నేనూ-నా గొడవ! | nenu naa godava | Sakshi
Sakshi News home page

నేనూ-నా గొడవ!

Published Sun, Sep 6 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

నేనూ-నా గొడవ!

నేనూ-నా గొడవ!

మానవ సమాజంలో ప్రతిదీ తప్పుడు ప్రయోగమే.

మానవ సమాజంలో ప్రతిదీ తప్పుడు ప్రయోగమే. ప్రయోగాత్మకం బతుకు. బతుకు ప్రయాణం నిండా అడుగడుగున ప్రయోగాలు. బతుక్కి బతుకు తప్ప మరో సిద్ధాంతం లేదు. పెద్ద ఆపదలను అపాయాలను, ప్రాణాపాయాన్ని తప్పుకొని, చిన్న అపాయానికి హానికి తలొగ్గి బతుకు సాగించడం. అదే ప్రాణి ధర్మం. అది ప్రతి ప్రాణికి సహజంగానే అబ్బుతుంది. ఎన్నో రకాలుగా తమతమ ఆలోచనల పరిధిలోనే మార్గాన్ని నిర్ణయించి, ఆ మార్గాన్నే మనిషిని నడిపింపజేయాలనే మేధావి వర్గంలోని వ్యక్తుల కృషి. దానికి ఎన్నో 'ఇజాలు' 'చాదస్తాలు' ఇదంతా ఎందుకంటే మనిషి సహజంగా ఆలోచించి స్వంత నిర్ణయానికి రాకుండా చేయడానికి.


 ఈ గందరగోళ బతుకులో పోలు పొంతనలేని ఆలోచనలలో, సమకూర్చుకున్న అస్తవ్యస్త అవగాహనతో, వ్యక్తిగతమైన మనుగడలో క్రమం స్థైర్యం లేక తికమక. మన ఆలోచనలతో సరిపడేవారితో మైత్రి, లేనివారితో వైరం. ఈ చీకట్లోనే ప్రమిదలు వెలిగించాలనే తహతహ. గీసిన అగ్గిపుల్లలు మాత్రం కాలి ఆరిపోతున్నాయి. కొద్దిపాటి వెలుగు. అంతే మళ్లీ చీకటి. క్షణక్షణం రకరకాలుగా ఆలోచన.
 దగా కోరు దండుగీడు దర్జాగా బతుకుచుండ సక్రమ మార్గాయానము సహియించెడి వాడెవ్వడు? 'అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నాహృదిని ఇన్ని ఆవేదనలు. పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె. మాయమోసము చూచి మండిపోవును ఒళ్ళు' మరి అవకతవకలను సవరించే శక్తిసామర్థ్యాలా? అవి లేవు 'తప్పు దిద్దగలేను, దారి జూపగలేను, తప్పు చేసిన వాని దండింపగాలేను, అవకతవకలనేను సవరింపలేనపుడు పరుల కష్టాలతో పని యేమి నాకనెడు అన్యులను జూచైన హాయిగా మనలేను.'ఇట్లా వుంది నా మతి-గతి. అంటే బతుకు వ్యక్తిగత వ్యవహారాలైనా, ప్రజా జీవితంలోనైనా అడుగడుగడుగునా సందేహాలు. చాలీచాలని అవగాహనతో రకరకాల ప్రశ్నలు. ఏవో సమాధానాలు. నిర్ణయాలు. నిర్ణయానుసారంగానే నడిచే ప్రయత్నం. ఏదో కొద్దిపాటి సఫలత. ఆశించిన ఫలితాలు అనుకున్న రీతిలో కలుగకపోవడం. అది చూచి మరో ప్రయత్నం-మరో రీతిలో.


 సామరస్యం స్వభావానికే సరిపడదు. కాబట్టి, అడుగడుగునా సంఘర్షణ. సామరస్యంతో బతకడంలో సంఘర్షణ తగ్గడం నిజమేగాని, దానికి  కావలసిన పరిస్థితులు వుండి దానికి మనసు సిద్ధము కావలె గద- అయినా బ్రతుకు తప్పదు. బ్రతక్క తప్పదు. బ్రతుకు సాగిపోతున్నది. దాన్ని ఏదో ఒక సూత్రానికి బిగించి వేలాడి బతుకుదామనుకుంటే ఆ సూత్రం పుటుక్కుమనగానే చతికిలబడటం. నాగతిని ఆకట్టడానికి, నన్ను అదుపులో పెట్టడానికి ఎన్ని శాస్త్రాల కట్టడాలు. ఎన్నెన్ని ఇజాల గతులు. ఏదో సూత్రానికి, తత్వానికి, ఇజానికి కట్టుబడిపోయి జీవిస్తున్న ప్రాణులకు స్వేచ్ఛాజీవనం సున్న. పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి చెవులు, పరాయి బాస, పరాయి నడక, పరాయి చేతలు అన్నీ పరాయివే. అట్లా కాకూడదని నా తిక్క. చిరకాలం బతకాలని వుండగా చావొస్తే ఎట్లా అని కాదు ప్రశ్న. అనుక్షణం చావుకై నిరీక్షిస్తూ బతకడం ఎట్లా అన్నది ప్రశ్న. పరిస్థితులెట్లా వున్నాయని కాదు. వున్న పరిస్థితుల్లో మనమెట్లా వున్నాము అన్నదే; ఇట్లా వుంది మానవుని మనుగడ. ఇదంతా మమత లేని మనుగడ అని నా గొడవ.


 ఎట్లా జీవించాలని కోరిక? 'ఇచ్ఛయే నా ఈశ్వరుడని కచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను, జరిగిన దానిని తలవను, జరిగే దానికి వగవను, ఒరగనున్నదిదియదియని ఊహాగానము చేయను, సంతసముగ జీవింపగ సతతము యత్నింతు గాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపలేను' ఇది అభిలాష, ఆదర్శము.


 ('నా గొడవ'కు కాళోజీ రాసుకున్న ముందుమాట నుంచి సంక్షిప్తంగా; సౌజన్యం: కాళోజీ ఫౌండేషన్, వరంగల్/హైదరాబాద్)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement