద నిరూపించింది. ఆ రోజుల్లో ఆవిడ ఢిల్లీ వస్తే ఘనంగా పౌర సన్మానం జరి గింది. వేదిక మీద ఇందిరా గాంధీ లేచి నడిచి వచ్చి మేడమ్ బిన్‌ను ఆప్యాయంగా కౌగలించుకుంది. అమెరి కాకి ఒళ్లు మండింది.
 
ఆ పాతికేళ్లూ అది ఒట్టి యుద్ధంగా సాగలేదు. అమె రికన్ సాహిత్యం - కథ, నవల, కవితల్లోకీ, నాటకాల్లోకీ వియత్నాం నేరుగా దూసుకొచ్చి కూచుంది. అమెరికా, లాటిన్ అమెరికా చర్చిలలో ఆదివారం అయిందంటే లిబ రేషన్ థియాలజిస్టుల సెర్మన్‌ల నిండా వియత్నామే. మమ్మల్ని, దున్నల్లాగా, కబేళాకి తోల్తారా అంటూ ‘‘లుఫె లో సోల్జర్’’ అని బాబ్ మార్లే వచ్చి జమైకాలో పాడిన పాట ప్రపంచమంతా మళ్లీ మళ్లీ మారుమోగింది.

అప్పు డు కలకత్తా వీధుల్లో ప్రెసిడెన్సీ కాలేజీ స్టూడెంట్స్‌తో కలసి, దేశమంతటి నుంచి పోగైన మేమంతా ప్రదర్శ నలు చేశాం. గావుకేకలు పెట్టి ఎస్‌ప్లనేట్ సెంటర్లో నినా దాలిచ్చాం. ‘‘ఆమ్ర నామ్ తూమ్ర శామ్’’ ఒక్కడు అరిస్తే ‘వియత్‌నామ్, వియత్‌నామ్’ వేల గొంతులందుకున్నా యి. ‘‘ఏ గంగా మీకాంగ్ ఏకీ హై’’ ఒకరు మొదలెడితే ‘‘భూలోమత్ భూలోమత్’’ అంటూ మైదానం దద్దరిల్లిం ది. ఇక్కడే కాదు అమెరికన్ నల్లజాతుల పౌర హక్కుల ఉద్యమాలకు వియత్నాం పతాకమయింది. ఆఫ్రికాలో వరసగా విముక్తి అవుతున్న దేశాలకు స్వేచ్ఛా నినాద మైంది.
 
యూరోపియన్ రాక్ బాండ్స్, బీటిల్స్, బీట్నిక్, రోలింగ్ స్టోన్స్ పాటలకు పల్లవి అయింది. వియత్నాం కోసం ప్రపంచ ప్రజ అంతా ఒక్కటయింది. అమెరికా ఒంటరిదయింది. అయినా హిట్లర్‌కి ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ మాస్కోని బాంబ్ చేయమని వందలాది విమానాలకు పదే పదే ఆర్డర్లిచ్చినట్టుగా అమెరికా కూడా ఆర్డర్లిచ్చింది.
 
గంటల తరబడి సస్పెన్స్‌తో ఎదురు చూస్తున్న మా ముందు టెలిప్రింటర్లు టక టకమంటూ రొద చేశాయి. గుండెలు పట్టుకు చూశాం. ఎ.పి, ఎ.ఎఫ్.పి. వార్తా సం స్థల కబురు. సైగాన్‌లోకి విముక్తి సేన టాంకులు దూసు కొచ్చాయి. అయిపోయింది. అర్థమయిపోయింది ఇరవ య్యవ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంలో వియత్నాం బక్క రైతు బందిపోటు డేగ రెక్కలు తెగనరికాడు.
 
కాసేపట్లోనే మళ్లీ వార్తలు. దుర్భేద్యమైన అమెరికన్ రాయబార కార్యాలయం గేట్లను వియత్నాం టాంకులు గుద్దుకుంటూ, ముక్కలు చెక్కలు చేసుకుంటూ ముందు కెళ్లాయి. పై అంతస్థు మీదికి చేరిన అమెరికన్ సైనికులూ, ఎంబసీ స్టాఫ్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దిక్కులు చూస్తున్నారు. అమెరికన్ హెలికాప్టర్లు పైన చక్కర్లు కొడుతూ కిందికి తాళ్లనిచ్చెనలు జారవిడుస్తున్నాయి.

అందిన వాళ్లు అంది పుచ్చుకుని ఎగబాకి హెలికాప్టర్లలో కూచుంటున్నారు. లాటిన్ అమెరికా లాంటి ఖండాలనే గుప్పెట్లో బిగించిన మహా సామ్రాజ్యానికి ఏం గతి పట్టింది? ఎంత సిగ్గు చేటు? ఇంతా చేసి సప్త సముద్రాల అవతల బుల్లి వియత్నాం పెరట్లో కుక్క చావు చావాల్సి వచ్చింది. ఆసియా అంతా పులకరించింది. ప్రపంచం పలవరించింది.
 
మా మొహాలన్నీ విప్పారాయి. అందరూ చిరున వ్వులు రువ్వుతున్నారు. న్యూస్ ఎడిటర్ టీలు ఆర్డర్ చేశారు. అందరం సిగరెట్లు వెలిగించాం. మొహాలు వెలిగిపోతున్నాయి ‘పతాక శీర్షిక’ ఏం పెట్టాలి? ‘బాక్స్ ఐటమ్’లు ఏం రాయాలి?  చకచకా రాసేశాం.
 
మర్నాడు అమెరికన్ పత్రికలన్నీ ‘సైగాన్ పతనం’ అని ‘సైగాన్ సరెండర్స్ టు రెడ్స్’ అని బ్యానర్ పెట్టా యి. మా బ్యానర్ ‘సైగాన్ విముక్తి’ అని. నిజానికి పతనమైంది అమెరికా.
 (వియత్నాంలో అమెరికా ఓటమికి నేటికి 40 ఏళ్లు)
 (వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్: 77028 41384)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement