మహిళ గడప దాటని కాలం. పాక్షికంగా సహగమనం పాటిస్తున్న రోజులు. అలాంటి సందర్భంలో ఒక మహిళ ధిక్కారస్వరం మహిళా లోకానికి మేలుకొలుపు వంటిదే. ఆమె పురుషాధిక్య సమాజం మీద ఎగసిపడిన తిరుగుబాటు కేతనం. ఆమె ‘నాయకురాలు నాగమ్మ’, పల్నాటి వీరవనిత నాగమ్మ. పల్నాడు మోమున విరిసిన పొద్దుతిరుగుడు పువ్వు. ఒక్క పలనాటి చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే విశిష్టమైన మహిళా మణి.
నాగమ్మ చరిత్రలో కనిపించే తొలి దేశీయ మహిళా మంత్రి. 12వ శతాబ్దంలో పల్నాడు రాజ్యానికి మహామంత్రి ఆమె. సుపరిపాలన అందించినట్టు ఖ్యాతి గన్న వనిత. ప్రజానేత. ఆమెతోనే మహిళల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఆమెను కొన్ని సృజనాత్మక రచనలలో ప్రతినాయకురాలుగా కవులూ నాటకకర్తలూ చిత్రించి ఉండవచ్చు. కానీ చరిత్రలో ఆమె ఆధిక్యానికి గొప్ప నిరద్శనం ఆమెకు మాత్రమే పరిమితమైన ‘నాయకురాలు’ బిరుదు. రాణీ రుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీ బాయిల కంటె ముందే పాలన చేపట్టింది. ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న దక్షురాలు నాగమ్మ. అత్యంత ఆదర్శనీయమైన విదేశ సంబంధాలకు ఉన్నతమైన మార్గాలను అన్వేషించిన మైత్రీ పరిమళం ఆమె. తమ మధ్య ఉన్న విభేదాలను విస్మరించి పల్నాటి యుద్ధంలో ఆమెకు పొరుగు రాజ్యాల వారు సాయం అందించడం విశేషం. ఇది ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. ఆమె ఖడ్గధారి అయిన యోద్ధ. ఒక అపురూప విదుషీమణి. ఆ రోజుల్లోనే సంస్కృతం, కన్నడ, తమిళ, మలయాళ భాషలను అభ్యసించింది. సంగీతం కూడా నేర్చుకుంది.
బ్రహ్మనాయుడికి దీటుగా నిలబడి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న యుక్తురాలైన రాజకీయవేత్త నాగమ్మ. బ్రహ్మనాయుడి వ్యూహాలను ఛేదిస్తూ తన ప్రభువు నలగామరాజునూ, రాజ్యాన్నీ కాపాడింది ఆమె. రాజ్యం ముక్కలు కాకుండా అడ్డుకుంది. పల్నాటి చరిత్ర తొలి వీరగాథ. అందులో కీలక పాత్ర నాగమ్మదే. పల్నాడులో ఒకవైపు నాగమ్మ, మరోవైపు బ్రహ్మనాయుడు నాయకులుగా ఉండి జరిపించిన యుద్ధం పల్నాటియుద్ధం. గుంటూరు జిల్లాలోని రణస్థలి కారంపూడి.
ఈ ఘట్టాన్ని ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు విస్మరించలేదు. తెలుగు ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ అందులో పల్నాటి యుద్ధంలో వలె ఇప్పటికీ స్మరించుకుంటున్న యుద్ధాలు కనిపించవు. కార్తీక అమావాస్య రోజున ప్రారంభమైనయుద్ధం ఐదు రోజులు జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన బ్రహ్మనాయుడి వర్గం వారి ఆయుధాలను కారంపూడిలో ఇప్పటికీ ఏటా పూజిస్తారు. ఈ ఉత్సవం పేరు ‘కొణతముల’. అక్కడ నుంచి సరిగ్గా ఐదు తెలుగు తిథుల తరువాత వచ్చే మార్గశిర ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకు నాగమ్మ, ఆమె పక్షాన పోరాడిన వారి స్మృత్యర్థం గురజాలలో ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమికి జరిగే సిడిమాను ఊరేగింపు ఇందులో ముఖ్యమైనది. కారెంపూడిలో వీర విద్యావంతులు పల్నాటి వీర చరిత్రను గానం చేస్తారు. గురజాలలో పిచ్చిగుంటల వారు ఆ కథలు చెబుతారు. అక్కడా ఇక్కడా ఐదురోజులు ఈ కథాగానం జరుగుతుంది. కానీ ఇటీవల పిచ్చిగుంటల వారి కథాగానం నిలిచిపోయింది.
వెహైచ్‌కె మోహనరావు పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా (నేడు గురజాలలో సిడిమానోత్సవం సందర్భంగా)
నాగమ్మ... తొలి నాయకురాలు
Published Mon, Dec 16 2013 11:45 PM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM
Advertisement
Advertisement